చైనా కంపెనీలకు చుక్కలే?

ABN , First Publish Date - 2020-07-03T07:31:44+05:30 IST

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే దిశలో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే డిజిటల్‌ స్ర్టైక్‌ ప్రకటించి, 59 చైనా యాప్‌లను నిషేధించిన మోదీ సర్కారు.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తుల నాణ్యతపైనా దృష్టిపెట్టింది. నాణ్యతలో ఏమాత్రం

చైనా కంపెనీలకు చుక్కలే?

  • దిగుమతులపై కేంద్రం నిఘా ముమ్మరం.. బీఐఎస్‌ ప్రమాణాలపై తనిఖీలు
  • పోర్టుల వద్దే తనిఖీ బృందాలు.. కస్టమ్స్‌ విభాగంలోనూ సిబ్బంది పెంపు
  • వారికీ బీఐఎస్‌ ప్రమాణాల తనిఖీ అధికారం.. నాణ్యతలో తేడా ఉంటే వెనక్కే
  • వెంటనే కంపెనీకి నోటీసులు.. సమాధానం ఇచ్చేదాకా సేవల సస్పెన్షన్‌
  • లైసెన్సు రద్దుకూ సన్నాహాలు.. చైనాకు వెళ్లి కంపెనీల్లో తనిఖీలకూ సిద్ధం
  • చైనా నుంచి 56 రకాల దిగుమతులు.. ఐటీ, ఉక్కు శాఖలకూ అధికారం


(సెంట్రల్‌ డెస్క్‌)

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే దిశలో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే డిజిటల్‌ స్ర్టైక్‌ ప్రకటించి, 59 చైనా యాప్‌లను నిషేధించిన మోదీ సర్కారు.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తుల నాణ్యతపైనా దృష్టిపెట్టింది. నాణ్యతలో ఏమాత్రం తేడాలున్నా.. సరుకును తిప్పిపంపేలా చర్యలు ప్రారంభించింది. ముందెన్నడూ లేనివిధంగా.. వారం రోజుల క్రితం భారత ప్రమాణాల విభాగం(బీఐఎస్‌) అధికారులను పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీల వద్ద మోహరించింది. దేశంలోని ఏడు పోర్టుల ద్వారా దిగుమతులు జరుగుతుండగా.. అన్నింటి వద్ద బీఐఎస్‌ బృందాలను నియమించింది. ఇప్పటి వరకు పోర్టుల్లో సాధారణ తనిఖీల బాధ్యత కస్టమ్స్‌ విభాగం పరిధిలో ఉండగా.. ఇప్పుడు వారికి కూడా బీఐఎస్‌ ప్రమాణాలను తనిఖీ చేసే అధికారమిచ్చింది. చైనా నుంచి భారత్‌కు బీఐఎస్‌ పరిధిలోని 56 ప్రధాన ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. బీఐఎస్‌ ద్వారా లైసెన్సులను పొందిన 390 కంపెనీలు ఆయా ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. వీటికి తోడుగా.. కేంద్ర ఐటీ శాఖ, భారీ పరిశ్రమలు, ఉక్కు, రసాయనాల శాఖ.. ఇలా పలు శాఖలకు సంబంధించిన ఉత్పత్తుల దిగుమతులకూ బీఐఎ్‌సలో రిజిస్టర్‌ అవ్వడం తప్పనిసరి. రిజిస్టర్‌ అయిన సంస్థల విషయంలోనూ బీఐఎస్‌ తనిఖీలు నిర్వహిస్తుంది. మొబైల్‌ ఫోన్లు, వాటి విడిభాగాలు, కంప్యూటర్లు, హార్డ్‌డి్‌స్కలు, మొమొరీ ఉత్పత్తులు వంటివన్నీ కేంద్ర ఐటీ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా.. బీఐఎస్‌ వద్ద రిజిస్టర్‌ అయిన కంపెనీలు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే సిమెంటు, ఉక్కు, స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, పీవీసీ పైపులు, విద్యుత్తు పరికరాల విషయంలోనూ  ఆయా శాఖల నియంత్రిత మార్గదర్శకాలను చైనా కంపెనీలు తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 


జాబితా పెద్దదే..

చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల జాబితా భారీగానే ఉంది. వాటిల్లో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, కంప్యూటర్లు, వాహనాల టైర్లు, ట్యూబులు, విండ్‌షీల్డ్‌లో వాడే గ్లాసులు, విద్యుత్తు వ్యవస్థలో ఉపయోగించే పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గృహోపకరణాల్లో ఏసీలు, ఏసీ మోటార్లు, రూం హీటర్లు, ఇస్త్రీ పెట్టెలు, కెపాసిటర్లు, బ్యాటరీలు, సోలార్‌ ప్యానళ్లు, వ్యవసాయ రంగంలో ఉపయోగించే నీటి పంపులు, పైపులు, బిందు-తుంపర సేద్యాల పరికరాలు, సిమెంటు, పలు ఆటోమేటెడ్‌ గృహోపకరణ వస్తువులు ఉన్నాయి. ‘‘మనం వేర్వేరు దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటుంటాం. మన దేశంలో ఏయే ఉత్పత్తులకు బీఐఎస్‌ గుర్తింపు(ఐఎ్‌సఐ మార్క్‌)ను తప్పనిసరి చేశామో.. దిగుమతి చే సుకునే ఆయా ఉత్పత్తులకూ ఐఎ్‌సఐ తప్పనిసరి. చైనా నుంచి 56 రకాల ఉత్పత్తులను బీఐఎస్‌ లైసెన్సింగ్‌ ద్వారా దిగుమతి చేసుకుంటున్నాం. పలు శాఖల పరిధిలో వచ్చే ఉత్పత్తులు మరికొన్ని ఉంటాయి. వాటికి లైసెన్స్‌ ఇవ్వకున్నా.. బీఐఎస్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి నాణ్యతను కూడా మేము పరిశీలిస్తాం’’ అని బీఐఎస్‌ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. నాణ్యతపై భారత్‌ నిఘా పెట్టడం చైనా కంపెనీలకు భారీ నష్టమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బీఐఎస్‌ లైసెన్సు ఉన్న కంపెనీల్లో.. ఆ సంస్థ ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చు. ప్ర మాణాలను పరిశీలించవచ్చు. ఉత్పత్తుల నాణ్యతలో ఏ మాత్రం తేడాలొచ్చినా, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా నోటీసులిచ్చి, ఆయా కంపెనీల్లో ర్యాండమ్‌ తనిఖీలు చేపడతారు. అవే తనిఖీలను పోర్టుల వద్దా చేపడతారు. తనిఖీల్లో భాగంగా చేపట్టే పరీక్షల్లో ఆయా ఉత్పత్తులు నాణ్యతలేనివని తేలితే.. సరుకును తిప్పిపంపడమే కాకుండా.. మొత్తం బ్యాచ్‌ నంబర్లను నిషేధిస్తారు. అలాంటి కంపెనీల లైసెన్సును సస్పెన్షన్‌లో పెట్టి, నోటీసు జారీ చేస్తారు. వెంటనే కంపెనీలకు నోటీసులు పంపిస్తారు. సమాధానం వచ్చే దాకా ఆ సేవలను సస్పెన్షన్‌లో ఉంచుతారు. అవసరమైతే చైనా వెళ్లి ఆ కంపెనీ లను తనిఖీ చేస్తారు. ఐటీ, ఉక్కు శాఖలకూ ఆ అధికారం ఇస్తారు. కాగా, చైనాకు చెందిన 390 కంపెనీలు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. వీటిల్లో సగానికిపైగా కంపెనీల గడువు ఈ నెల మొదటివారం నుంచి నవంబరు చివరికల్లా ముగుస్తుంది. వీటి రెన్యూవల్‌ సమయంలో నిక్కచ్చిగా పరీక్షలు నిర్వహించాలని బీఐఎ్‌సకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 


ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూవుటీవో) నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నాం. బీఐఎస్‌ ప్రమాణాలను పాటించని కంపెనీల ఉత్పత్తులను తిప్పిపంపుతున్నాం. వెంటనే ఆయా కంపెనీల లైసెన్సుల్ని సస్పెండ్‌ చేసి, ప్రమాణాల అభివృద్ధికి గడువిస్తున్నాం. నిర్ణీత గడువు తర్వాత లైసెన్సుల్ని రద్దు చేస్తాం. మొదటిసారిగా పోర్టుల్లో బీఐఎస్‌ తనిఖీలను ప్రారంభించాం. 

- ఎం.వి.ఎ్‌స.డి. ప్రసాదరావు, బీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌


పరీక్షలు ఎలా చేస్తారంటే..?

ఉదాహరణకు ఓ సీలింగ్‌ ఫ్యాన్‌ను తీసుకుంటే.. బీఐఎస్‌ అధికారులు ఆ ఫ్యాన్‌లోని మోటార్‌ వైండింగ్‌ మొ దలు, విడిభాగాలను పరిశీలిస్తారు. చివరకు కెపాసిటర్‌ నూ బీఐఎస్‌ ప్రమాణాల మేరకు ఉండాల్సిందే. ఆ తర్వా త.. రెక్కలను మినహాయించి, ఫ్యాన్‌ ప్రధాన భాగాన్ని నిర్ణీత ఎత్తు(6 అడుగులు) నుంచి కింద పారేస్తారు. ఈ పరీక్షలో ఫ్యాన్‌ ప్రధాన భాగానికి ఎక్కడా పగుళ్లు రాకుండా ఉండాలి. లోపలి భాగాలు(బేరింగ్‌ లోని బాల్స్‌ కూడా)  దెబ్బతినకుండా ఉంటేనే.. ఆ ఉత్పత్తి పరీక్షలో పాసైనట్లు. ఫెయిలైతే.. నోటీసిచ్చి, ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలని కంపెనీలకు సూచిస్తారు. 

Updated Date - 2020-07-03T07:31:44+05:30 IST