కంకుల్ని ఎలా తింటే మంచిది?

ABN , First Publish Date - 2021-07-30T19:16:42+05:30 IST

వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కెలోరీలు ఉంటాయి. అన్ని రకాల ముడిధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండిపదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగా కొంత చక్కెర, పీచుపదార్థాలు ఉంటాయి.

కంకుల్ని ఎలా తింటే మంచిది?

ఆంధ్రజ్యోతి(30-07-2021)

ప్రశ్న: మొక్కజొన్నలో పోషక విలువలేమిటి? కంకుల్ని ఉడికించి తినడం మంచిదా, కాల్చి తింటే మంచిదా? 


- రజనీ, సూర్యాపేట


డాక్టర్ సమాధానం: వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కెలోరీలు ఉంటాయి. అన్ని రకాల ముడిధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండిపదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగా కొంత చక్కెర, పీచుపదార్థాలు ఉంటాయి. మొక్కజొన్న పేలాల్లో (పాప్‌కార్న్‌) కూడా పీచుపదార్థం ఉంటుంది. బి3, బి5, బి6, బి9 మొదలైన విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ లాంటి ఖనిజాలు మొక్కజొన్న గింజలో, పేలాల్లోనూ లభిస్తాయి. అధికస్థాయిలో పిండిపదార్థాలు ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారు వివిధ రకాల ధాన్యాలతో పాటు మొక్కజొన్నను కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. మొక్కజొన్నలో ఉండే ల్యూటిన్‌, జియాగ్జాథిన్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొక్కజొన్న కంకులను తక్కువ నీటిలో ఆవిరిపై ఉడికిస్తే వాటిలోని పోషకాలకు ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు. ఒక వేళ బొగ్గులపై లేదా మంటలో నేరుగా కాల్చినట్టయితే ఎక్కువ కాలినా లేదంటే కొద్దిగా మాడినా ఆ గింజలను తీసేసి మిగిలినవి తినడం మంచిది. మాడిన గింజల్లో క్యాన్సర్‌ కారక పదార్థాలు ఉండే అవకాశం ఎక్కువ.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-07-30T19:16:42+05:30 IST