రైతుకు గిట్టుబాటేనా..?

ABN , First Publish Date - 2020-09-19T07:18:23+05:30 IST

విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు వ్యవసాయరంగ బిల్లులను కేంద్రం మంగళ, గురువారాల్లో లోక్‌సభలో గట్టెక్కించింది.

రైతుకు గిట్టుబాటేనా..?

వ్యవసాయ రంగ బిల్లులు వరమా? శాపమా?

వ్యవసాయ రంగ కార్పొరేటీకరణకు మార్గమా?

మార్కెట్‌ కేంద్రాలు క్రమేణా అంతరిస్తాయా..?

ఆహార భద్రతను ఇవి దెబ్బతీస్తాయా..?

మధ్య దళారీ వ్యవస్థకు నిజంగా చెల్లుచీటీ పడేనా?


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు వ్యవసాయరంగ బిల్లులను కేంద్రం మంగళ, గురువారాల్లో లోక్‌సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వీటి ఆమోదమూ లాంఛనప్రాయమే! దేశ వ్యవసాయ రంగంలో సమూల సంస్కరణలకు ఇవి నాంది అని, కొద్ది సంవత్సరాల్లోనే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ బిల్లులు కార్పొరేట్లకు, బడా వ్యాపారులకు లాభం చేకూరుస్తాయని, రైతు వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని రాష్ట్రాలు అంటున్నాయి.


పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల్లో రైతులు రోడ్డెక్కారు. ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. బీజేపీకి దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ ఈ బిల్లులకు నిరసనగా కేబినెట్‌ నుంచి వైదొలగింది. బీజేపీతో తెగతెంపులు చేసుకునే యోచనలో ఉంది.


కనీస మద్దతు ధర వ్యవస్థను, వ్యవసాయ మార్కెట్‌లను ఈ బిల్లులు నిర్వీర్యం చేస్తాయని రాష్ట్రాలు, రైతు సంఘాలు నినదిస్తుంటే- ఎంఎ్‌సపీ వ్యవస్థ కొనసాగుతుందని, ఏపీఎంసీలపై రాష్ట్రాలకున్న అధికారాలను ఇవి హరించవని వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌చెప్పారు. అసలు ఈ బిల్లుల్లో ఏముంది? వాటిపై ఉన్న అభ్యంతరాలేంటి..?




1. వ్యవసాయ మార్కెట్‌ బిల్లు


దీనికే రైతు ఉత్పత్తుల వ్యాపారం (ప్రోత్సాహం-వెసులుబాటు) బిల్లు అని పేరు. 


ముఖ్యాంశాలు..

పండించిన పంటను రైతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌ కేంద్రాల్లోనే (ఏపీఎంసీల్లోనే) అమ్మనవసరం లేదు.  దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు.  ఇందుకు రైతుల నుంచి ఛార్జీలూ వసూలు చెయ్యరు.

మార్కెటింగ్‌, రవాణా ఖర్చులను తగ్గించి రైతు ఉత్పత్తులు మంచి ధర పొందేట్లు చేయడం.

అధిక దిగుబడి ఉంటే ఆ సరుకు లేనిచోట్ల అమ్ముకోవచ్చు.  ఎలకా్ట్రనిక్‌ ట్రేడింగ్‌కు వెసులుబాట్లు


అభ్యంతరాలివీ...

ఏపీఎంసీల అవసరం ఉండదు కనుక రైతులు రారు. ఫలితంగా రాష్ట్రాలు మార్కెట్‌ ఫీజు వసూలు చేయలేవు. ఇది భారీ ఆదాయ నష్టం.

మండీల నుంచి ఉత్పత్తులు బయట విక్రయానికి పోతే అక్కడ ఉండే వేలాది మంది కమిషన్‌ ఏజెంట్లు రోడ్డున పడతారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)-ఆధారిత సేకరణ వ్యవస్థ క్రమేణా రద్దవుతుంది

ఏపీఎంసీల్లో ఈ-నామ్‌ అనే ఎలకా్ట్రనిక్‌ ట్రేడింగ్‌ పద్ధతి ఉంది. ఇది ఏపీఎంసీలు ఉంటేనే ఉపయోగం.ఇవి లేనపుడు ‘ఈ-నామ్‌’ రద్దయిపోతుంది.




2. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ బిల్లు


దీనికే  ‘‘ధరవరలపై హామీ- వ్యవసాయ సేవలు, రైతుకు అధికారం-రక్షణ బిల్ల్లు’’ అని పేరు. 


అంశాలు...

రైతులు వ్యవసాయరంగ వ్యాపారం చేసే సంస్థలు, బడా రిటైలర్లు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులతో  ధర విషయమై  ముందస్తుగా అంటే పంట రావడానికి, వేయడానికి ముందే ఓ ఒప్పందానికి రావడానికి వీలు.

దేశంలో 86 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే. ఐదు హెక్టార్లలోపు పొలం ఉన్న వారు కాంట్రాక్టు కుదుర్చుకోవచ్చు.  

మార్కెట్‌ ఎప్పుడెలా ఉంటుందోననే భయం ఇక రైతుకుండదు. పెద్ద వ్యాపారులకు వెళ్లిపోతుంది.

మార్కెటింగ్‌ఖర్చు తగ్గి, ఆదాయంపెరుగుతుంది.

దళారీ వ్యవస్థ లేకుండా రైతులు తమకు నచ్చిన ధరకు కాంట్రాక్టు కుదుర్చుకోవచ్చు.  

వివాదాలు నెలకొంటే దానికి పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు. నిర్దిష్ట కాలావధిలోగా పరిష్కారం.


అభ్యంతరాలు..

రైతులు తమకు కావాల్సిన రేటు పొందలేరు. రిటైలర్లదే పైచేయి అవుతుంది. 

బడా వ్యాపారులు, టోకు వ్యాపారులు చెప్పినదే నడుస్తుంది. రైతు వాదించలేడు. లాభపడలేడు

చిన్న, సన్నకారు రైతులతో ఒప్పందాలకు బడా సంస్థలు, టోకు వ్యాపారులు సుముఖత చూపరు. సాంకేతికత వినియోగంలో కార్పొరేట్లదే పైచేయి అవుతుంది. 




3. అత్యవసర సరుకుల బిల్లు


అంశాలు..

పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనెగింజలు, ఉల్లి, బంగాళాదుంపలు మొదలైనవి అత్యవసరసరుకుల జాబితా నుంచితొలగింపు

యుద్ధం లాంటి అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఈ సరుకుల నిల్వపై ఉన్న పరిమితులు ఎత్తివేత

వ్యవసాయ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి అవకాశం

వ్యాపారంలో ప్రైవేటు పెట్టుబడిదారుల మితిమీరిన జోక్యం నివారణకు వీలు

కోల్డ్‌ స్టోరేజీలు, ఆధునిక ఆహార సరఫరా వ్యవస్థల ఏర్పాటు లాంటి మౌలిక సౌకర్యాల్లో పెట్టుబడులకు వీలు

రైతులు, వినియోగదారులిద్దరికీ ఉపయుక్తమయ్యేలా ధరల స్థిరీకరణ

మార్కెటింగ్‌లో పోటీతత్వం పెంచే అవకాశం

ఉత్పత్తులు ఎక్కువగా వృథా కాకుండా చూడవచ్చు


అభ్యంతరాలు..

‘అసాధారణ పరిస్థితుల’ సమయంలో ధరవరలు పెరిగిపోవచ్చు

పెద్ద కంపెనీలు భారీగా నిల్వ చేసుకునేందుకు వీలు... తద్వారా అవి రైతులను తమ టర్మ్స్‌కు అనుగుణంగా శాసిస్తాయి. రైతులు తగిన ధర పొందలేరు

ఈ మధ్యే ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని నిషేధించింది. అలాంటి పరిస్థితుల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయా, వర్తిస్తే ఏ మేరకు... అన్నవి శేష ప్రశ్నలు. మొత్తం మీద రైతు నష్టపోతాడన్నది వ్యవసాయరంగ నిపుణుల మాట.





నిపుణులు చెప్పేదిదీ...


(1) అతి పెద్ద భయాలు:

వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఈ బిల్లుల వల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), వ్యవసాయ మార్కెట్‌ యార్డుల విధానం అంతమైపోతాయన్నది అతిపెద్ద భయం. ఉదాహరణకు పంజాబ్‌లో దాదాపు 12 లక్షల వ్యవసాయ కుటుంబాలున్నాయి. 28,000 మంది రిజిస్టర్డ్‌ కమిషన్‌ ఏజెంట్లున్నారు. వ్యవసాయ కేంద్రాల ద్వారానే ఎఫ్‌సీఐ లాంటి సంస్థలు ఎక్కువ సేకరణ జరుపుతాయి. ఇపుడు రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ... అన్న విధానం వల్ల  ఎఫ్‌సీఐకి సేకరణ తగ్గుతుంది. ఒక్కో కమిషన్‌ ఏజెంటుకూ 2.5 శాతం కమిషన్‌ వస్తుంది. అది కాస్తా పోతుంది. ఇది కాక- మండీ ఫీజు కూడా పోతుంది.  


(2) సమాఖ్య వ్యవస్థకు దెబ్బ..?

వ్యవసాయం, మార్కెట్లన్నవి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు (14, 28). తాజా బిల్లుల ద్వారా రాష్ట్రాల హక్కులపై కేంద్ర పెత్తనం మొదలవుతుంది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాల వాదన. అయితే కేంద్రం దీన్ని తిరస్కరిస్తోంది.  


(3) ఎంఎస్పీ వ్యవస్థ అంతరిస్తుందా..?

ఓ సంస్థ అధ్యయనం ప్రకారం.... వ్యవసాయ మార్కెట్‌ కేంద్రాలనేవి అటు కొనుగోలుదారుల-విక్రయదారుల మధ్య సమతూకం  సాధించి రైతుకు తగిన గిట్టుబాటు ధర కల్పించేవి. బయ్యర్లకు, కమిషన్‌ ఏజెంట్లకు, ప్రైవేటు సంస్థలకు లైసెన్సులిచ్చి, వారినుంచి తగిన రీతిలో మార్కెట్‌ ఫీజు వసూలు చేసి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడం వీటి బాధ్యత. తాజా బిల్లులతో ఈ ఏపీఎంసీల గుత్తాఽధిపత్యం పోతుంది. ఇది కనీస మద్దతు ధర ప్రకారం నిర్దిష్టంగా సరుకు కొనే వ్యవస్థను దెబ్బతీసి క్రమేణా రద్దయేట్లు చేస్తుంది. ఏపీఎంసీల్లో లోటుపాట్లుంటే సవరించాలే కానీ.. ఇలా నిర్వీర్యం చేయడం సరికాదని నిపుణులు అంటున్నారు.


కార్పొరేట్లు ధరలను శాసిస్తాయా?

ధరల హామీ బిల్లు బయటకు చెప్పేది రైతులు దోపిడీకి గురికాకుండా అడ్డుకోవడమని! కానీ ధరవరలెంత. ఎలా ఉండాలన్న దానికి సంబంధించి బిల్లులో ఎలాంటి ప్రతిపాదనలూ లేవు. ఇది ప్రైవేటు సంస్థలకు, కార్పొరేట్లకు అపరిమిత స్వేచ్ఛనిస్తుంది. వారు తమకు నచ్చినట్లు ధరలను నిర్దేశించి రైతు శ్రమను దోచుకోవడానికి ఉపకరిస్తుంది. 


కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ మంచిదా..?

కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ అనేది దేశ రైతులకు కొత్తేం కాదు. కొన్ని ఆహార ధాన్యాల విషయంలో అక్కడక్కడా అనధికారికంగానూ, చెరకు, కోళ్ల పరిశ్రమల్లాంటి వాటిలో అధికారికంగానూ సాగుతున్నదే. ఈ బిల్లు ద్వారా దీన్ని క్రమబద్ధీకరించడం వల్ల అసంఘటిత వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో పడవచ్చు. ప్రైవేటు, కార్పొరేట్లను ఎదుర్కొనడానికి వనరుల లేమి రైతును ఇబ్బంది పరచవచ్చు.


Updated Date - 2020-09-19T07:18:23+05:30 IST