Abn logo
Oct 22 2021 @ 00:14AM

నకిలీవా..నాణ్యమైనవా?

బిల్లు లేకుండా విక్రయించిన పొద్దుతిరుగుడు విత్తనాల ప్యాకెట్‌

బ్లాక్‌లో పొద్దుతిరుగుడు విత్తనాలు ?

అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు

విత్తనాలు తీసుకున్న రైతులకు బిల్లులివ్వని వైనం

ఇప్పటికే చాలా గ్రామాల్లో పంట సాగు చేస్తున్న రైతులు


తొగుట, అక్టోబరు 21 : ప్రభుత్వం ఒక వైపు వరి వేయొద్దని చెబుతూనే ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని గ్రామాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. దానికనుగుణంగా విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు పంటల సాగుకోసం పడరాని పాట్లు పడుతున్నారు. రబీలో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగుచేస్తారు. రైతుల అవసరాలను గమనించిన వ్యాపారులు విత్తనాలను బ్లాక్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు మొక్కజొన్న పంట కోత అయిపోగానే పొద్దుతిరుగుడు పంట సాగుకు సమాయత్తమయ్యారు. దుక్కులు దున్ని కాలువలు చేసుకొని సిద్ధం చేశారు. ఈ క్రమంలో పొద్దు తిరుగుడు విత్తనాల కోసం జిల్లాలో ఎక్కడ తిరిగినా దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో వ్యాపారులు బ్లాక్‌ దందాకు తెరలేపారు. వాస్తవంగా ఒక్కో విత్తన కంపెనీ ప్యాకెట్‌ రూ.1200 నుంచి రూ.1500లకు మించి ఉండదు. కానీ వ్యాపారులు రెండు కిలోల పొద్దు తిరుగుడు విత్తనాల బ్యాగ్‌ను రూ.2500 విక్రయిస్తున్నారు. విత్తనాలు నాణ్యమైనవా కాదా అని చూడకుండానే రైతులు కొనుగోలు చేయడం గమనార్హం. కొనుగోలు చేసిన విత్తనాలకు వ్యాపారులు బిల్లులివ్వం అని రైతులతో కరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం. ఇంతా జరుగుతున్న వ్యవసాయ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పంట దిగుబడి రాక నష్టపోతే రైతు పరిస్థితి ఏమిటన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇకనైనా అధికారులు స్పందించి అధిక ధరలకు విత్తనాలను అమ్మే వ్యాపారులపై చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా చూడాల్సిన అవసరమున్నది. అంతేకాకుండా అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ను వివరణ కోరగా పొద్దుతిరుగుడు విత్తనాలు జిల్లాలో అందుబాటులో లేని విషయం వాస్తవమేనని చెప్పారు. నకిలీ విత్తనాలు ఎవ్వరు అమ్మిన ఉపేక్షించేది లేదని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బ్లాక్‌లో విత్తనాల దందా చేస్తున్న వ్యాపారులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ రైతు ఎమ్మార్పీ ధర మాత్రమే చెల్లించి రశీదు తీసుకోవాలన్నారు. వ్యాపారులు రైతులను ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారమందిస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు.