మేలు చేసేనా?

ABN , First Publish Date - 2021-12-24T05:49:15+05:30 IST

ఆధార్-ను ఓటరుకార్డుతో అనుసంధానించిన బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును సోమవారం ప్రభుత్వం లోక్‌సభలో మధ్యాహ్నం రెండున్నర తరువాత ప్రవేశపెట్టినప్పుడు అంత కీలకమైన బిల్లు...

మేలు చేసేనా?

ఆధార్-ను ఓటరుకార్డుతో అనుసంధానించిన బిల్లును రాజ్యసభ మంగళవారం ఆమోదించింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును సోమవారం ప్రభుత్వం లోక్‌సభలో మధ్యాహ్నం రెండున్నర తరువాత ప్రవేశపెట్టినప్పుడు అంత కీలకమైన బిల్లు విషయంలో ఇంత హడావిడి ఎందుకని విపక్షాలు ప్రశ్నించాయి. దశాబ్దాలుగా పోగుబడిన గందరగోళాన్ని, ఎన్నికల చట్టాల్లో ఉన్న లోటుపాట్లను ఒక్కదెబ్బతో సరిదిద్దగలిగే మహత్తరమైన బిల్లు అని ప్రభుత్వం చెబుతున్నందున కచ్చితంగా దానిమీద లోతైన చర్చ జరగాలి కదా అన్నది విపక్షాల వాదన. అవసరమైతే స్థాయీసంఘానికీ పోవాలన్నాయి. మంత్రి కిరణ్ రిజిజు తాను చెప్పదల్చుకున్నదేదో చెప్పారు, విపక్ష నాయకులు తమ అనుమానాలూ భయాలేవో వెలిబుచ్చారు. మొత్తానికి అధికార విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్యన కేవలం పాతిక నిముషాల్లో ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభలో సమష్టిగా పోరాడదామని కొన్ని పార్టీలు సంకల్పించినా, అక్కడ కూడా వాటి మాటనెగ్గలేదు. కనీసం ఓటింగ్ కూడా జరపకుండా ఉభయసభల్లోనూ మూజువాణీ ఓటుతో ప్రభుత్వం తాను అనుకున్నది నెగ్గించుకుంది. నిజానికి ఎప్పుడో మొదలైన కసరత్తు ఇది. బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఆధార్‌తో ఓటరుకార్డులను అనుసంధానించాలని ఆరేళ్ళ క్రితమే ఎన్నికలసంఘం అనుకున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యత దృష్ట్యా ప్రతీదానినీ ఆధార్‌తో లంకెపెట్టడం కుదరదనీ, ప్రభుత్వ రాయితీ పథకాలకు తప్ప మిగతావాటికి ఆధార్‌ను వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పడంతో ఈ వ్యవహారం ముందుకు కదల్లేదు. ఆ తరువాత 2018లో సర్వోన్నత న్యాయస్థానమే తుదితీర్పులో సరేననడంతో ప్రజాప్రాతినిథ్య చట్టంలో ఆ మేరకు సవరణలు చేయమని ఎన్నికల సంఘం ప్రతిపాదించడం, న్యాయశాఖ రంగంలోకి దిగడం తెలిసినవే. జనవరిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల పద్దెనిమిదేళ్ళు నిండినా అనేకులు జాబితాలో చేరలేకపోతున్నారనీ, ఇప్పుడు ఏడాదిలో మరో మూడు తేదీలను అదనంగా చేర్చడం వల్ల అందరూ ఓటర్లయ్యే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం అంటోంది. ఆధార్ అనుసంధానం కానంతమాత్రాన ఎవరిపేర్లూ జాబితానుంచి తీసివేయబోమనీ, అనుసంధానం కూడా స్వచ్ఛందమేనని కేంద్రం ప్రకటిస్తూనే ఈ బిల్లుద్వారా బంధనాలు బాగానే బిగించింది. కొత్తగా చేరుతున్నవారూ, ఇప్పటికే పేర్లున్నవారూ ఆధార్‌తో తమ ఓటును అనుసంధానించుకోవాలని అంటున్నది. ఆధార్ లేనంత మాత్రాన దరఖాస్తులు తిరస్కరించబోమని ప్రభుత్వం హామీ ఇస్తున్నా అది అమలుకు నోచుకునేదేమీ కాదు. ఆధార్ ఉంటేనే ఓటుహక్కు ఇస్తామని వాళ్ళూ అంటారు, వీళ్ళూ వివరాలు ఇస్తారు. ఓటుహక్కును తిరస్కరించేందుకు విస్తృత అధికారాలున్న అధికారులకు ఇది ఆయుధంగా ఉపకరించే అవకాశం ఉన్నది. ఇక, మిగతా ఆధారాలతోనూ పని నడుస్తుందని తెలిసినవాళ్ళు మాత్రమే ఈ మినహాయింపు ఉపకరించుకోవచ్చు. ఆధార్ ఇవ్వకపోవడానికి తగిన కారణం చూపాలన్న నిబంధన వల్ల ప్రభుత్వం చేస్తున్న ‘స్వచ్ఛందం’ వాదనకు విలువలేకపోతున్నది. తగిన కారణం అన్నది ఏమిటో తెలియదు కానీ, రానురాను అది మరింత కొత్త కఠిన నిర్వచనాలు సంతరించుకునే అవకాశమూ ఉన్నది.


ఆధార్‌తో జతచేరినందువల్ల తమకు గిట్టని ఓటర్లను గుర్తించడం, కొందరికి ఓటుహక్కు దక్కకుండా చేయడం తేలికవుతుందని విపక్షాల అనుమానం. ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు. ఓటు హక్కు దేశప్రజలకు మాత్రమే దక్కేది. ఆధార్‌ని అక్రమమార్గాల్లో సంపాదించే వీలున్నందున ఓటరుకార్డుతో అనుసంధానం వల్ల పౌరులు కానివారు కూడా ఓటర్లయ్యే అవకాశం ఉన్నదని విపక్షాల వాదన. వ్యక్తిగత గోప్యతను ఆధార్ ఉల్లంఘిస్తున్నదన్న వాదన ఎలాగూ ఉన్నదే. ఆధార్ డేటా భద్రత అన్నింటికంటే ప్రధాన సమస్య. లక్షలమంది ఆధార్ వివరాలు లీకవుతున్నవార్తలు వింటూనే ఉన్నాం. గతంలో ఓటరు-ఆధార్ అనుసంధానం ప్రయోగాత్మకంగా జరిగినప్పుడు కేవలం సాంకేతిక కారణాలతో ఉభయతెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిపేర్లు గల్లంతైన విషయం తెలిసిందే. అలాగే, నెట్, మొబైల్ సిగ్నల్ సహా అనేక కారణావల్ల ఆధార్ తో ధృవీకరించే ప్రయత్నాలు కనీసం పదోవంతు విఫలమవుతున్నాయని సదరు సంస్థే ఒప్పుకుంది. వివిధ వ్యవస్థల వైఫల్యం వల్ల ఈ ప్రక్రియ అంతిమంగా దేశ పౌరుడి అన్యాయం చేయకపోతే చాలు. 

Updated Date - 2021-12-24T05:49:15+05:30 IST