Abn logo
Apr 9 2021 @ 01:01AM

కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి సాధ్యమేనా?

కంపెనీలకు ముడిసరుకుల కష్టాలు

సరఫరాకు అమెరికా, బ్రిటన్‌, జర్మనీ నో

స్వావలంబన లేకనే ఈ సమస్యలు

ఇతర వ్యాక్సిన్లపైనా ప్రభావం: నిపుణులు


స్పెషల్‌ డెస్క్‌ :

కరోనా సెకండ్‌ వేవ్‌తో టీకాలకు డిమాండ్‌ పెరిగింది. కానీ.. ముడిసరకుల కొరత టీకాల ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీస్తోంది. దీంతో టీకాల ఉత్పత్తి లక్ష్యాలను కంపెనీలు ఏమాత్రం అందుకోలేవనే సందేహాలు వినిపిస్తున్నాయి. ముడిసరకుల కొరత ఇలాగే కొనసాగితే.. ఇతర దేశాలకు టీకాలు పంపించే సంగతి పక్కన పెడితే మన దేశంలో కనీసం కొందరికయినా టీకాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా టీకాలకు అవసరమైన ముడిసరుకులను మన కంపెనీలు.. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనాతో టీకాలకు పెరిగిన డిమాండ్‌ మన కంపెనీలకు సమస్యగా మారింది. ‘‘మా దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసేందుకు అవసరం కాబట్టి మీకు ముడిసరుకులు సరఫరా చేయలేం’’ అని అమెరికా, బ్రిటన్‌ చేతులెత్తేశాయి. జర్మనీ కూడా అదే దారిలో నడుస్తున్నది. ఫలితంగా.. భారత కంపెనీలు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ 2021లో 70 కోట్ల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నది. దాంతో పాటు.. ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇక.. సీరం సంస్థ 2021 ఏప్రిల్‌ నుంచి నెలకు 10 కోట్ల కొవిషీల్డ్‌ టీకాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొవిషీల్డ్‌తో పాటు ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి నోవావాక్స్‌ కంపెనీ సహకారంతో కొవోవాక్స్‌ టీకాను మార్కెట్‌లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌.. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది.  అనుమతులు లభించిన వెంటనే 10 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక.. అరబిందో ఫార్మా  అమెరికాకు చెందిన కోవాక్స్‌ సంస్థతో టీకా ఉత్పత్తి కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 40 నుంచి 45 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసేందుకు ఈ కంపెనీ సన్నాహాలు చేసుకుంటోంది. ఇలా అన్ని కంపెనీల లక్ష్యాలను లెక్కలోకి తీసుకుంటే.. దాదాపు 120 కోట్లకు పైగా డోసులు అవుతాయి. కానీ అన్ని డోసుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల సరఫరా లేదని, ఈ లక్ష్యాన్ని సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేననేది నిపుణుల అభిప్రాయం. 


ఏమిటా ముడిసరుకులు?

వ్యాక్సిన్‌ తయారీకి ఫీటల్‌ బొవైన్‌ సీరం ప్రధానం. నిర్వీర్యం చేసిన వైర్‌సను వృద్ధి చేసే పెద్ద ఫ్లాస్క్‌ వంటి పరికరం మరో కీలక పరికరం. సెల్‌ కల్చర్‌ చేసేందుకు, ఫెర్మెంటేషన్‌కు అవసరమైన ఒకసారి మాత్రమే ఉపయోగించే బయోరిట్రాక్టర్‌ బ్యాగ్‌లతో పాటు కొన్ని రసాయనాలు వ్యాక్సిన్‌ తయారీలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇంకా... సింగిల్‌ యూజ్‌ సిస్టమ్స్‌, ఫిల్టర్లు, గామా స్టెరిలైజేషన్‌, టీకా ఉంచడానికి ఉపయోగించే వయల్స్‌ వంటివాటి సరఫరా ప్రధానంగా తగ్గిపోయింది.

50% మందికి టీకా ఇస్తేనే...

మన దేశంలో ప్రస్తుతం రెండు కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్నాయి. దేశ అవసరాలకు తగినన్ని వ్యాక్సిన్లు తయారు చేయడం ఈ రెండు కంపెనీలకు మాత్రమే సాఽధ్యమయ్యే పనికాదు. భారత్‌లో మరో 19 కంపెనీలు ఇతర వ్యాక్సిన్తు తయారు చేస్తున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. దేశంలో 50 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ ఇస్తేనే కరోనా వైర్‌సను మనం నిరోధించగలం. మరిన్ని వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తీసుకురావడం ఒక్కటే అందుకు మార్గం.

- డాక్టర్‌ పీకే ఘోష్‌, భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ రంగ మాజీ సలహాదారు

స్వావలంబన సాధిస్తేనే..

జీవశాస్త్ర పరిశోధనలు, వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన రసాయనాలు, ఇతర ముడిసరుకులను సొంతగా ఉత్పత్తి చేసుకోవడంపై భారత్‌ ఇంతకాలం దృష్టి సారించలేదు.  దేశంలో ఉన్న పరిశోధన సంస్థలకు మార్గదర్శనం చేసేందుకు నిపుణులతో ఒక నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. ఏ సంస్థ ఏ రంగంలో పరిశోధనలు చేసి, ఏ ఉత్పత్తులను కనిపెట్టాలనే అంశంపై వారు దిశానిర్దేశం చేస్తారు. తద్వారా అన్ని ముడిసరుకులు, రసాయనాలను మనమే ఉత్పత్తి చేసుకునే వీలుంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూరుశాతం స్వావలంబన సాధిస్తేనే ఏ వైరస్‌ దాడులనైనా తిప్పికొట్టగలం 

- డాక్టర్‌ కోటేశ్వరరావు, నియోడెల్‌ ఫార్మా అధినేత, హైదరాబాద్‌

చైనా సిద్ధమే.. ఆ సరుకు మాకొద్దు!

టీకా తయారీకి అవసరమైన కీలకమైన ముడిసరుకుల ఎగుమతిపై అమెరికా, యూరప్‌ నిషేధం విధించడంతో దేశంలో కొవిడ్‌ టీకాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. ‘భారతదేశం సహా, ప్రపంచంలోనే ఎన్నో దేశాల్లో కరోనా టీకా ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకుల ఎగుమతిని మీరు ఆపేస్తున్నారు’ అంటూ అమెరికాకు వెళ్లి నిరసన తెలపాలని ఉంది. ముడిసరుకులను సరఫరా చేయడానికి చైనా సిద్ధంగానే ఉందిగానీ.. నాణ్యత సమస్యలు, ఇతర సరఫరా నియంత్రణల  నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి సీరమ్‌ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధంగా లేదు.  ఈ ఏడాది జూన్‌ నాటికి ఉత్పత్తిని 10-11 కోట్ల డోసులకు పెంచే ప్రయత్నంలో ఉన్నాం. తక్కువ ధరకు టీకా ఇవ్వడానికి ప్రస్తుతం మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. 

-అదర్‌ పూనావాలా, సీఈవో, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

Advertisement
Advertisement
Advertisement