ఇదా జాతిహితం?

ABN , First Publish Date - 2020-02-22T07:31:20+05:30 IST

జాతి శ్రేయస్సుకు దోహదం చేసేదేమిటి? దేశ పాలకులు చేస్తున్నదేమిటి? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 16న వారణాసిలో మాట్లాడుతూ ఇలా ఉద్ఘాటించారు: ‘జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్యాంగ అధికరణం 370 ని రద్దుచేశాము...

ఇదా జాతిహితం?

నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు కంకణం కట్టుకున్నది. ఆ కర్తవ్య నిర్వహణలో ప్రభుత్వం అహోరాత్రులు అవిరామంగా శ్రమిస్తోంది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడం, ప్రపంచ అగ్రరాజ్యంగా వెలుగొందే శుభవేళ వడిగా వచ్చేస్తోంది! అవునా, మోదీగారూ?


జాతి శ్రేయస్సుకు దోహదం చేసేదేమిటి? దేశ పాలకులు చేస్తున్నదేమిటి? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 16న వారణాసిలో మాట్లాడుతూ ఇలా ఉద్ఘాటించారు: ‘జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్యాంగ అధికరణం 370 ని రద్దుచేశాము; పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చాము. దేశ సమైక్యత, సమగ్రతలను పటిష్ఠం చేసేందుకు ఈ నిర్ణయాలు అనివార్యమైనవి. అంతర్జాతీయంగా పలు ఒత్తిళ్లు వస్తున్నా ఈ నిర్ణయాలపై పునరాలోచన ప్రసక్తే లేదు. వాటికి మేము కట్టుబడి వున్నాం. ఎప్పటికీ వాటికి మేము నిబద్ధులమయ్యే వుంటాము’. 


శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే మాటలు సుమా! ‘జాతీయ ప్రయోజనాలు’- అనే ఆకర్షణీయ మాటలు సప్రమాణత(కరెక్ట్‌నెస్)ను సూచించవు; అంతిమత్వం లేదా నిశ్చయత్వం(ఫైనాలిటీ)ని సంకేతించే మాటలవి. జాతి ప్రయోజనాలను సంరక్షించేందుకే ఆ నిర్ణయాలు తీసుకున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు. కనుక, 370 అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం పై విమర్శలు నిలిచిపోవాలని, ఆ అంశాలపై చర్చలను ముగించాలని ప్రధానమంత్రి ఆశిస్తున్నారు మరి.


భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వున్న గత ఆరు సంవత్సరాలలో చోటు చేసుకున్న పరిణామాలన్నిటిపైన నా దృష్టిని సారించాను. మోదీ సర్కార్ చేపట్టిన, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవి తప్పనిసరి అని ప్రభుత్వం తరచు చెబుతున్న చర్యలను లెక్కించడానికి ప్రయత్నించాను. సదరు చర్యల జాబితా సుదీర్ఘమైనది. వివాదాస్పదమైనది కూడా అని నేను చెప్పక తప్పదు. నేను సంగ్రహించగలిగిన సదరు చర్యలను వరుసగా ప్రస్తావిస్తాను. 


తొలుత ప్రస్తావనార్హమైనవేమిటో నేను చెప్పనవసరం లేదు. అవి: డీమానిటైజేషన్ (నోట్ల రద్దు), జీఎస్టీ నిర్ణయాన్ని జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్నామని మోదీ ప్రభుత్వం ఇప్పటికీ నిస్సంకోచంగా పదే పదే చెబుతున్నది. ఆ నిర్ణయం ఒక మహా తప్పిదమని విమర్శకులు అంటున్నారు. వినాశనకర పర్యవసానాలను వారు ఎత్తి చూపుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థికవ్యవస్థ నుంచి నగదు పీల్చివేయబడినది. నగదు ఆధారితమైన వ్యవసాయం, భవన నిర్మాణం, కిరాణా వ్యాపారం, స్వయం ఉపాధి రంగాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిలో అత్యధిక భాగం ఇప్పటికీ మూతపడేవున్నాయి. నోట్ బందీ విఘాతం నుంచి అవి కోలుకునే పరిస్థితిలేదనే చెప్పవచ్చు. డీమానిటైజేషన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారు చాలా కాలం నిరుద్యోగులుగానే ఉండిపోయారు. ఇప్పటికీ ఆ దుర్గతిలో వున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. నోట్ల రద్దు జాతీయ ప్రయోజనాల కోసమే తీసుకున్నారా లేక వాటిని ఉపేక్షించి తీసుకున్నారా అనే విషయమై అంతిమ తీర్పు ఇంకా వెలువడవలసివున్నది. 


జీఎస్టీ (వస్తుసేవల పన్ను) చట్టాన్ని జాతీయ ప్రయోజనాలను పటిష్ఠం చేసేందుకు తీసుకువచ్చామని ప్రభుత్వం ఉద్ఘాటిస్తోంది. చట్టాన్ని సక్రమంగా రూపొందించి, జీఎస్టీ రేటు ఏకైక రేటు అయివున్నట్టయితే ప్రభుత్వ ఉద్ఘాటన యుక్తమైన వాదన అని ఒప్పుకోవచ్చు. అయితే జీఎస్టీ అనుభవాలు అలా లేవు కదా. పైగా జీఎస్టీ అమలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ముందుగా సిద్ధం చేసుకోలేదు. కొత్త పన్ను వ్యవహారాల విషయంలో పరిపాలనా యంత్రాంగానికి శిక్షణ ఇవ్వకుండానే అమలును ప్రారంభించారు! ఇంచుమించు రెండు సంవత్సరాల అనంతరం కూడా జీఎస్టీ వసూళ్ళు అంచనాల కంటే తక్కువగానే వున్నాయి. రాష్ట్రాలకు ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారం చెల్లించడం లేదు. వాపస్ చేయవలసిన సొమ్ము విషయం ప్రభుత్వం, వ్యాపార వర్గాల మధ్య ఒక ఎడతెగని వివాదంగా వున్నది. జీఎస్టీని ఉపసంహరించడం జాతీయ ప్రయోజనాలకు దోహదం చేయదు. అలాగని ప్రస్తుత రూపురేఖలు, రేట్లతోనే దాన్ని కొనసాగించడం కూడా దేశ ప్రయోజనాలకు తోడ్పడదు గాక తోడ్పడదు. 


అధికరణం 370ని వదిలించుకోవడానికి అధికరణం 370ని ఉపయోగించుకోవడం జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకేనని మోదీ ప్రభుత్వం వాదిస్తోంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కూడా అందుకేనని పాలకులు ఘంటాపథంగా చెబుతున్నారు. 2019 ఆగస్టు 5 నుంచి కశ్మీర్ లోయను పూర్తిగా మూసివేశారు. కశ్మీరీలకు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా చేశారు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకేనని మరి చెప్పాలా? ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను ఆరు నెలల పాటు ఎటువంటి ఆరోపణలు లేకుండానే గృహనిర్బంధం పాలు చేశారు. ఆ తరువాత ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించి ఆ నిర్బంధాన్ని మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించారు-, ఎలాంటి అభియోగాలు మోపకుండానే సుమా! ఇదంతా ఎందుకోసం? జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకేనట. హెబియస్ కార్పస్‌ పిటిషన్లపై విచారణను ఏడు నెలలకు పైగా నిలిపివేయడం జాతీయ ప్రయోజనాలను సంరక్షించేందుకేనని మోదీ సర్కారు పదే పదే చెబుతున్నది. ఈ వాదనతో కశ్మీర్‌లో ఏ ఒక్కరూ సహజంగానే ఏకీభవించడం లేదు. 


అసోం రాష్ట్రంలో జాతీయ పౌరుల పట్టికను రూపొందించడం జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకేనని మోదీ ప్రభుత్వం పేర్కొంది. ఆ రాష్ట్రంలో 19,06,657 మంది విదేశీయులు లేదా అక్రమ వలసదారులు ఉన్నట్టు జాతీయ ప్రయోజనాల పరిరక్షణ రీత్యా గుర్తించారు. ఈ ‘విదేశీయులు లేదా అక్రమ వలసదారుల’ను ‘చెదపురుగులు’గా ఈసడిస్తూ, వారిని 2024 సంవత్సరం నాటికి దేశం నుంచి పంపించివేస్తామని మోదీ ప్రభుత్వం అంటున్నది. ఆ ‘విదేశీయుల’లో 12 లక్షల మందికి పైగా హిందువులు కూడా ఉన్నట్టు తెలిసిరావడంతో 1955 నాటి పౌరసత్వ చట్టం సవరణకు పూనుకున్నారు. సవరణ చట్టం రూపకల్పన, పార్లమెంటులో ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందడం కేవలం 72 గంటల్లో పూర్తిచేశారు. ముస్లిమేతర ‘విదేశీయులు’ దేశంలోనే వుండిపోయేందుకు ఈ సవరణ చట్టం అనుమతిస్తుంది. ముస్లింలు మాత్రం ఈ దేశాన్ని విడిచి వెళ్ళాలి (వెళ్ళకపోతే గెంటి వేస్తారు) . జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకువచ్చిన ఈ సవరణ చట్టం మున్నెన్నడూ లేనివిధంగా దేశంలో అల్లకల్లోలానికి కారణమయింది. జుబేదా బేగం అనే భారతీయురాలు తాను భారతదేశ పౌరురాలినేని ధ్రువీకరిస్తున్న 15 డాక్యుమెంట్లను సమర్పించింది. అయినా జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకై ప్రభుత్వం ఆమె పౌరసత్వ హక్కును తిరస్కరించింది. 


పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకై దేశద్రోహ అభియోగాలు మోపారు. లాఠీలు ఝళిపిస్తున్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నవారిపై పోలీసు కాల్పులకు ఆదేశిస్తున్నారు (ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే ఇటువంటి కాల్పుల్లో 23 మంది చనిపోయారు). ఇదంతా జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకే సుమా! పౌరసత్వ సవరణ చట్టంపై పరోక్ష విమర్శ చేసిన ఒక నాటికను ప్రదర్శించినందుకుగాను ఒక ఉపాధ్యాయుడిని, ఒక విద్యార్థి తండ్రిని నిర్బంధించారు, -జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు. ఎన్నికల ర్యాలీలలో గోలీ మారో అని అరిచేలా గుంపులను రెచ్చ గొట్టారు. అధికారంలో వున్న ఒక ముఖ్యమంత్రిని ‘ఉగ్రవాది’ అని దుయ్య బట్టారు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకే పాలకులు ఇలా వ్యవహరించారు. ఢిల్లీ విధానసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీని భారత్, పాకిస్థాన్‌ల మధ్య పోరాటంగా అభివర్ణించారు. ఎందుకో మరి చెప్పాలా? 


160 నిమిషాల బడ్జెట్ ప్రసంగాన్ని చదవటం (అసంపూర్ణంగానే అయినప్పటీకీ) సైతం జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికే. అలాగే కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీల రూపేణా రూ.1,45,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా- ఎందుకో మరి చెప్పాలా? సవరించిన అంచనాల ప్రకారం వ్యవసాయం, ఆహారభద్రత, మధ్యాహ్న భోజన పథకం, నైపుణ్యాల అభివృద్ధి,  ఆయుష్మాన్ యోజన (ఆరోగ్య భద్రతా పథకం) మొదలైన వాటిపై వ్యయాల్లో కోత విధించారు, -జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకే. 2017–-18 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగం 6.1 శాతం మేరకు పెరిగిందని, వినియోగం 3.7 శాతం మేరకు తగ్గిపోయిందిని వెల్లడించిన జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదికలు బహిర్గతం కాకుండా అడ్డుకున్నారు. ఎందుకు? జాతీయ ప్రయోజనాలను కాపాడే నిమిత్తమని మరి చెప్పాలా? 


సుప్రసిద్ధ ‘పెద్ద మనుషులు’ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా, సందేసర సోదరులు, ఇంకా ఇతరులు గప్‌చుప్‌గా దేశం నుంచి పరారయ్యారు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకే వారు అలా వెళ్ళి పోవడానికి అనుమతించడం జరిగింది మరి. బ్రిటన్‌లో వున్న లలిత్ మోదీని భారత్‌కు అప్పగించాలని ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి చేయక పోవడం కూడా - ఎందుకో మరి చెప్పాలా? ఈ జాతీయ ప్రయోజనాల జాబితాకు అంతూపొంతూ లేదు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకై ప్రభుత్వం అహోరాత్రులు అవిరామంగా శ్రమిస్తోంది. భారతదేశ స్థూల దేశియోత్పత్తి 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడం, ప్రపంచ అగ్రరాజ్యంగా, అవును, ప్రపంచ అగ్రరాజ్యంగా వెలుగొందే శుభవేళ వడిగా వచ్చేస్తోంది! అవునా, మోదీగారూ?


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2020-02-22T07:31:20+05:30 IST