మాట ఇచ్చి ఇంత మోసమా?

ABN , First Publish Date - 2022-01-21T05:39:38+05:30 IST

‘మాట ఇచ్చి రివర్స్‌ పీఆర్సీ ఇస్తారా? ఆశుతోశ్‌ మిశ్రా కమిటీ రిపోర్టును మూసిపెట్టి తనకు కావాల్సినట్లుగా సీఎస్‌తో రిపోర్టు తెప్పించుకుని అమలు చేస్తారా?

మాట ఇచ్చి ఇంత మోసమా?

మడమ తిప్పిన సీఎం డౌన్‌ డౌన్‌
ఫ్యాప్టో నాయకుల ఆగ్రహం
కలెక్టరేట్‌ ముట్టడి.. ఉద్రిక్తత
భారీగా తరలి వచ్చిన టీచర్లు

కర్నూలు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ‘మాట ఇచ్చి రివర్స్‌ పీఆర్సీ ఇస్తారా? ఆశుతోశ్‌ మిశ్రా కమిటీ రిపోర్టును మూసిపెట్టి తనకు కావాల్సినట్లుగా సీఎస్‌తో రిపోర్టు తెప్పించుకుని అమలు చేస్తారా? ఈ పీఆర్సీ రద్దు చేసేవరకు ఉద్యమిస్తాం’ అని ఫ్యాప్టో నాయకులు సీఎంను హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సీఎం జగన్‌ను గద్దె దింపడం ఖాయమని  స్పష్టం చేశారు. ఫ్యాప్టో (ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 1,500 మంది ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్‌ ముట్టడికి తరలి వచ్చారు. వీరికి ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి, ఏపీజీఈఏ నేతలు సంఘీభావం తెలిపారు. ముట్టడి ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ ఓంకార్‌ యాదవ్‌, సెక్రటరీ జనరల్‌ గట్టు తిమ్మప్ప ఆధ్వర్యంలో జరిగింది. ‘మడమ తిప్పిన సీఎం.. సీఎం డౌన్‌ డౌన్‌.. పీఆర్సీ రద్దు చేస్తారా? గద్దె దిగుతారా?’ అన్న నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంగణ దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ సీఎం ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. చివరకు పెన్షనర్లకు కూడా అన్యాయం జరిగేలా ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు తిమ్మన్న మాట్లాడుతూ ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు వర్తించవనే విషయాన్ని సీఎం గుర్తించాలన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పీఆర్సీ నిర్ణయించాలని అన్నారు. ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని అన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు సురేశ్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు వ్యతిరేకంగా సీఎం సొంత మీడియా అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. ఏపీటీఎఫ్‌ 257 సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివయ్య మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు తాను అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో అవగాహన లేకుండా అన్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు మాట్లాడుతూ ఇంటి అద్దెలు పెరుగుతుంటే ప్రభుత్వం మాత్రం కుంటి సాకులు చూపి హెచ్‌ఆర్‌ఏను తగ్గించిందన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సీఎంకు సీపీఎస్‌ అంటే సాంకేతిక పరిజ్ఞానం లేదని ఒప్పుకున్నారని, ఇపుడు పీఆర్సీ అంటే కూడా పరిజ్ఞానం లేదనే విషయం కూడా అర్థమైందని అన్నారు. డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గొట్ల చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఫిట్‌మెంట్‌ ఎప్పుడూ ఐఆర్‌ కంటే ఎక్కువ ఉండే సంప్రదాయం 10 పీఆర్సీల్లో కొనసాగిందని, కానీ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టారని అన్నారు.


రివర్స్‌ పీఆర్సీతో జీతాలు తగ్గి ఉద్యోగులు బాధపడుతుంటే జగన్‌ మీడియా మాత్రం వారికి వ్యతిరేకంగా కథనాలు రాస్తోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడ్డారు. ఆయన సొంత పత్రిక కాబట్టి వేల సంఖ్యలో చందాలు కట్టామని, ఇప్పుడు తమ గురించి తప్పుడు కథనాలు రాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తున్న ఆ మీడియాను బహిష్కరించాలని పిలుపునిస్తూ ప్రతులకు నిప్పంటించారు.

ఉపాధ్యాయులు ఆటపాటల రూపంలో నిరసన తెలిపారు. ‘నమ్మి ఓట్లు వేస్తే.. నట్టేట ముంచుతారా?’.. ‘ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం’ అంటూ నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. ‘అపుడేమో ముద్దులు.. ఇపుడేమో గుద్దులా?’ అన్నారు. మడమ తిప్పను అని చెప్పిన సీఎం జగన్‌ ఇపుడేమో మడమ తిప్పడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారని పాటలు పాడారు.

గంట సేపు రాస్తారోకో..

కలెక్టరేట్‌ ముట్టడికి వచ్చిన ఉపాధ్యాయులు కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు యత్నించారు. అధికారులు జడ్పీ సర్వసభ్య సమావేశానికి వెళ్లడంతో కలెక్టరేట్‌ గేట్లను పోలీసులు మూసివేశారు. దీంతో ఆయా సంఘాల నేతలు నిరసనను తెలియజేసేందుకు 11.30 గంటలకు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. కరోనా సమయం, అంబులెన్స్‌ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని పోలీసులు చెప్పడంతో ఉపాధ్యాయులు రాస్తారోకోను విరమించారు.

ఎక్కడికక్కడ అడ్డగింత..

ఉపాధ్యాయ సంఘం నాయకులను కలెక్టరేట్‌ ముట్టడికి రాకుండా ఎమ్మిగనూరు, పాణ్యం పోలీసులు అడ్డుకున్నారు. ఆదోని నుంచి కర్నూలు వస్తున్న ఉపాధ్యాయులను ఎమ్మిగనూరు గోనెగండ్ల సర్కిల్‌లో పోలీసులు ఆపి వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. దీంతో ఉపాధ్యాయులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైన భైఠాయించారు. పాణ్యంలో పోలీసులు ఉపాధ్యాయం సంఘం నేతలను మధ్యాహ్నం వరకు తమ అదుపులో ఉంచుకుని కలెక్టరేట్‌ ముట్టడి అయ్యాక వదిలేశారు.

Updated Date - 2022-01-21T05:39:38+05:30 IST