Abn logo
Sep 19 2021 @ 02:17AM

ఈక్విటీ పోర్ట్‌ఫోలియో సర్దుబాటుకు సమయం ఆసన్నమైందా?

లాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ అలుపెరుగకుండా పరుగెడుతోంది. ప్రామాణిక స్టాక్‌ సూచీలు అంచనాలను మించి ఎగిశాయి. మదుపర్ల కొనుగోళ్ల జోరుతో చాలా కంపెనీల షేర్లు అధిక ధరల్లో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 


అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. వర్ధమాన మార్కెట్లలోని అన్నింటికంటే భారత స్టాక్‌ సూచీలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. సెన్సెక్స్‌ ఇప్పటికే 59,000 మైలురాయిని దాటేయగా.. నిఫ్టీ 18,000 దిశగా దూసుకెళ్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సూచీలు 23 శాతం మేర పుంజుకున్నాయి. మరి మన మార్కెట్లు మరింత ర్యాలీ తీస్తాయా..? ఇక సూచీల్లో కరెక్షన్‌ తప్పదా..? అనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. దీర్ఘకాలికంగా చూస్తే మార్కెట్‌ బుల్లి్‌షగానే కన్పిస్తున్నప్పటికీ, శరవేగంగా ఎగిసిన సూచీలు స్వల్పంగా దిద్దుబాటుకు లోనుకాక తప్పదని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో కొనుగోళ్లు కొనసాగించాలా..? ఏ స్థాయి వద్ద లాభాలను స్వీకరించాలి..? అన్న సందిగ్ధం సహజమే. కానీ, మార్కెట్‌కు ఏది పతాక స్థాయి..? సూచీల్లో ఎంత శాతం కరెక్షన్‌ జరగవచ్చనేది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి, పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాలే తప్ప ఏ ఆర్థిక ఆస్తిలోనైనా పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించకోవడం సరికాదని ఫైనాన్షియల్‌ సలహాదారులు సూచిస్తున్నారు. అలాగే, మీ మొత్తం పెట్టుబడులను ఏ ఒక్క ఆర్థిక సాధనం లేదా పథకంలో పెట్టడం సరికాదు. బ్యాంక్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, ఈక్విటీలు, బాండ్లు, బంగారం, రియల్‌ ఎస్టేట్‌తోపాటు వీలైనన్ని మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టభయాలను తగ్గించుకోవచ్చు. అలాగే, పెట్టుబడికి మీరు ఎంచుకున్న ఆర్థిక సాధనాలను బట్టి ఆర్నెల్లు లేదా ఏడాదికోసారి పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకోవడం మేలు. 


కరోనా సంక్షోభం మొదలవడంతో గత ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో భారీగా పతనమైన స్టాక్‌ మార్కె ట్లు.. ఆ తర్వాత నుంచి క్రమంగా ఎగబాకుతూ వచ్చాయి. 2020 ద్వితీయార్ధం నుంచి మార్కెట్‌ జోరందుకుంది. దాంతో చాలా మంది ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచారు. కొందరైతే, రిటర్నులు తక్కువగా వస్తోన్న ఎఫ్‌డీలు, ఇతర పొదుపు పథకాల్లోని  పెట్టుబడులను సైతం స్టాక్‌ మార్కెట్లోకి మళ్లించారు. ప్రస్తుతం మార్కెట్లో దిద్దుబాటుకు ఆస్కా రం ఉన్న నేపథ్యంలో  పోర్ట్‌ఫోలియో వివిధీకరణలో భాగం గా ఈక్విటీల కోసం మీరు ముందుగా నిర్దేశించుకున్న స్థాయికి పెట్టుబడులను తగ్గించుకోవడం మేలని నిపుణులంటున్నారు. అంతేకాదు, పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్ల పోర్ట్‌ఫోలియోలోనూ సర్దుబాట్లు అవసరమని, ఇందుకోసం మార్కెట్‌ స్థితిగతులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే, మార్కెట్‌ లాభాల్లో ఉన్నంత మాత్రాన అన్ని కంపెనీల షేర్ల ధరలు పెరగవు. మార్కెట్‌ నష్టాల్లో ఉన్నా అన్ని కంపెనీల షేర్ల ధరలు క్షీణించవు. తక్కువ ప్రతిఫలాలు అందిస్తున్న షేర్లలోని పెట్టుబడులను, మున్ముందు మంచి రిటర్నులు పంచేందుకు అవకాశమున్న నాణ్యమైన కంపెనీల షేర్లలోకి మళ్లించడం మేలు. అంతేకాదు, సెన్సెక్స్‌, నిఫ్టీ లిస్టెడ్‌ కంపెనీలతోపాటు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సెగ్మెంట్లలోనూ పెట్టుబడులు పెడితే భవిష్యత్‌లో మంచి రిటర్నులు లభించేందుకు అవకాశం ఉంటుంది. గడిచిన ఏడాదికాలంలోనూ సెన్సెక్స్‌, నిఫ్టీలతో పోల్చితే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలే అధిక రిటర్నులు పంచాయి.