Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిజమైన ప్రేమికులు.. ఇలా ఎప్పటికీ చేయరు!

ఈ నెల 1వ తేదీన గూడూరులో యువతి హత్యకేసులో నిందితులను అరెస్ట్‌ చేసి వివరాలు తెలుపుతున్న ఏఎస్పీ వెంకటరత్నం

ప్రేమ..  పంచుతోందా..  తుంచుతోందా..!?

పెద్దలను ఒప్పించలేక.. వీడి ఉండలేక...

పెరుగుతున్న బలవన్మరణాలు

ప్రేమను పంచలేదంటూ ఇంకొందరు..

ఉన్మాదంతో హంతకులవుతున్న యువత


నెల్లూరు (ఆంధ్రజ్యోతి):

రెండక్షరాల ప్రేమ... ఫలిస్తే తీయని అనుభూతిని మిగుల్చుతుంది. అదే వికటిస్తే ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది. ఒకప్పుడు ప్రేమ జీవితకాలపు తీపి జ్ఞాపకాలకు గుర్తులయితే ఇప్పుడు భయానక పరిస్థితులకు వేదికగా మారుతోంది. ఒకరినొకరు వదిలి ఉండలేక కలిసి మరణించేవారు కొందరైతే.. రాక్షస ప్రవృత్తికి ప్రేమ అనే ముసుగుతొడిగి, మనసివ్వని నేరానికి ప్రాణాలు తీస్తున్న ఉన్మాదులు కొందరు. గడిచిన ఆరు నెలల కాలంలో ప్రేమ మాటున జిల్లాలో జరిగిన ఘోరాలు గమనిస్తే యువత ఎంత బలహీన మనస్కులుగా మారుతోందో ఇట్టే అర్థం అవుతుంది. జీవిత మాధుర్యం అనుభవించే దశలోకి తొలి అడుగులోనే తిరిగి రాని లోకాలకు తరలివెళుతున్న సంఘటనలు గుండెలను పిండేస్తున్నాయి. 


ఈ ఏడాది జనవరి 30వ తేదీన నెల్లూరులో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు హరీష్‌, లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమలో పడ్డ వీరిద్దరికి తల్లిదండ్రులు వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు చేశారు. ముగిసిపోయిన ప్రేమ వ్యవహారాన్ని మరచిపోయి, కొత్త భాగస్వామ్యులతో కొత్త జీవితాన్ని ఆరంభించాల్సిన వీరు ఆ పని చేయలేకపోయారు. స్వతంత్రులు, సంపాదనపరులైన వీరిద్దరు పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించి, ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ సాహసం చేయలేక కలిసి ఉరితాడుకు వేళాడి నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగించారు. కన్నవారికి, వీరిని కట్టుకున్న వారికి తీరని శోకాన్ని, వేదనను మిగిల్చారు. 


జూన్ 18వ తేదీన ఆత్మకూరుకు చెందిన నవీన, ఆయేషా అనే ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండేళ్ల తమ ప్రేమను బతికించుకోవడం కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కులాలు, మతాల గోడలను బద్దలు కొట్టి కొత్త చరిత్రను సృష్టిస్తుంటే ఆ మాత్రం సాహసం చేయలేని బలహీన మనస్కులైన వీరిద్దరు విషం తీసుకుని మరణించారు.


పరిస్థితులను ఎదిరించి పోరాడి ప్రేమను గెలిపించుకోవడమో లేదా పరిస్థితులకు తలొంచి కొత్త జీవితాన్ని ఆశ్వాదించడమే చేయలేని బలహీన మనస్కులు ఇలా బలవన్మరణాలకు పాల్పడుతుండగా, ప్రేమ పేరుతో పాశవికంగా ప్రవర్తించే ఉన్మాదులూ ఎక్కువ అవుతున్నారు. గూడూరులో ఇటీవల జరిగిన  ఘటనే ఇందుకు ఉదాహరణ. పట్టణంలో వెంకటేశ్వర్లు అనే యువకుడు ప్రేమించమని తేజశ్విని అనే యువతి వెంటబడ్డాడు. ఆమె నిరాకరించడంతో ఉన్మాదిగా మారి  ఆ యువతి ఇంటికే వెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఇది చాలదన్నట్లు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆత్మహత్యాయత్నం నాటకమాడాడు. 


ఎక్కడో ఒకచోట మరణఘోష

యువతలో పెరుగుతున్న మానసిక బలహీనతలకు, ఉన్మాదాలకు ఈ ఘటనలు ఉదాహరణలు మాత్రమే. ప్రేమ పేరుతో మరణ ఘోష నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. మానసిక ప్రవృత్తే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మారుతున్న నాగరికత, పెరుగుతున్న అక్షరాశ్యత క్రమంలో ఎన్నో మూఢ నమ్మకాలను జయించాం. కొన్నేళ్ల క్రితం కనిపించిన మూఢ నమ్మకాలు ఇప్పుడు కనిపించడం లేదు. పెళ్లిళ్ల విషయంలో కులాల ప్రస్తావన కూడా అంతరించిపోతోంది. తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం కుదిరిన చోట పెద్దలు సైతం కులాల పట్టింపులను పక్కన పెట్టేస్తున్నారు. పెద్దలను ధిక్కరించి ప్రేమ వివాహాలు చేసుకొని, కొంత కాలానికి పెద్దల దీవెనలు పొందిన, పొందుతున్న వారు ఎందరో ఉన్నారు. బాధాకరం ఏమంటే ఇలాంటి ధ్రుడసంకల్పం కలిగిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరగకపోగా తగ్గిపోతోంది. యువతలో పిరికితనం పెరిగిపోతోంది.


మరణమొక్కటే పరిష్కారం అనే జాఢ్యం ముదిరిపోతోంది. యువతలో పెరుగుతున్న ఈ పరిణామాలే ఆందోళన కలిగిస్తున్నాయి. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, చావాలన్న కోరిక యువతలో పోవాలంటే కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి. మనిషికి ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఒంటరితనం నుంచే పుడుతుంది. మానసికంగా ఏకాకిగా మారిన వారికి సమస్య భూతద్దంలో చూసినట్లు కనిపిస్తుంది. తన భయాన్ని, బాధను ఎవరికీ చెప్పుకునే అవకాశం లేని వాతావరణంలో ఈ మానసిక క్షోభకు మరణం ఒక్కటే పరిష్కారమనే భావన కలుగుతోంది. అందరూ ఉన్న ఇలా ఒంటరిగా మిగిలిన యువతీ యువకులే ప్రేమ విషయంలో బలహీనంగా మారుతారు. తమకు మిగిలిన ఈ ప్రేమ లేకపోతే వీరికి జీవితం మొత్తం అంధకారంగా కనిపిస్తుంది. ఆ భయమే వీరిని బలవన్మరణాల వైపు తీసుకెళుతోంది. మంచి కుటుంబ వాతావరణంలో పుట్టిపెరిగిన యువత ప్రేమ విషయంలో పెద్దలను ఒప్పించగలుతున్నారు.. కాదు కూడదంటే ఎదిరించగలుగుతున్నారు.. కుదరని పక్షంలో పరిస్థితులకు అనుగుణంగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. 


ప్రేమ మరణాన్ని కోరుకోదు: నాగరాజు, దిశ డీఎస్పీ

మరణాన్ని కోరుకునేది ప్రేమ కాదు. నిజమైన ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవడమా, తప్పని పరిస్థితుల్లో మేజర్లు అయితే ప్రేమ వివాహం చేసుకోవడమో చేస్తారు. అంతే తప్ప చంపడమో, చావడమో చేయకూడదు. ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేసుకోవాలి. దిశ యాప్‌ మీ వద్ద ఉంటే రక్షణ మీ పక్కన ఉన్నట్టే. ఎవరు ఇబ్బందులు పెట్టినా దిశ యాప్‌ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే రక్షణ లభిస్తుంది.అవగాహన లోపంతోనే..: శ్రీనివాసతేజ, మానసిక వైద్య నిపుణులు

నిజమైన ప్రేమ జీవితాశయాలను సాధించేలా ఆత్మస్థెర్యంతో ముందుకు వెళుతుందే తప్ప ఆత్మహత్య వైపు తీసుకెళదు. అవగాహన లోపంతో ప్రేమికులు ఉద్రేకంతో ఆత్మహత్యకు పాల్పడటం దురదుృష్టకరం. కేవలం ఆకర్షణతోనే కొందరు ప్రేమికులు విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వేర్వేరు కుల, మతాల కారణంగా తల్లిదండ్రులు వారిని విడదీయడానికే ప్రయత్నిస్తారు. అయితే తమ ప్రేమ గొప్పదనే రీతిలో జీవితంలో అనుకున్న ఉద్యోగ భద్రత ఆర్థికంగా నిలదొక్కుకుని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల పరిస్థితిని తెలుసుకుని వారు స్థిరపడిన తర్వాత తమ సమ్మతిని కూడా చెప్పడం మంచిది. మరోవైపు కొందరు ప్రేమికులు తాము కోరుకున్న అమ్మాయి ఇక దక్కదని హత్యలకు పాల్పడటం వల్ల వారి మానసిక స్థితి ఎలాంటి విపరీత ధోరణిలో వ్యవహరిస్తున్నారో తెలుస్తోంది. ఇలాంటి పోకడలపై యువతలో మానసిక పరివర్తన కలిగించాల్సి ఉంది.


TAGS: nellore LOVE
Advertisement
Advertisement