Apr 16 2021 @ 13:51PM

'ఆచార్య'ని ఆ సినిమా రీప్లేస్ చేయనుందా..?

మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాలు ఊహించని విధంగా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ ఉంటుందా లేదా అన్నది ఇంకా తెలియనప్పటికి పరిస్థితులు మాత్రం అదుపు తప్పుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ సహా అన్నీ చోట్లా సినిమాల రిలీజ్ వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరి', శివ నిర్వాణ దర్శకత్వంలో.. నాని నటించిన 'టక్ జగదీష్', వేణు ఉడుగుల దర్శకత్వంలో.. రానా - సాయి పల్లవి - ప్రియమణి నటించిన 'విరాట పర్వం' సినిమాలు వాయిదా వేశారు. కాగా మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టర్ రాం చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా 'ఆచార్య' రిలీజ్ వాయిదా పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. 

కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా, సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో కనిపించబోతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతునట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ ఇంకా వీఎఫెక్స్ వర్క్ పెండింగ్ ఉందటంతో పోస్ట్‌పోన్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఐతే ఈ డేట్‌ను లవ్ స్టోరి బృందం లాక్ చేసుకోవాలనుకుంటున్నట్టు తాజా సమాచారం. ఖచ్చితంగా మెగాస్టార్ 'ఆచార్య' మే 13న రిలీజ్ కాకపోతే మాత్రం అదే డేట్‌కి 'లవ్ స్టోరి' సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.