శాంతి సాధ్యమేనా?

ABN , First Publish Date - 2020-02-22T07:58:06+05:30 IST

హింసకు దూరంగా ఈ వారం గడిచాక, ఈనెల 29న తాలిబాన్‌తో శాంతి ఒప్పందం కుదర్చుకోబోతున్నట్టు అమెరికా ప్రకటించింది. అమెరికా సేనల ఉపసంహరణకు...

శాంతి సాధ్యమేనా?

హింసకు దూరంగా ఈ వారం గడిచాక, ఈనెల 29న తాలిబాన్‌తో శాంతి ఒప్పందం కుదర్చుకోబోతున్నట్టు అమెరికా ప్రకటించింది. అమెరికా సేనల ఉపసంహరణకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందనీ, దాడులకు తావులేని ఈ వారం పూర్తయిన తరువాత ఈ ఒప్పందం కుదురుతుందని అమెరికా విదేశాంగమంత్రి ఓ ప్రకటనలో అన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచీ ఈ కౌంట్‌డౌన్‌ ఆరంభమవుతుంది. ఈ కాలంలో అన్ని పక్షాలకూ ఆత్మరక్షణ అధికారం ఉంటుందనీ, ఇదేమీ కాల్పుల విరమణ ఒప్పందం కాదని కొందరు అంటున్నారు. ఒప్పందం కుదిరిన తరువాత పరిస్థితులు బాగుంటే ఈ నియమం మరింతకాలం కొనసాగవచ్చని తాలిబాన్‌ అంటే, ఏమాత్రం కవ్వించినా ఊరుకోబోయేది లేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి హెచ్చరిస్తున్నారు.


ప్రస్తుతానికి కాస్తంత గందరోళంగా కనిపిస్తున్నా, ఈ ఒప్పందం కాల్పుల విరమణకూ, అఫ్ఘాన్‌–తాలిబాన్‌ చర్చలకూ, అంతిమంగా శాంతిస్థాపనకు దోహదం చేస్తుందని అమెరికా వాదన. మరి, పరిస్థితులు భిన్నంగా ఉంటే ఒప్పందం నిలిచిపోతుందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి జవాబు దొరకదు. అఫ్ఘానిస్థాన్‌ నుంచి ఎప్పుడు పోదామా అని అమెరికా ఎంతోకాలంగాచూస్తోంది. ఖతార్‌ రాజధాని దోహాలో 9 విడతల చర్చల అనంతరం ఓ సూత్రప్రాయ అంగీకారం కుదిరినట్టు గత ఏడాది ఆగస్టులో అమెరికా తరఫు అధికారి ప్రకటించారు కూడా. కానీ, ట్రంప్‌ చివరినిముషంలో మనసు మార్చుకోవడం ఒప్పందం ఆగింది. క్యాంప్‌డేవిడ్‌లో తాలిబాన్‌ నాయకులకూ, ట్రంప్‌కు మధ్య రహస్య సమావేశం జరగబోతున్న తరుణంలో చర్చలకు ట్రంప్‌ స్వస్తి చెప్పేశారు. తాలిబాన్‌ ఆత్మాహుతి దాడిలో పదిమంది అఫ్ఘాన్లతోపాటు ఒక అమెరికన్‌ సైనికుడు మరణించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి చర్చలు జరుగుతున్న ఈ కాలంలో తాలిబాన్‌ హింస బాగా పెరిగింది. కానీ, సెప్టెంబరు 11దారుణ ఘటనకు 18 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని ముందు పెట్టుకొని తాలిబాన్‌తో ఇలా రహస్య భేటీ జరిపితే పరువుపోతుందని ట్రంప్‌ భయపడినందున ఈ దాడిని ముసుగుగా వాడుకున్నారు. చర్చల్లో తాలిబాన్‌దే పైచేయి అయిందనీ, అందుకే ట్రంప్‌ మాట మార్చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా ట్రంప్‌ తాలిబాన్‌పై తాను చేస్తున్న యుద్ధం రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా సాగుతుందనీ, తనవద్ద అణ్వస్త్రాలు కూడా ఉన్నాయనీ బోలెడన్ని ప్రగల్భాలు సైతం పలికారు.


అవసరం ట్రంప్‌ది కనుక చర్చలు తిరిగి ఏదో రూపంలో కొనసాగుతాయని అనుకున్నదే. అమెరికా–తాలిబాన్‌ రేపు కుదర్చుకోబోయే ఒప్పందంలో ఏమున్నదో ఎవరికీ తెలియదు. అమెరికాకు హాని తలబెట్టే అల్‌ కాయిదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి సంస్థలకు తాలిబాన్‌ ఆశ్రయాన్నీ, ఆసరానీ అందించకూడదన్న ప్రధాన డిమాండ్‌ నెరవేరితే అమెరికాకు చాలు. అధ్యక్ష ఎన్నికల్లోగా అఫ్ఘానిస్థాన్‌నుంచి అమెరికన్‌ సైనికులను తరలించేయాలన్న కోరిక తీరి, ఎన్నికల హామీ నెరివేరితే ట్రంప్‌కు చాలు. తాను కాలు వెనక్కుతీసుకున్న తరువాత అఫ్ఘాన్‌ ఏమైపోయినా అమెరికాకు అనవసరం. తదుపరిదశలో తాలిబాన్‌–అఫ్ఘాన్‌ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగి శాంతి దక్కుతుందన్న నమ్మకం ఏమాత్రం లేదు. అఫ్ఘానిస్థాన్‌లో సెప్టెంబరు 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అష్రాఫ్‌ ఘనీ వీసమెత్తు మెజారిటీతో నెగ్గినట్టు ఇటీవలే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన ప్రధాన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా ఇందుకు ఆగ్రహించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడపబోతున్నట్టు ప్రకటించారు. ఐదేళ్ళక్రితం కూడా ఇలాగే జరిగితే అమెరికా వీరిద్దరికీ అధికారాలు పంచి రాజీచేకూర్చింది. కానీ, ఇద్దరూ కాట్లాడుకుంటూనే ఉన్న స్థితిలో తాలిబాన్‌ మరింత విస్తరించి, నగరాల్లోకీ చొచ్చుకురాగలిగింది. అఫ్ఘాన్‌ ప్రభుత్వం మరింత బలహీనంగా ఉన్న ప్రస్తుత స్థితిలో అమెరికా నిష్క్రమణ తరువాత తాలిబాన్‌ను నిలువరించడం అసాధ్యం. ఈ పరిణామాలన్నీ భారతదేశానికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖాయం. రెండుదశాబ్దాలుగా నెత్తురోడుతున్న అఫ్ఘానిస్థాన్‌లో ఇక ఎవరికంటా కన్నీరు ఒలక్కూడదన్న ఉద్దేశంతో తాము ఈ ఒప్పందాన్ని కుదర్చుకుంటున్నట్టు తాలిబాన్‌ కీలకనాయకుడు హక్కానీ న్యూయార్క్‌టైమ్స్‌లో బుధవారం ఓ సుదీర్ఘ వ్యాసం రాశారు. ఇస్లామిక్‌ సంప్రదాయాలకు అనుగుణంగా ఉన్న అన్ని అంతర్జాతీయ నియమాలకు తాము కట్టుబడి ఉంటామని కూడా ఓ మాటన్నారు. అవి ఎంతమేరకు ఆచరణలో కనిపిస్తాయన్నది అటుంచితే, ఎవరి స్వప్రయోజనాలకు అనుగుణంగా వారు ఆడిన ఈ నాటకంలో ఉగ్రవాద నిర్మూలన, అఫ్ఘానిస్థాన్‌ పునర్నిర్మాణం లక్ష్యాలు మాత్రం వెనక్కుపోయాయి.

Updated Date - 2020-02-22T07:58:06+05:30 IST