కాంగ్రెస్‌ పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్?

ABN , First Publish Date - 2021-07-14T20:34:27+05:30 IST

రాహుల్ గాంధీని పీకే కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు పలుమార్లు ఆయనను కలుసుకున్నారు. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పీకే పని చేయబోతున్నట్లు ఇంతకు ముందు వార్తలు వినిపించాయి

కాంగ్రెస్‌ పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్?

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూనైటెడ్ (జేడీయూ) పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసిన పీకే.. కొంత కాలానికే ఆ పార్టీ నుంచి వైదొలగారు. అనంతరం ఎన్నికల వ్యూహకర్తగానే పని చేస్తూ వచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాలసంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలుసుకున్నారు. ఈ సమావేశం అనంతరం నుంచే ఈ వార్తలు వినిపిస్తన్నాయి.


రాహుల్ గాంధీని పీకే కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు పలుమార్లు ఆయనను కలుసుకున్నారు. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పీకే పని చేయబోతున్నట్లు ఇంతకు ముందు వార్తలు వినిపించాయి. అయితే మంగళవారం నాటి సమావేశం అనంతరం.. కాంగ్రెస్ పార్టీలో చేరికపై గుసగుసలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు సహా మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు పీకే సన్నాహకాలు చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల పోరాటంలో కాంగ్రెస్‌ తరపున పీకే కీలక పాత్ర పోషించనున్నారని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం.


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్నికల వ్యూహకర్తగా తాను చేస్తున్న పని వదిలేస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ‘‘ఇప్పటికే చాలా చేశాను. నాకు కొంత కాలం విశ్రాంతి కావాలి. కుటుంబంతో సహా అస్సాం వెళ్లి తేయాకు తోటలో పని చేసుకుంటాను’’ అని పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే ప్రకటించారు. కానీ, కొంత కాలంగా ఎన్సీపీ అధినేత శరాద్ పవార్‌తో పాటు బీజేపీయేతర పక్షాలను పీకే తరుచూ కలుస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నం జరుగుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పీకే వరుస సమావేశాలపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.


పీకే గతంలో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పని చేశారు. 2017 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినప్పటికీ అనుకున్న ఫలితాలు రాలేదు. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - 2021-07-14T20:34:27+05:30 IST