స్వచ్ఛ రాజకీయాలు స్వప్నమేనా?

ABN , First Publish Date - 2020-10-07T06:10:45+05:30 IST

భారతదేశంలోని ప్రజాప్రతినిధులపై 4859 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అవి ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వారిని ఎన్నుకున్న ప్రజల్లో ఎంత...

స్వచ్ఛ రాజకీయాలు స్వప్నమేనా?

సుప్రీంకోర్టు ఆశించినట్లు ప్రజాప్రతినిధులపై అవినీతి కేసుల విచారణను కింది కోర్టులు నిజంగానే సత్వరమే పూర్తి చేస్తాయా? రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలన్నా, సమగ్ర ఎన్నికల సంస్కరణలు రావాలన్నా ప్రజాప్రతినిధులపై అవినీతి కేసుల విచారణ శీఘ్రగతిన జరిగి తీరాలి. ఏళ్ల తరబడి చార్జిషీట్లు దాఖలు చేయకుండా, విచారణలు మాటిమాటికీ వాయిదాలు పడుతూ జైళ్లలో మగ్గుతున్న అభాగ్యుల గురించీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించాలి.


భారతదేశంలోని ప్రజాప్రతినిధులపై 4859 క్రిమినల్ కేసులు ఉన్నాయని, అవి ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని వారిని ఎన్నుకున్న ప్రజల్లో ఎంత మందికి తెలుసు? నాలుగు దశాబ్దాల క్రితం 1983లో పంజాబ్‌లో ఒక ప్రజా ప్రతినిధిపై నమోదైన కేసు ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది. 1981లో పశ్చిమబెంగాల్‌లో మరో ప్రజాప్రతినిధిపై నమోదైన కేసు విషయంలో ఇంకా చార్జిషీటు కూడా దాఖలు కాలేదు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాప్రతినిధులపై దాఖలైన 131 కేసుల్లో 101 కేసులు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే ఉన్నాయి. ఈ కేసుల్లో సైతం చార్జిషీట్లు దాఖలు కాలేదు ఉత్తరప్రదేశ్‌లో 1991, 1993, 1994 సంవత్సరాల్లో నమోదైన మూడు కేసుల గతి ఇదే విధంగా ఉంది. ఉత్తర ప్రదేశ్, బిహార్‌లో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అత్యధికులు నేర చరితులు. ఉత్తరప్రదేశ్‌లో 1374 కేసులు సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలయ్యాయి. బిహార్‌లో అయితే 557 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లో అనేక కేసులు కనీసం విచారణకు నోచుకోకపోగా అనేక సందర్భాల్లో  సాక్ష్యాల్ని కూడా రికార్డు చేయలేదు.


బిహార్ పశుగ్రాస కుంభకోణంపై ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం ఆధారంగా ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల మేరకు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో 1996లో సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. అంతకు పదేళ్ల ముందు నుంచే నేతలు కొన్ని వందల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టడం ప్రారంభించారు. 21 సంవత్సరాల తర్వాత 2017లో సిబిఐ కోర్టు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవినీతి కేసులపై కూడా విచారణ 18 సంవత్సరాలు సాగింది. పశ్చిమబెంగాల్‌లో పలువురు ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్న శారదా కుంభకోణంపై విచారణ ఏడు సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నది. బాబ్రీమసీదు కూల్చివేత కేసులో నిందితులెవరూ దోషులు కాదని చెప్పేందుకు సిబిఐ కోర్టుకు 28 ఏళ్లు పట్టింది.


భారతదేశంలో రాజకీయ నాయకుల కేసులను విచారించి వారికి శిక్ష పడేందుకు లేదా నిర్దోషులని తేల్చేందుకు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతోంది? గతంలో ఏ చిన్న ఆరోపణ వచ్చినా రాజకీయ నాయకులు రాజీనామా చేసేవారు. ఇప్పుడు ఎంత పెద్ద ఆరోపణ వచ్చినా, ఎన్ని వేల కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కున్నా చెక్కు చెదరకుండా నిర్భయంగా జనం మధ్య తిరగగలుగుతున్నారు. నైతికత అన్నది నేతలకు అభ్యంతరకర పదంగా మారింది. సుప్రీంకోర్టు అమికస్ క్యూరీగా నియమించిన విజయ్ హన్సారియా ప్రకారం రాజకీయనాయకులు తమ పలుకుబడి ఉపయోగించి కనీసం చార్జిషీట్లు కూడా దాఖలు చేయకుండా చూసుకుంటున్నారు. పోలీసులు సరిగా సమన్లు జారీ చేయకుండా చేసుకుంటున్నారు. సాక్షులను బెదిరించి విచారణకు హాజరు కాకుండా చేస్తున్నారు. రాజకీయనాయకుల నుంచి సాక్షులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అమికస్ క్యూరీ ఉన్నత న్యాయస్థానానికి నివేదించాల్సి వచ్చింది.


దేశంలో రాజకీయ నాయకులపై ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులపై నేరారోపణలు వచ్చినప్పుడు వాటిని వెంటనే విచారించి  నేరచరితులో కాదో తేల్చడం వల్లనే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఆస్కారం లభిస్తుంది. నిష్కళంకులైన, సచ్ఛీలురైన ప్రజాప్రతినిధుల మూలంగా రాజకీయాల ప్రక్షాళన కూడా జరుగుతుంది. తమకోసం వారు నిజాయితీగా పనిచేస్తారన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుంది. కాని నేటి కాలంలో రాజకీయనాయకులంటే అవినీతిపరులని, నేరచరితులని అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. అధికారంలోకి వస్తే చాలు తమపై ఎలాంటి దర్యాప్తు జరగకుండా పలుకుబడితో అడ్డుకోగలమన్న విశ్వాసం అనేకమంది రాజకీయనాయకుల్లో కనపడుతోంది. అందుకే వారిపై కేసుల విచారణ సాగడానికి, శిక్ష పడడానికి ఏళ్లకు ఏళ్లు పడుతోంది కేసుల విచారణ ఆలస్యం కావడానికి రాజకీయ నాయకులనే కాదు, కోర్టులను కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. చాలా కేసుల్లో న్యాయస్థానాల్లో సాక్షి హాజరైనప్పటికీ నిందితుడి తరఫు న్యాయవాది ఏదో ఒక కారణంతో వాయిదాలు కోరడం, రకరకాల డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయడం, కోర్టులు మంజూరు చేయడం జరుగుతూనే ఉంది. సాక్షి విచారణ జరిగిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కూడా వాయిదా కోరవచ్చు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కావడానికి ఎన్నో నెలలు పట్టవచ్చు. ఈ లోపు సాక్షులను ప్రలోభపెట్టడమో, భయపెట్టడమో జరగవచ్చు. చాలా న్యాయస్థానాలు స్పష్టమైన కారణాలను రికార్డు చేయకుండానే సుదీర్ఘకాలం కేసులను వాయిదా వేసేందుకు అనుమతించడంతో ఈ దేశంలో న్యాయం లభించడం అనేది ఒక విషాద ప్రహసనంగా మారింది. చట్టం, న్యాయం ప్రకారం విచారణ జరిగేలా చూడాల్సిన కోర్టులే తమ పవిత్రమైన విధిని మరిచిపోతున్నాయి. సత్వర న్యాయం అందించడం ద్వారా మొత్తం సమాజం సమష్టి ప్రయోజనాన్ని కాపాడగలమనే వాస్తవాన్ని అవి విస్మరిస్తున్నాయి. ఆరోపణలు నిర్ధారణ చేయడానికి జడ్జి పూర్తి వివరాల్లోకి పోకుండా రికార్డులు, కక్షిదారుల వాదనల ఆధారంగా కూడా నిందితుడు విచారణ చేయదగ్గ నేరానికి పాల్పడ్డాడని నిర్ణయానికి రావచ్చని కూడా సుప్రీంకోర్టు 2014లో మరో తీర్పు చెప్పింది. అయినా సరే, ఈ విషయంలోనూ ఎనలేని ఆలస్యం జరుగుతోంది.  


నిజానికి 2011లోనే సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయనాయకులపై ఉన్న అన్ని అవినీతి కేసులలో ఏడాది లోగా విచారణ ముగించాలని ఆదేశించింది. సాధ్యమైనంత వరకు రోజువారీ విచారణ జరగాలని కూడా స్పష్టం చేసింది. అయినా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ కొలిక్కి రాకుండా ఆగిపోతూనే వచ్చింది. మళ్లీ 2012లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అవినీతికి సంబంధించిన కేసులపై ఎలాంటి వాయిదాలు లేకుండా రోజువారీ విచారణ జరగాలని ఆదేశించింది.


దేశ రాజకీయాల్లో రోజురోజుకూ పెరుగుతున్న నేర చరితులపై గత ఏడాది కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగ నిబంధనలను కాపాడతామని ప్రమాణం చేసిన వారిపైనే, ప్రస్తుత రాజకీయ వాతావరణం అవినీతితో కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయినప్పటికీ మన రాజ్యాంగంలో పేర్కొన్న విలువలకు భిన్నంగా రాజకీయ వ్యవస్థలో నేరతత్వం రోజురోజుకూ ప్రబలిపోవడం వల్ల రాజ్యాంగ విలువలకే హాని జరుగుతోందని, దేశానికి భారంగా మారిన వారి చేతుల్లోనే ప్రజల భవిష్యత్తు పడాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు అత్యంత కఠినమైన పదజాలంతో బాధపడాల్సి వచ్చింది. 


వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుత సుప్రీంకోర్టు బెంచ్ నేరచరితులైన ప్రజాప్రతినిధుల కేసుల్ని కొలిక్కి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించడం, తమకు సహాయపడేందుకు అమికస్ క్యూరీని నియమించడం అభినందనీయమని చెప్పక తప్పదు. దేశంలోని అనేక కీలక అంశాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలను పుంఖానుపుంఖాలుగా దాఖలు చేస్తూ ‘పిల్ మ్యాన్’గా పేరొందిన అశ్వినీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు చాలా మంది ప్రజాప్రతినిధుల భవిష్యత్‌కు గండంగా మారబోతోందనడంలో సందేహం లేదు. కేసుల విచారణను శీఘ్రంగా ముగించడానికి అమికస్ క్యూరీ చేసిన సిఫారసులపై అనేక హైకోర్టులు సానుకూలంగా స్పందించాయి. ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఉన్న క్రిమినల్ కేసుల్లో విచారణ జరపడం కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులను నెలకొల్పడం, అనవసర వాయిదాలకు ఆస్కారం లేకుండా అనేక చర్యలు సూచించడం, నోడల్ అధికారులను నియమించడం, సాక్షుల రక్షణకు సురక్షితమైన గదులు ఏర్పాటు చేయడం వంటివి అమికస్‌ క్యూరి సిఫారసులలో కీలకమైనవి. వీటన్నిటికి ఒప్పుకోవడమే కాకుండా నేరచరితులైన ప్రజాప్రతినిధుల వివరాలను బహిరంగంగా వెల్లడించడం కోసం వెబ్‌సైట్లను ఏర్పాటు చేయడానికి కొన్ని హైకోర్టులు ముందుకు వచ్చాయి. చివరకు కేంద్రప్రభుత్వం సైతం నేరచరితులైన ప్రజాప్రతినిధుల కేసులను సత్వరం విచారించాల్సిందేనని అంగీకరించడం ఈ మొత్తం ఘట్టంలో కీలక పరిణామం. ఈ కేసుల్ని నిర్ణీతకాలంలో తేల్చాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పారు.


నిజంగానే సుప్రీంకోర్టు ఆశించినట్లు ప్రజాప్రతినిధులపై కింది కోర్టులు కేసుల విచారణ సత్వరం ముగిస్తాయా లేదా అన్నది తేలవలసి ఉంది. ఆ తర్వాత అవి మళ్లీ పై కోర్టులకు రాక తప్పదు. నేరారోపణలకు గురైన ప్రజాప్రతినిధులందరికీ శిక్ష పడాల్సిన అవసరం లేదు. నిజానికి తప్పు చేసిన వారే కేసుల సత్వర విచారణకు భయపడతారు. శిక్ష పడితే అనుభవిస్తున్న పదవులు కోల్పోతామని, మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశాలు లేకుండా పోతాయని ఆందోళన చెందుతారు. కాని రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలంటే, ప్రజాప్రతినిధులు ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలంటే, అది ఎన్నికల సంస్కరణలకు దారితీయాలంటే కేసుల విచారణ సత్వరం సాగక తప్పదు. అధికారులు, న్యాయస్థానాలు జవాబుదారీగా వ్యవహరించడానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. రాజకీయ నాయకులపై కేసులు వేగవంతంగా తేల్చడం మంచిదే కాని ఏళ్ల తరబడి ఛార్జిషీట్లు దాఖలు చేయకుండా, విచారణలు మాటిమాటికీ వాయిదాలు పడుతూ జైళ్లలో మగ్గుతున్న అభాగ్యుల గురించి కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించడం మంచిది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-10-07T06:10:45+05:30 IST