అతివేగమే ప్రమాదానికి కారణమా?

ABN , First Publish Date - 2021-12-06T07:28:10+05:30 IST

చంద్రగిరి మండలం అగరాల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తుంది. కాణిపాకం నుంచి వస్తున్న వీరు అరగంటలో తిరుపతికి చేరుకోనుండగా ఈ విషాదం జరిగింది.

అతివేగమే ప్రమాదానికి కారణమా?
బోల్తాపడి, కాలుతున్న కారు

అగరాల వద్ద కారు బోల్తా 

పెట్రోల్‌ ట్యాంకు పగిలి మంటలు 

ఏడుగురు మృతి.. బయటపడ్డ మూడేళ్ల చిన్నారి 

వీరిది శ్రీకాకుళం, విజయనగరం జిల్లా 


చంద్రగిరి, డిసెంబరు 5: చంద్రగిరి మండలం అగరాల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తుంది. కాణిపాకం నుంచి వస్తున్న వీరు అరగంటలో తిరుపతికి చేరుకోనుండగా ఈ విషాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మేడిమర్తికి చెందిన కంచారపు సురే్‌షకుమార్‌, తన భార్య మీనా, కుమార్తెలు జషిత నందన్‌, జ్యోతిష సహస్ర, తల్లితండ్రులు శ్రీరామమూర్తి, సత్యవతి, అత్తమామలు.. విజయనగరం జిల్లా పూసపాటి రేగుకు చెందిన గోవిందరావు, హైమావతితో కలిసి శ్రీవారి దర్శనార్థం శుక్రవారం కారులో బయలుదేరారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని, ఆదివారం కాణిపాక వినాయకుడిని దర్శించుకుని తిరుపతికి బయలుదేరారు. అగరాల వద్ద జాతీయ రహదారిలో మలుపు వద్దకు రాగానే వీరు కారు అదుపు తప్పింది. ప్రమాదస్థలికి ముందు కారును డ్రైవరు అదుపు చేసినట్లు జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డు డివైడరుకు కారు రాసుకున్న మార్కులున్నాయి. అప్పటికీ వేగం అదుపుకాక.. ప్రధాన రహదారి నుంచి సర్వీసు రోడ్డు మధ్యలో ఉన్న కాలువలో కారు బోల్తా పడి సర్వీసు రోడ్డుపై ఉన్న కల్వర్టు గోడను ఢీ కొంది. అదే సమయంలో కారులోని పెట్రోల్‌ ట్యాంక్‌ పగలడంతో మంటలు చెలరేగాయి. ఆ రోడ్డులో ఉన్న స్థానికులు అగరాల పంచాయతీకి వెళ్తున్న తాగునీటి పైపును పగలగొట్టి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపు కాకపోవడంతో కారులోని వారిని అతికష్టంపై బయటకు తీశారు. అప్పటికే తీవ్ర గాయాలవడం, మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాద స్థలిలో ఐదుగురు, ఆస్పత్రిలో ఇద్దరు కలిపి ఏడుగురు మృతిచెందారు. మూడేళ్ల చిన్నారి బతికి బయటపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ నరసప్ప పరిశీలించారు. కారు టైర్లు కాలిపోవడంతో టైరు పంక్చర్‌ అయ్యిందా లేదా తెలియడంలేదని పోలీసులు చెబుతున్నారు. అతి వేగతంతో కారు అదుపు తప్పిందా? లేదా టైరు పంక్చర్‌ అయిందా? లేదా నిద్ర మత్తు వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మృతులు 

సురే్‌షకుమార్‌ (33), ఆయన భార్య మీనా (29), చిన్న కుమార్తె ఆరు నెలల జోష్మిత సహస్ర, తండ్రి శ్రీరామ్మూర్తి (70), తల్లి సత్యవతి (62), అత్త హైమావతి (60), మావయ్య పైడి గోవిందరావు (61). 


మృత్యుంజయురాలు


ఘోర రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల జషిత నందన్‌ మృత్యుంజయురాలిగా నిలిచారు. ఈ కారులో మొత్తం ఎనిమిది మంది కుటుంబీకులుండగా.. ఏడుగురు మృతిచెందారు. జషితకు కాలు లోపల ఎముక భాగం రెండు చోట్ల విరిగింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, తోబుట్టువు, నలుగురు అవ్వ తాతలను (అమ్మ, నాన్న తరపు తల్లిదండ్రులు) కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఆ చిన్నారిని చూసిన వారి గుండె తరుక్కుపోతోంది. కాణిపాకం నుంచి వస్తూ తన వారితో సరదాగా గడుపుతూ వచ్చిన ఆ బాలిక.. ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్‌పై ఒకటే ఉండటంతో ఏడుపు ముఖం పెట్టింది. అసలేం జరిగింది? అందరూ ఎక్కడకు వెళ్లారనేది తెలియక తన వారికోసం అమాయకపు చూపులు చూస్తుండటం అందరినీ కంటతడి పెట్టంచింది. నొప్పితో బాధపడే ఆ చిన్నారిని ఓదార్చే వాళ్లే లేకపోయారు. ఈమెను వైద్యులు, సిబ్బంది, సెక్యూరిటీ వారు దగ్గరకు తీసుకుని.. ఓదారుస్తూ వైద్యం అందిస్తున్నారు. 

- తిరుపతి సిటీ

Updated Date - 2021-12-06T07:28:10+05:30 IST