Abn logo
Mar 29 2020 @ 03:45AM

తెలుగుదేశం ప్రస్థానం తేజరిల్లేనా?

ఈ 9 నెలల కాలాన్ని గమనించినట్లయితే..  భవిష్యత్తు పరిణామాల గురించి బెంగపడకుండా ప్రస్తుత ప్రజాసమస్యలపైనే   తెలుగుదేశం దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అధికారపక్షం తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలావరకు విజయం సాధించింది. జరిగిన లోపాలను సరిచేసుకొని తెలుగుదేశం ఇదే ఊపును కొనసాగించి తన పూర్వ వైభవం సాధించ గలుగుతుందా? దీనికి సమాధానం తెలుగుదేశం పనితీరు మీదనే కాదు.. అధికార వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అందించే పరిపాలన మీద కూడా ఆధారపడి ఉంది.


నందమూరి తారకరామారావు మార్చి 29, 1982 న ప్రాంతీయ పార్టీగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగుదేశం రాజకీయ ప్రస్థానంలో అనేక మెరుపులు, అక్కడక్కడ కొన్ని మరకలు కనిపిస్తాయి. 38 సంవత్సరాల చరిత్రలో మొత్తం 22 సంవత్సరాలు అధికారంలో ఉండటం ఓ ప్రధాన విశేషమే. అయితే, ‘తెలుగుదేశం’ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాల్లో చోటుచేసుకొన్న గుణాత్మక మార్పులు, అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి దోహదపడిన పరిస్థితులను అతిపెద్ద విశేషాలుగా చెప్పాలి. తెలుగుదేశం ప్రస్థానాన్ని రెండు భాగాలుగా, ఒకటి - ఎన్టీ రామారావు సారధ్యంలో జరిగినది; రెండోది నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో 1995 సెప్టెంబర్‌ మొదలుకొని నేటివరకు సాగిస్తున్న ప్రయాణాన్ని విడివిడిగా చూడాలి.


ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సందర్బంలో నాటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆయనకు అనుకూలించాయని; గ్రూపు తగాదాలు, ముఖ్యమంత్రుల మార్పు, అవినీతి ఆరోపణలు తదితర కారణాలతో ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్నికల్లో అధికారాన్ని ఎన్టీఆర్‌కు బంగారు పళ్లంలో పెట్టి ఇచ్చిందని ఇప్పటికీ పలువురు విశ్లేషణలు చేస్తుంటారు. కానీ.. ఆ విశ్లేషణల్లో వాస్తవం పాక్షికమే. అది ఎన్టీఆర్‌ చేసిన కృషిని తక్కువ చేసి చూపడమే అవుతుంది.


తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటికి గ్రూపు తగాదాలు ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉంది. పొత్తు కావాలంటే 100 సీట్లు ఇవ్వాలని తెలుగుదేశాన్ని డిమాండ్‌ చేసే స్థితిలో వామపక్ష పార్టీలు ఉన్నాయి. జనతాపార్టీ, బీజేపీలకు అక్కడక్కడ కేడర్‌ ఉంది. ఈ నేపథ్యంలో.. నూతనంగా ఏర్పాటైన తెలుగుదేశానికి ఎన్టీఆర్‌ అభిమానులే పెద్ద దిక్కు అయ్యారు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్‌కు రాజకీయ అవగాహనలేదని, సినీప్రపంచానికే పరిమితమైన వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా ఏలగలరన్న విమర్శలు నలువైపుల నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి. 


ఎన్టీ రామారావు రాజకీయ చిత్తశుద్ధిని గ్రహించడానికి ప్రజలకు ఎక్కువ సమయం పట్టలేదు. అందుకు కారణం.. ఎన్టీఆర్‌ తన ఆలోచనల్ని, విధానాల్ని నిజాయితీగా ఆచరణలో చూపడమే. పార్టీకి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఎన్టీఆర్‌ తొలినాళ్లల్లో మేధావులు, విద్యాధికులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా కొందరు సూటిగా ‘‘అసలు మీ పార్టీ విధివిధానాలు ఏమిటి? కాంగ్రెస్‌ పార్టీని ఓడించి అధికారంలోకి రావడమేనా?’’ అని ప్రశ్నించారు. దానికి ఎన్టీఆర్‌ తడుముకోకుండా ‘‘సమాజమే దేవాలయం, పేద ప్రజలే నాకు దేవుళ్లు. వారికి ఇంత నైవేద్యం పెట్టడమే నా విధివిధానం’’ అంటూ గంభీరంగా సమాధానం ఇచ్చేసరికి వారందరూ ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియవని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజల అవసరాలేమిటో ఆయనకు క్షుణ్ణంగా తెలుసునని వారు గ్రహించారు. 


ఎన్నికల ముందు పార్టీ ప్రణాళిక రూపకల్పనకు ఉపక్రమించిన ఎన్టీఆర్‌ అందులో భాగస్వామ్యులయ్యారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రణాళికలను పరిశీలించిన ఆయనకు భారత రాజ్యాంగకర్త డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్థాపించిన రిపబ్లికన్‌ పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు అమితంగా ఆకర్షించాయి. అందులో పేర్కొన్న బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం; పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వారికి రిజర్వేషన్లు, ప్రత్యేక విద్యాలయాల ఏర్పాటు, పాలనా వ్యవస్థను గ్రామస్థాయి నుంచి ఆధునికీరించడం, సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రాల హక్కుల్ని కాపాడటం.. తదితర అంశాలను ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ తొలి ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. ఆ అంశాలను తన ప్రసంగాలలో ఎన్టీఆర్‌ ప్రముఖంగా ప్రస్తావించి, అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలలో ఎన్టీ రామారావు పట్ల నమ్మకం మరింత పెరిగింది. 


కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేస్తానని చెప్పిన ఎన్టీ రామారావు తన చిత్తశుద్ధిని చాటుకోవడానికి వేసిన బృహత్తరమైన అడుగు - పార్టీ టిక్కెట్లను శాస్త్రీయ పద్ధతుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు.. యువకులకు, సామాన్యులకు, విద్యాధికులకు, బలహీన వర్గాలకు, మహిళలకు అత్యధికంగా కేటాయించడం. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా.. ఎన్టీ రామారావు అందించిన ప్రోత్సాహంతో ఉన్నత స్థానాలకు ఎదిగిన నాటితరం నాయకులు.. నేటికీ తెలుగుదేశం పార్టీలో ఎందరో ఉన్నారు. 


ఎన్టీఆర్‌ పాలనలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 55కు తగ్గించడం; చిన్న కారణంతో ఎన్టీఆర్‌ తన మంత్రి వర్గాన్ని రద్దు చేయడం, కాంగ్రెస్‌ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా దీక్షా శిబిరంలోనే హత్యకావించబడటం.. మొదలైన సంఘటనలు తెలుగుదేశం ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇవి 1983–-89 మధ్యకాలంలో జరిగినవి కాగా.. ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చిన శ్రీమతి లక్ష్మీపార్వతి కారణంగా 1995 ఆగస్ట్‌లో మరోసారి పార్టీలో తిరుగుబాటు జరిగింది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్షపదవిని పోగొట్టుకోవడం తెలుగుదేశం పార్టీ చరిత్రలో చెరిగిపోని మరకలుగా కన్పిస్తాయి. అయితే, ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా, పేద ప్రజల సంక్షేమాన్ని, రాజకీయ విలువలను కాంక్షించి అందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. రాముడిగా, కృష్ణుడిగా తెలుగు ప్రజల హృదయాలలో స్థానం పొందిన ఎన్టీఆర్‌ నిబద్ధత కలిగిన అతికొద్ది మంది నాయకుల్లో ఒకరిగా దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. 


1995 సెప్టెంబర్‌లో పార్టీకి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు ‘తెలుగుదేశం పార్టీ’ కి ఓ కొత్త రూపు ఇవ్వడానికి కృషి చేయడం మొదట్నుంచీ స్పష్టంగా కనపడుతుంది. తొలినాళ్లల్లో ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టారన్న అపప్రథ తెచ్చుకొన్నప్పటికీ.. చంద్రబాబు సారథ్యంలో.. ఎన్టీఆర్‌ హయాంలో కంటే సామాజిక న్యాయం మెరుగ్గా చేయగలిగారు. అవకాశం వచ్చినప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా దళితనేత జీఎంసీ బాలయోగిని, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా దళిత నాయకురాలు శ్రీమతి ప్రతిభా భారతిని ఎంపిక చేయడం ఇందుకు తార్కాణం. సమగ్రంగా సమాచారాన్ని తెప్పించుకొని.. దాని ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, పదవుల పంపిణీ, పార్టీ బాధ్యతల అప్పగింత మొదలైన అంశాలలో ఎన్టీఆర్‌ కంటే చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు న్యాయం చేశారు. తెలంగాణలోని నల్గొండ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో బలహీన వర్గాల నాయకత్వాన్ని అంతకుముందు కంటే ఎక్కువగా ప్రోత్సహించారు. అలాగే, రాయలసీమలోనూ, కొంతమేర కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఎన్టీఆర్‌ హయాంలో పెత్తనం చేసిన వర్గాలను పక్కన పెట్టి అక్కడ సామాజిక న్యాయం చేయగలిగారు. పార్టీలో నాయకుల్ని ప్రోత్సహించడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, సీనియర్‌ లీడర్లు చెప్పే సలహాలు, సూచనల్ని పరిగణనలోకి తీసుకోవడం, అనేక సందర్భాలలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించడం చంద్రబాబు ప్రత్యేకత. ముఖ్యంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలను నియమించి.. పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులకు శిక్షణ అందించడం, అందర్నీ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేసి అన్ని స్థాయిలలో నాయకులకు సమాజంలో గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టడం విశేషంగా చెప్పాలి. ప్రధానంగా, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం ఆలోచనల్లో, ఆచరణలో మార్పులు తేవడానికి చంద్ర


బాబునాయుడు నిరంతరం కృషి చేయడం కనపడుతుంది. పార్టీపరంగా నిర్ణయాలు తీసుకొనే ముందు పార్టీ పోలిట్‌బ్యూరోలో, పార్టీ ముఖ్యులతో చర్చించి వారిచ్చే ‘ఇన్‌పుట్స్‌’ను స్వీకరించే ప్రజాస్వామిక లక్షణం చంద్రబాబులో కనపడుతుంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజల భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన జన్మభూమి, చేసిన పరిపాలనా సంస్కరణలు, ఐటికి పెద్దపీట వేయడం; హైదరాబాద్‌కు, రాష్ట్రానికి పలు అంతర్జాతీయ సంస్థల్ని రప్పించడం మొదలైన చర్యల కారణంగానే.. ఒక దశలో ‘దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి’గా అవార్డులు పొందారు. 2004 ఎన్నికలలో ఓటమి చవిచూసినా.. 10 ఏళ్లపాటు ప్రతిపక్షనేతగా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొంటూ పార్టీని నడిపించిన తీరును ఆయన ప్రత్యర్థులు సైతం ప్రశంసించకమానరు. 2009–-14 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడం, ఎంతో మంది పార్టీ ముఖ్యనేతలు పార్టీని వీడి బయటకుపోవడం లాంటి సంఘటనల్ని తట్టుకొని నిలబడి 2014 ఎన్నికలలో విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడం చంద్రబాబునాయుడి నాయకత్వపటిమ, దీక్షా దక్షతలకు నిదర్శనం. చంద్రబాబునాయుడి విధానాల్ని వ్యతిరేకించేవారు సైతం ఆయనలోని శ్రమపడేతీరు, ఏకాగ్రత, మనోనిబ్బరం, సహనం, పట్టుదల, మర్యాద, మన్నింపు వంటి లక్షణాలను మెచ్చుకోకుండా ఉండలేరు. ఎవరెన్ని విమర్శలు చేసినా చలించక మానసిక దృఢత్వం ప్రదర్శించడం ఆయనకే చెల్లు.


ఎన్టీఆర్‌ తర్వాత... తెలుగుదేశం పార్టీ మనగలుగుతుందా? అనే సందేహాలు అప్పట్లో చాలామంది వ్యక్తపర్చారు. కానీ, ‘రేపు ఏమిటి?’ అనే చింతను ప్రక్కకుపెట్టి నేడు చేయాల్సిన కర్తవ్యం పైననే చంద్రబాబు దృష్టి పెట్టడం వల్లనే.. భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చెరగని ముద్ర వేయగలిగింది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. చంద్రబాబు తీసుకొన్న కొన్ని నిర్ణయాలు వికటించి పార్టీని ఆయా సందర్భాల్లో దెబ్బతీశాయి. 1999లో కె. చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా ప్రక్కన పెట్టడం; తెలంగాణ ఉద్యమ ఉధృతిని సరిగా అంచనా వేయలేకపోవడం; విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని, అందులో నలుగుర్ని మంత్రుల్ని చేయడం వంటివి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బ తీశాయి. ఫలితంగా పార్టీ ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించింది. ప్రస్తుతం తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదేసమయంలో పాలకపక్షం దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళతారు అనే అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతున్నది. అయితే, ఈ 9 నెలల కాలాన్ని గమనించినట్లయితే.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం భవిష్యత్తు పరిణామాల గురించి బెంగపడకుండా ప్రస్తుత ప్రజాసమస్యలపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అధికారపక్షం తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోపాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలావరకు విజయం సాధించింది. జరిగిన లోపాలను సరిచేసుకొని తెలుగుదేశం ఇదే ఊపును కొనసాగించి తన పూర్వ వైభవం సాధించ గలుగుతుందా? దీనికి సమాధానం తెలుగుదేశం పనితీరు మీదనే కాదు.. అధికార వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అందించే పరిపాలన మీద కూడా ఆధారపడి ఉంది.

విక్రమ్‌ పూల

(నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం)

Advertisement
Advertisement
Advertisement