Abn logo
Oct 14 2021 @ 23:02PM

కరోనా తగ్గిందా... తగ్గిస్తున్నారా?

పొందూరులో స్పీకర్‌ తమ్మినేని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో భౌతికదూరం లేకుండా పాల్గొన్న ప్రజలు(ఫైల్‌)

- జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు గాలికి

- భారీగా సమావేశాలు.. సదస్సులు

- మూడో ముప్పుపై సర్వత్రా ఆందోళన

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ జనాన్ని వణికించిన కరోనా కేసుల సంఖ్య నిజంగానే తగ్గుముఖం పట్టిందా? లేక కావాలనే తగ్గించేస్తున్నారా? అనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. ఒక వైపు కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్న పాలకులే మరో వైపు కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఎక్కడికక్కడ భారీ సదస్సులు నిర్వహిస్తున్నారు. ‘ఆసరా’ పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు.  కేసులు తగ్గుముఖం పడుతున్నా అజాగ్రత్త వద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. స్వయంగా కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ ప్రకటనలు జారీ చేస్తున్నారు. మరోవైపు మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం తప్పనిసరి అని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉందని చెబుతూనే మరోవైపు కొవిడ్‌ నిబంధనలు, నియంత్రణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న సభలు, సమావేశాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. ఇటీవల ఎంపీపీల ఎన్నికలు, ప్రమాణ స్వీకారోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశాలకు కిక్కిరిసి జనం హాజరయ్యారు. తాజాగా వైఎస్‌ఆర్‌ ఆసరా సంక్షేమ పథకాన్ని ఈనెల 7 నుంచి రెండో విడత అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారపార్టీ నాయకుల భారీ జనసమీకరణ చేపట్టి.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసలు మాస్కులే లేకుండా చాలామంది హాజరవుతున్నారు. పాలకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది. 


తగ్గిన పరీక్షలు

క్షేత్రస్థాయిలో కొవిడ్‌ నియంత్రణ కోసం నియమించిన తాత్కాలిక వైద్య సిబ్బందిని ఇటీవల తొలగించారు. దీంతో ల్యాబ్‌ టెక్నీషియన్లు, హెల్త్‌ అసిస్టెంట్‌లు అందుబాటులో లేక కరోనా పరీక్షలు చాలా వరకు తగ్గిపోయాయి. గతంలో నిత్యం రెండు వేల నుంచి 5 వేల వరకు నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది ప్రస్తుతం వందల్లోకి తగ్గించేశారు. కొవిడ్‌ ప్రత్యేక విధులు నిర్వహించేందుకు ఆరు నెలల కిందట తాత్కాలిక భృతిపై నియమించిన వైద్య శాఖలోని వివిధ విభాగాలకు చెందిన సుమారు 280 మంది సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌ అసిస్టెంట్ల కొరత ఏర్పడింది. జిల్లాలో బుధవారం కేవలం 308 నమూనాలు మాత్రమే సేకరించారు. ఇందులో ఆరు పాజిటివ్‌ కేసులు  తేలాయి. గురువారం 1,562 నమూనాలు సేకరించగా, మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి కారణం శాంపిల్స్‌ సేకరణ తగ్గిపోవడమేనని అర్థమవుతోంది. గత నెల వరకు పదుల సంఖ్యలో నమోదయ్యే పాజిటివ్‌ కేసులు..  వారం రోజుల నుంచి కేవలం ఒక్క అంకెకే పరిమితం కావడం అనుమానాలకు తావిస్తోంది.  కరోనా ఉధృతి తగ్గిపోయిందని భావించి కొందరు కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. ఇటీవల కాలంలో వివాహాలు, విందులు, శుభకార్యాలు, రాజకీయ నాయకులు సమావేశాల్లో కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. శానిటైజర్ల వినియోగం దాదాపు మానేశారు. ఇక రద్దీగా ఉండే శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, సోంపేట మార్కెట్లలో కొవిడ్‌ నిబంధనలు మచ్చుకైనా కానరావడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో సైతం ప్రయాణికుల మధ్య భౌతికదూరం పాటించాలనే నిబంధన అమలు కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా నిబంధనలు పక్కాగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.