కరోనా ముప్పు కడదేరిందా?

ABN , First Publish Date - 2020-05-06T06:00:43+05:30 IST

కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు భారత దేశంలో కరోనా వైరస్ ప్రమాదం తొలగిపోయిందా అన్న అనుమానాలకు దారితీస్తున్నాయి. నిజానికి కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తొలగిపోకముందే...

కరోనా ముప్పు కడదేరిందా?

లాక్‌డౌన్-–1 ని ప్రకటించినప్పుడు వలస కార్మికుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా వ్యవహరించినట్టే ఇప్పుడు వారిని స్వస్థలాలకు పంపాలన్న నిర్ణయాన్ని ప్రకటించే ముందూ కేంద్రం అవగాహనారాహిత్యంతోనే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. మద్యం అమ్మకాలు లేకుండా ప్రభుత్వాలు నలభై రోజులైనా ముందుకు సాగలేనప్పుడు అన్ని దినాలపాటు ఆదాయం లేకుండా లక్షలాది శ్రమ జీవులు ఎలా జీవించగలరు? వలస కార్మికులు, మద్యం దుకాణాలే కాదు, రాజకీయాల విషయంలోనూ వైరస్ గురించి ఆలోచించడం అవివేకమని పాలకులు భావిస్తున్నారా?


కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు భారత దేశంలో కరోనా వైరస్ ప్రమాదం తొలగిపోయిందా అన్న అనుమానాలకు దారితీస్తున్నాయి. నిజానికి కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తొలగిపోకముందే, పరీక్షలు చేయించుకున్న వారిలో వైరస్ సోకిన వారు కనపడుతున్నప్పటికీ, ఉన్నట్లుండి ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. దేశంలో కరోనా వైరస్ కల్పించిన భయోత్పాతం ఇంకా పోలేదు. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం అలసత్వం ప్రవేశించినట్లు స్పష్టంగా కనపడుతోంది. ఢిల్లీలో ఒక తెలుగు జర్నలిస్టు జ్వరంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయం తెలిసినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కాలేదు.


అతడిని ప్రాథమికంగా కలిసిన వ్యక్తుల విషయమై ఆరా తీయడం, అటువంటి వారిని క్వారంటైన్‌కు పంపడం లాంటి చర్యలేవీ చేపట్ట లేదు. ఆ జర్నలిస్టుతో పాటు ఆసుపత్రికి వెళ్లిన నలుగురైదుగురు తమంతట తాము పరీక్షలు చేయించుకుంటే మరో ఇద్దరికి కరోనా వచ్చినట్లు తేలింది. దీనితో వారిలో వారు చర్చించుకుని ప్రాధాన్యత ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించారు. దేశంలో ఇతర వర్గాల ప్రజలకు, జర్నలిస్టులకు ఉండే చైతన్యం కానీ, అవకాశాలు కానీ ఉండవు. రోగలక్షణాలు ఉంటే సరే, లేనప్పుడు పరీక్షలు చేయడమే అనవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అంటున్నారు.  కానీ రోగ లక్షణాలు లేకున్నా ఇద్దరు జర్నలిస్టులకు కరోనా వచ్చినట్లు తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో కరోనాను అరికట్టగలుగుతున్నామని వస్తున్న ప్రకటనల్లో వాస్తవమెంతో కాలం గడిచేకొద్దీ మరింత స్పష్టమవుతుంది.


మే 3 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఈ సారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించలేదు. ఆ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ మాత్రమే విడుదల చేసింది. మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించక ముందే ప్రభుత్వం అనేక సడలింపులు ప్రకటించింది. వాటిలో ఒకటి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం; రెండవది- మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేయడం. ఈ రెండు నిర్ణయాల వల్ల లాక్‌డౌన్ లక్ష్యాలు దెబ్బతినే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో మార్చి 22న లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు కేంద్రం అసంఘటితరంగంలో ఉన్న లక్షలాది వలస కార్మికుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఎలా వ్యవహరించిందో ఇప్పుడు వారిని స్వస్థలాలకు పంపాలన్న నిర్ణయాన్ని ప్రకటించే ముందుకూడా అలాంటి అవగాహనారాహిత్యంతోనే వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.


ఆ రోజు బస్ డిపోల వద్ద వేలాది మంది కిక్కిరిసిపోయి కనపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికుల రిజిస్ట్రేషన్ సెంటర్ల వద్ద వారు తోసుకుంటూ కనపడుతున్నారు.  డిజిటల్ ప్రక్రియలో ఎలా నమోదు చేసుకోవాలో, మెడికల్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తేవాలో తెలియక అనేక చోట్ల వలస కార్మికులు పోలీస్ స్టేషన్లకు వెల్లువెత్తారు. అనేకచోట్ల వారి నుంచి పోలీసులో, ఇతర అధికారులో డబ్బులు వసూలు చేసిన ఉదంతాలు బయటపడ్డాయి. చాలా చోట్ల తమకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనందుకు వలస కార్మికులు రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, రాళ్లు రువ్వడం చేశారు. ఇంకా దేశంలో అనేక ప్రాంతాల్లో వందలాది వలస కార్మికులు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి.


చాలా మంది వలస కార్మికులు నెలరోజులుగా తాము అర్ధాకలితో ఉన్నామని, తమ జేబుల్లో చిల్లిగవ్వ కూడా లేదని మీడియాకు చెప్పుకుంటున్నారు.  చివరకు వారిని పంపిన రైళ్లలో కూడా డబ్బులు వసూలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ దేశంలో పేద ప్రజలు, చెమటోడ్చే కార్మికుల పట్లే ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించడం జరుగుతోంది? పేదలు, వలస కార్మికుల సంరక్షణకు ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత నలభై రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాలకు రాస్తున్న లేఖల్లో అధిక భాగం నీటిమీది రాతలుగానే ఎందుకు మిగిలిపోయాయి?


ఇప్పుడు వలస కార్మికుల విషయంలో రానున్న రోజుల్లో అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అందులో ప్రధానమైనది, వారిలో ఎందరికి కరోనా ఉన్నదో, వారు తాము వెళ్లిన ప్రాంతాల్లో కరోనాను ఏ మేరకు వ్యాప్తి చేయగలరో అన్నది ఇప్పుడే తేలడం కష్టం. వారు అనేక రాష్ట్రాల గుండా తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వలస కార్మికుల్లో 14 మందికి కరోనా సోకినట్లు తాజాగా వార్తలు వచ్చాయి. తబ్లీగీ జమాత్ మూలంగా దేశ వ్యాప్తంగా పాకిన కరోనా వైరస్ ఇప్పుడు ఈ వలస కార్మికుల వల్ల పాకదనే గ్యారంటీ ఏమిటి అన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. రెండవది, వలస కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లిపోతే మళ్లీ వారు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడితే కాని దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలు లేవు. నిజానికి వలస కార్మికులకు వైద్య పరీక్షలు చేయించి, వారికి సౌకర్యవంతంగా జీవించే అవకాశాలు కల్పిస్తే ఇంత పెద్ద ఎత్తున వారు తిరిగివెళ్లాలనుకునేవారు కాదు. కాని ప్రతి ముఖ్యమంత్రుల సమావేశంలోనూ వలస కార్మికుల సంగతి ఏమిటి? అన్న విషయం ప్రధానంగా చర్చనీయాంశమైంది. వారిని ఆయా రాష్ట్రాలకు పంపి చేతులు దులుపుకోవాలన్న అభిప్రాయమే అధికంగా వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు మొగ్గు చూపింది.


మరో ముఖ్యమైన విషయమేమిటంటే ముఖ్యమంత్రుల సమావేశాలను నాలుగు సార్లు ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రంనుంచి రాష్ట్రాలకు ఏమేరకు ఆర్థిక అండదండలు లభిస్తాయన్న విషయంలో స్పష్టత రాలేదు. రాష్ట్రాలు ఆర్థికంగా పూర్తిగా కునారిల్లిపోయాయి. అందుకే రెండవ సమావేశం నుంచీ ముఖ్యమంత్రుల్లో కొందరు మద్యం షాపులపై ఆంక్షలను ఎప్పుడు సడలిస్తారని అడగడం ప్రారంభించారు. కేంద్రం మద్యం దుకాణాలకు కూడా అనుమతులు ఇవ్వడంతో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆనంద పరవశులయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ప్రతి రాష్ట్రం మద్యం అమ్మకాలపై వచ్చే పన్నుల వల్ల 15 నుంచి 40 శాతం వరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడమే. గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం రూ.5,500కోట్లు మద్యం అమ్మకాలవల్లే ఆర్జించగలిగింది. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ రూ.25,100 కోట్లు, కర్ణాటక రూ.19,750 కోట్లు మద్యం అమ్మకాల వల్ల ఆర్జిస్తున్నాయి.


దేశంలోని రాష్ట్రాలన్నీ రూ.2.48 లక్షల కోట్ల మేరకు మద్యం అమ్మకాల వల్లే రెవిన్యూను పొందగలుగుతున్నాయి. బహుశా అందుకే, కనీసం మద్యం షాపులన్నా తెరిస్తే రాష్ట్ర ఖజానా కొంత భర్తీ అవుతుందని అన్ని రాష్ట్రాలూ యోచిస్తున్నాయి. మద్యం అమ్మకాలు లేకుండా 40రోజులు కూడా ప్రభుత్వాలు ముందుకు సాగని పరిస్థితుల్లో 40 రోజులుగా చేతికి పనిలేక, చేసిన పనికి వేతనాలులేక ఉన్న లక్షలాది మంది ఎలా జీవించగలరు? అందుకే ‘కరోనా వైరస్ వస్తుంది, పోతుంది.. ఏమి చేయగలం.. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి చూస్తుంటే దిక్కుతోచడం లేదు.’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో మొదటి రోజే అక్కడి 25,600 మద్యం దుకాణాలనుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి రూ.100 కోట్ల మేరకు ఆదాయం వచ్చిందని అంచనా.


వలస కార్మికుల విషయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న విషయం విస్మరించినట్లే మద్యం అమ్మకాలను ప్రారంభించినప్పుడు కూడా వైరస్ గురించి కేంద్రం ఆలోచించినట్లు కనపడడం లేదు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో జనం భారీ ఎత్తున క్యూలు కట్టి సామాజిక దూరం అనే నిబంధనకు స్వస్తి చెప్పినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామాల భావి పర్యవసానాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు మరి. అటువంటి ఆలోచనలతో ఆర్థికవ్యవస్థను దెబ్బతీసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ‘కరోనా వైరస్‌ను కట్టడి చేయడం ఎంత ముఖ్యమో, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కూడా అంతే ముఖ్యం’ అని ప్రధానమంత్రి అనడం ప్రారంభించాక ముఖ్యమంత్రులకు ఆత్మ విశ్వాసం వచ్చినట్లు కనపడుతోంది. సరే, దేశంలో మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత మందిరాలు మాత్రం ఏం పాపం చేశాయి? ఈ విషయమై చర్చ కూడా ప్రారంభమైంది. వారణాసిలో గంగానది ఒడ్డున  పడవలు నడిపేవారు, పూజలు పునస్కారాలు చేసే పూజారులు, దక్షిణ కోసం ఎదురు చూసే అర్చకులు, భిక్షాటనపై ఆధారపడిన అభాగ్యులు కూడా కరోనా వైరస్ మూలంగా మూతపడ్డ తమ జీవన ద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయని అడుగుతున్నారు. ఒక రకంగా సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆర్థిక వ్యవస్థతో పాటు ధార్మిక వ్యవస్థ కూడా అవసరమేమో. రెండింటికీ అవినాభావ సంబంధం లేకపోలేదు.


వలస కార్మికులు, మద్యం దుకాణాలే కాదు, రాజకీయాల విషయంలో కూడా వైరస్ గురించి ఆలోచించడం అవివేకం అని ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే  ప్రధాని మోదీతో మాట్లాడగానే ఎన్నికల కమిషన్ మే 21న శాసనమండలి ఎన్నికలను ప్రకటించింది. దీనితో ఉద్దవ్ ఠాక్రే శాసనమండలికి ఎన్నిక కావడానికి వీలు కలిగింది. మోదీతో మాట్లాడితే కేంద్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇవాళ అన్ని వ్యవస్థలూ మోదీ మనోగతానికి అనుగుణంగానే పనిచేస్తున్నాయి.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-05-06T06:00:43+05:30 IST