ఏపీ గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనా?

ABN , First Publish Date - 2020-08-05T06:29:17+05:30 IST

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ‘‘ఎపి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలను కలుపుకునే అభివృద్ధి బిల్లు’’–2020 అనే పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు...

ఏపీ గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనా?

ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రాజధాని ఒకటే ఉంటుంది. ఒకసారి ఏర్పాటు చేసిన తరువాత మార్చరు. ప్రభుత్వం మారడం మామూలే. కొత్త ప్రభుత్వం వచ్చినపుడల్లా మారడానికి రాజధాని ఉచిత సంక్షేమ పథకపు పేరు కాదు.


ఒకసారి రాష్ట్రపతి ఈ ప్రక్రియనంతా అనుసరించి జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయడానికి వీలుంటుందా, అందుకు మరోసారి అదే ప్రక్రియను అనుసరించడం ఎంతవరకు సమంజసం, ఏ మేరకు సాధ్యం అనేవి కీలకమైన ప్రశ్నలు. ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఇస్తూ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేసినప్పుడు, ఇదివరకే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కలిసి తీసుకున్న నిర్ణయం వమ్ము అయినట్టు కాదా? అది హైకోర్టు అధికారాన్ని తగ్గించడం కాదా? ఈ విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఎవరూ గుర్తు చేయలేదా?


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ‘‘ఎపి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలను కలుపుకునే అభివృద్ధి బిల్లు’’–2020 అనే పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేసే చట్టానికి ఆమోద ముద్రవేసి సంవిధాన మూల సూత్రాలకు సంబంధించిన సవాళ్లు లేవనెత్తారు. ఈ చట్టం సెక్షన్ 8లో మూడు రాజధానుల వివరాలు ఉన్నాయి. న్యాయరాజధాని కర్నూలులో ఉంటుందని రాష్ట్ర శాసనాలకింద నెలకొల్పిన అన్ని న్యాయపరమైన సంస్థలూ సాధ్యమైనంత మేరకు అక్కడనుంచి పనిచేస్తాయని సబ్ సెక్షన్ (3) లో పేర్కొన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఎపి హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలు న్యాయరాజధానికి తరలించడానికి, మరికొన్ని బెంచ్(లు) ఏర్పాటు చేయడానికి అనుసరించవలసిన ప్రక్రియను ప్రభుత్వం కొత్తగా మళ్లీ ప్రారంభించాలని సబ్ సెక్షన్ (4) నిర్దేశించింది. ఈ ప్రక్రియను అనుసరించి 20 నెలల కిందటే అమరావతిలో హైకోర్టును రాష్ట్రపతి నెలకొల్పారు. 


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతి రాజధాని ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తరువాత మరో రెండు రాజధానులను విశాఖ, కర్నూలులో ఏర్పాటు చేసి, అమరావతిని శాసనసభకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. అంటే రాజభవన్, సచివాలయం, ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలన్నీ కార్యనిర్వాహక రాజధాని విశాఖలో ఏర్పాటు చేస్తారు. అమరావతిలో ఉన్న హైకోర్టు కర్నూలు న్యాయరాజధానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఇదివరకే నిర్ణయమైన రాజధానిని పాక్షికంగా ఇతర ప్రాంతాలకు తరలించే, లేదా మూడు రాజధానులను నెలకొల్పే అధికారం గురించి సంవిధానంలో ఎక్కడా లేదు. ఏడో షెడ్యూలులో రాష్ట్రాల అధికారాలు పేర్కొన్న జాబితా, కేంద్ర అధికారాల జాబితా, ఉమ్మడి జాబితాలలో ఎక్కడా రాజధానుల మార్పుగురించి లేదు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. జమ్ము కశ్మీర్‌లో శీతాకాలం రాజధాని శ్రీనగర్ నుంచి జమ్ముకు మారుతుంది. మహారాష్ట్రలో కూడా నాగపూర్‌ను శీతాకాల రాజధాని అన్నారు. కాని ఆ రెండు రాష్ట్రాలలో కూడా ప్రధానమైన రాజధానులు ఒకటొకటే (శ్రీనగర్, ముంబై). 1966లో పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రాజ్యాంగ ఆర్టికిల్ 3 ప్రకారం పంజాబ్ హరియాణాలకు ఉమ్మడి రాజధానిగా చండీఘర్‌ను నిర్ణయిస్తూ దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఇది తప్ప రాజధానిని నిర్ణయిస్తూ చట్టం చేసిన సందర్భం లేదు. అది కూడా రాష్ట్రవిభజనకు సంబంధించిన పార్లమెంటరీ చట్టం. 


మన దేశ రాజ్యాంగానికి సమాఖ్య లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ యూనియన్ ప్రభుత్వానికి విశేషమయిన, అపరిమిత అధికారాలున్నాయన్నది వాస్తవం. దేశానికి స్వాతంత్ర్యం ప్రకటిస్తూ, ఇక్కడ అన్ని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాలు ఇచ్చి బ్రిటిష్ వారు అనేకానేక తగాదాలు సృష్టించారు. వందలాది సంస్థానాలను రాజ్యాలను సంప్రదింపుల ద్వారా మనదేశంలో కలుపుకున్నప్పటికీ, హైదరాబాద్, జమ్ముకశ్మీర్‌లకు భారత ప్రభుత్వ సైన్యాన్ని నడపాల్సి వచ్చిందనేది చరిత్ర. రాజ్యాలు, రాష్ట్రాలు రాజధానుల విషయంలో కేంద్రం పెత్తనం వహిస్తాయనడానికి ఇవి ఉదాహరణలు. 


మద్రాసు రాష్ట్రంనుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినపుడు ఆంధ్రకు రాజధాని లేదు. కర్నూలులో తాత్కాలికంగా రాజధాని, గుంటూరులో ఒక హైకోర్టు పనిచేశాయి. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంతో 1956లో ఆంధ్రను కలిపినప్పుడే హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని అయింది. అప్పటికి హైదరాబాద్‌లో ఒక హైకోర్టు కూడా వ్యవస్థాపితమై ఉంది. 


ఆరుదశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమాలు ఫలించి 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అవసరం మళ్లీ ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటు అనేది ఆర్టికిల్ 3 లో ఉన్న విశేషాధికారాల కారణంగా సాధ్యమైంది. కేంద్ర మంత్రి వర్గ సలహాపై రాష్ట్రపతి పునర్వ్యవస్థీకరణ బిల్లును పరిశీలించాలని సిఫార్సు చేయడమే కాకుండా, ఆ బిల్లును ఎపి అసెంబ్లీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పంపాలని రాజ్యాంగ నిర్దేశం. ఆ బిల్లును రెండు సభలు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి సంతకంతో చట్టమై రాష్ట్ర విభజన జరిగింది. తరువాత హైకోర్టు ఏర్పాటులో కూడా రాష్ట్రపతి చర్య అవసరమైంది. అడుగడుగునా రాష్ట్రపతి ప్రమేయం ఉందని ఈ ప్రక్రియ వివరిస్తున్నది. 


ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్‌ 5(2)లో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న తరువాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కొనసాగుతుందనీ, ఈలోగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొత్త రాజధాని ఉండాలని నిర్ధారించింది. ‘రాజధాని’ అనే మాట ఉంది కనుక పార్లమెంటు ఉద్దేశం ప్రకారం ఎపికి ఒకే రాజధాని మాత్రమే ఉండాలనే ప్రశ్న కూడా లేవనెత్తారు. అయితే రాజ్యాంగంలోనే కాకుండా 2014 చట్టంలో కూడా ఎన్ని రాజధానులుండాలి, ఎక్కడెక్కడ ఉండాలనే స్పష్టమైన నియమాలు లేవు.


రాజధాని విషయంలో రాష్ట్రానికి అధికారం ఉన్నప్పటికీ, హైకోర్టు ఏర్పాటు విషయంలో దానికి మాత్రమే పూర్తి నిర్ణయాధికారం లేదు. ఇందుకు న్యాయవ్యవస్థ స్వతంత్రతే కారణం. 2014 చట్టం సెక్షన్ 31(2) కీలకమైంది. రాష్ట్రపతి తన ఉత్తర్వు ద్వారా నియమించి ప్రకటించిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఏర్పాటవుతుందని నిర్ధారించారు. సబ్ సెక్షన్ (2)లో నియమాలు ఏమి చెప్పినప్పటికీ, సబ్ సెక్షన్ (3) ప్రకారం ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర గవర్నర్ అనుమతితో నిర్ణయించిన మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు (ఏకసభ్య, ద్విసభ్య పీఠాలుగా) రాష్ట్రంలో ప్రధాన స్థానం కాకుండా ఇతర చోట్ల ధర్మాసనాలు ఏర్పాటు చేసి న్యాయవిచారణలు జరపవచ్చు. అంటే ప్రధాన కార్యస్థానం నిర్ధారణ అయిపోయింది. ఇతర బెంచిల గురించి మాత్రమే రాష్ట్రానికి అధికారం ఉంది. అయినా ప్రధాన కార్య కేంద్రాన్ని కూడా మారుస్తానంటే లేని అధికారాలను వాడుకునే ప్రయత్నమే అవుతుంది. 


రాజ్యాంగం ఆర్టికిల్ 214 అనుసరించి, సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు, ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్లు 30(1)(ఎ), 31(1), (2) ఇచ్చిన అధికారాల ప్రకారం రాష్ట్రపతి అమరావతిలో ఎపి హైకోర్టును నెలకొల్పుతూ 26 డిసెంబరు 2018న ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం అమరావతిలో హైకోర్టు 1 జనవరి 2019నాడు మొదలైంది. ప్రస్తుతం అమరావతిలోని తాత్కాలిక భవనంలో పనిచేసే హైకోర్టు న్యాయనగరం (జస్టిస్ సిటీ)లో శాశ్వత భవనం నిర్మాణం అయిన తరువాత అందులోకి మారుతుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అంటే అమరావతిలో హైకోర్టు నెలకొల్పడం అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార పరిధిలోనిది కాదు. రాష్ట్రపతి, పార్లమెంట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు నిర్ణయాధికారంలో భాగం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకసారి రాష్ట్రపతి ఈ ప్రక్రియనంతా అనుసరించి జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయడానికి వీలుంటుందా, అందుకు మరోసారి అదే ప్రక్రియను అనుసరించడం ఎంత వరకు సమంజసం, ఏ మేరకు సాధ్యం అనేవి కీలకమైన ప్రశ్నలు. ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకునే అధికారం ఎపి ప్రభుత్వానికి ఇస్తూ 2020 బిల్లుపై గవర్నర్‌ సంతకం చేసినప్పుడు, ఇదివరకే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కలిసి తీసుకున్న నిర్ణయం వమ్ము అయినట్టు కాదా? అది హైకోర్టు అధికారాన్ని తగ్గించడం కాదా? ఈ విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఎవరూ గుర్తు చేయలేదా? 


ఎపి ప్రభుత్వ శాసనం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వును మార్చడం సాధ్యం కాదు. రాష్ట్రపతి ఉత్తర్వుద్వారా ఏర్పడిన హైకోర్టును మార్చే ప్రతిపాదన చేస్తున్న బిల్లుపై సంతకం చేయాలా, లేక రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయాలా అని గవర్నర్‌ ఆలోచించడం అవసరమని ఆర్టికిల్ 200 నిర్దేశిస్తున్నది. ఈ ఆర్టికిల్‌లో ఉన్న మినహాయింపు కీలకమైంది. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనిచేయవలసిన హైకోర్టు అధికారాలకు హాని కలిగిస్తుందని అనుమానం కలిగితే గవర్నర్ ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయడానికి వీల్లేదని ఈ మినహాయింపు స్పష్టంగా నిషేధిస్తున్నది. అంటే తనముందున్న బిల్లు హైకోర్టు రాజ్యాంగబాధ్యతలను నిర్వహించే అధికారాన్ని తగ్గిస్తుందా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది. హైకోర్టు ప్రధాన ధర్మాసనం పనిచేసే చోటును నిర్ణయించిన రాష్ట్రపతి ఉత్తర్వును నిరర్థకం చేసే నియమాలు బిల్లులో ఉన్నాయో లేదో గవర్నర్ పరీక్షించారా? 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి– అంటే కోస్తాంధ్ర, రాయలసీమ ఉత్తరాంధ్రలోని అన్ని కులాల మతాలవారికి అందుబాటులో ఉంటూ, వ్యాపారాలు రాజకీయాల ప్రాతిపదికపై కాకుండా సంవిధానపరమైన సమపాలన అందించే సమగ్రమైన రాజధానికోసం ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రాజధాని ఒకటే ఉంటుంది. ఒకసారి ఏర్పాటు చేసిన తరువాత మార్చరు. ప్రభుత్వం మారడం మామూలే. కొత్త ప్రభుత్వం వచ్చినపుడల్లా మారడానికి రాజధాని ఉచిత సంక్షేమ పథకపు పేరు కాదు.


మాడభూషి శ్రీధర్

Updated Date - 2020-08-05T06:29:17+05:30 IST