ఆంగ్ల మాధ్యమం ఆచరణీయమేనా?

ABN , First Publish Date - 2020-09-22T06:35:42+05:30 IST

ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలోనే కాకుండా ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో కూడ తెలుగు మాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది. విశ్వవిద్యాలయ పరీక్షల్లో...

ఆంగ్ల మాధ్యమం ఆచరణీయమేనా?

న్యాయస్థానాలలో ఈ చట్టం చెల్లుబాటు కాదనే విషయం తెలియని అవివేకులు కాదు. అయితే తెలిసి ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారనే అంశంపై, ‘ఇది రాజకీయ చదరంగంలోని ఒక ఎత్తుగడ. తాము పేదలకు మేలు చేయాలని చూస్తుంటే న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయనే భావన కల్పించి, న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడానికి, తమపై అభిమానం పెంచుకోవడానికి ఉద్దేశించిన విధాన’ మని కొందరు విశ్లేషకుల భావన.


ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలోనే కాకుండా ఉన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో కూడ తెలుగు మాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది. విశ్వవిద్యాలయ పరీక్షల్లో తెలుగులో సమాధానాలు రాస్తున్నారు. ఐఎఎస్‌తో సహా అన్ని పోటీ పరీక్షలలో తెలుగులో సమాధానాలు రాయొచ్చు. అన్ని రాష్ట్రాలలో పరిపాలన ఆయా రాష్ట్రాల అధికార భాషలలోనే జరుగుతోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా, ఎటువంటి విద్యార్థి ఉద్యమాలు గాని, ప్రజా ఉద్యమాలు గాని లేకుండానే ప్రాథమిక విద్యను ఇంగ్లీషు మాధ్యమంలో బోధించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్ని చేసింది.


‘ఉన్నవారు లక్షలు పోసి ఇంగ్లీషు మాధ్యమ విద్యాలయాలలో తమ పిల్లలను చదివించి, ఉన్నత పదవులన్నీ దక్కించుకుంటున్నారు. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం ద్వారా చదువుకోవడంతో పోటీపడలేకపోతున్నార’ని పాలక వర్గాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ద్వారా విద్యాబోధన జరిపించి పేదల అభ్యున్నతికి దోహదపడతామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రజలు తమని తిరుగులేని మెజారిటీతో ఎన్నుకున్నారని, చేసిన వాగ్దానాన్ని అమలు చేసే హక్కు తమకు ఉందని, దీనిని పేద ప్రజల పాలిటి ద్రోహులు మాత్రమే వ్యతిరేకిస్తారని, వారికి పేదల ఉన్నతి గిట్టదని ఎదురు దాడి చేస్తున్నాయి. ఈ వాదనతో ప్రతిపక్షాలు నోరు విప్పలేని పరిస్థితి. ప్రచార మాధ్యమాలలో ఈ వాదనను హోరెత్తించారు. దీనిపై మేధావులు మౌనం వహించారు. ఈ సంస్కరణతో పాలవర్గ అధిపతిని ‘ఆంధ్ర మెకాలే’ అని అభిమానులు కీర్తిస్తున్నారు.


పాలకపక్షం ఆధిపత్యంలో ఉండే ప్రజాప్రతినిధుల సభ తమ ఇష్టమొచ్చినట్లు చట్టం చేయవచ్చుననే భావన అనేకులతో నెలకొని ఉంది. కానీ, భారతదేశంలో సర్వోన్నత అధికారం ఒక్క రాజ్యాంగానికి మాత్రమే ఉంది. రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాల పరిధిలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ప్రజాప్రయోజనాలు, పాలనా సౌలభ్యాల కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం చట్టాలు చేస్తాయి. కార్యనిర్వాహక అధికారులు వాటిని అమలు చేస్తారు. చేసిన చట్టాలు కానీ, వాటి అమలు కానీ రాజ్యాంగం నిర్దేశించిన అంశాలకు భిన్నంగా ఉంటే, ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. సదరు ఉన్నత న్యాయస్థానాలు విచారించి రాజ్యాంగంలోని అంశాలకు భిన్నంగా ఉన్న చట్టాలను రద్దు చేస్తాయి.


‘విద్య’ ఉమ్మడి జాబితాలోని అంశం. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు, విధానాలు రూపొందించవచ్చు. వీటి మధ్య వైరుధ్యం ఉంటే కేంద్ర చట్టం లేదా విధానం మాత్రమే అమలవుతుంది. రాష్ట్ర చట్టం లేదా విధానం రద్దవుతుంది. కేంద్ర ప్రభుత్వం తమ జాతీయ విద్యావిధానం-2020లో ప్రాథమిక విద్య మాతృభాషలో బోధించాలని స్పష్టంగా పేర్కొన్నది. దీనిని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. అందువల్ల ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన కోసం రాష్ట్రం చేసిన చట్టం చెల్లుబాటు కాదు. విద్యాబోధనకు సంబంధించి రాజ్యాంగంలో ఒక స్పష్టమైన అధికరణ ‘350-ఎ’ ఉంది.


అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు వారి మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరపాలని, ప్రతి రాష్ట్రప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేయాలని ఈ అధికరణం స్పష్టం చేస్తోంది. దీనికి అనుగుణంగా సౌకర్యాల కల్పన అమలులో అవసరమని భావిస్తే రాష్ట్రపతి తగిన ఆదేశాలను జారీచేయవచ్చునని కూడా అది పేర్కొంటోంది. అయితే దీనిపై ప్రభుత్వ సలహాదారులు; మహ్మదీయ, బౌద్ధులు, జైనులు వంటి అల్ప వర్గాలకు మాత్రమే ఈ అధికరణం వర్తిస్తుందని, ప్రాథమిక విద్యార్థులందరికీ కాదని, కనుక మాతృభాషలో బోధన చేయవలసిన అవసరం లేదని బల్లగుద్ది వాదించవచ్చు.


ఆంగ్ల భాషా మాధ్యమం ద్వారా బోధన ఆచరణ సాధ్యమా అని పరిశీలిస్తే, గతంలో ఇలాంటి ప్రయత్నమే ఒకటి జరిగింది. 1960వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యామంత్రిగా పి.వి.జి. రాజు ఉన్నప్పుడు ఇంగ్లీషు భాషను 3వ తరగతి నుంచి ఒక పాఠ్యంశంగా బోధించాలని ఉత్తర్వులిచ్చారు. ఆయనకు ఇంగ్లీషు భాషపై మక్కువ ఎక్కువ. అయితే పాఠశాలల్లో బోధించడానికి తగిన శిక్షణ పొందినవారు ఎవరూ లేకపోయారు. అందరూ సెకండరీ గ్రేడు శిక్షణ పొందినవారే. ప్రభుత్వం బ్రిటిష్‌ కౌన్సిల్‌ సహకారంతో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులకు మార్గదర్శక పుస్తకాలు (హేండ్‌ బుక్స్‌) రూపొందించింది. పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఎంపిక చేసి బెంగుళూరులో బ్రిటిష్‌ కౌన్సిల్‌ వారితో ఐదు నెలల పాటు శిక్షణ ఇప్పించింది.(ఈ వ్యాసకర్త అప్పట్లో శిక్షణ పొందారు.) ఆ శిక్షణ పొందిన వారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు, జిల్లా ఇంగ్లీషు బోధనా శిక్షణ కేంద్రాలలో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చారు. ఒక దశాబ్దం పాటు ఎంతో వ్యయం చేసినా ఆ విధానం జయప్రదం కాలేదు. ఆ తర్వాత దానిని రద్దు చేసి ఆరవ తరగతి నుంచి ఇంగ్లీషు పాఠ్యాంశాల బోధన అమలు చేశారు. ఇంగ్లీషును  ఒక పాఠ్యాంశంగానే చేయలేనప్పుడు, ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయిలో అమలు చేయడం ఎంత వరకు సాధ్యమో ఆలోచించాలి. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలో 95 వేల మంది ఉపాధ్యాయులున్నారు. వాళ్ళంతా సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులే. వాళ్ళందరికీ ఆంగ్లభాషా బోధనలో శిక్షణ ఇవ్వడానికి ఎంతకాలం పడుతుందో, ఎలా ఆచరణ సాధ్యమో విజ్ఞులు ఆలోచించాలి.


‘నిర్బంధ ప్రాథమిక విద్యాచట్టం’ ప్రకారం ఆరు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచితవిద్య అందించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉచితవిద్య అందిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా పేదవారికి ఉచిత బోధన వంటి ప్రణాళికలను రూపొందించి అమలుచేస్తే విద్యావకాశాలు మెరుగవుతాయి.


న్యాయస్థానాలలో ఈ చట్టం చెల్లుబాటు కాదనే విషయం తెలియని అవివేకులు కాదు. అయితే తెలిసి ఈ చట్టాన్ని ఎందుకు రూపొందించారనే అంశంపై, ‘ఇది రాజకీయ చదరంగంలోని ఒక ఎత్తుగడ. తాము పేదలకు మేలు చేయాలని చూస్తుంటే న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయనే భావన కల్పించి, న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయడానికి, తమపై అభిమానం పెంచుకోవడానికి ఉద్దేశించిన విధాన’ మని కొందరు విశ్లేషకుల భావన. ఉన్నత న్యాయస్థానాలు చివరగా ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పినప్పుడు పాలకులందరూ కోటీశ్వరులు కాబట్టి విద్యాట్రస్టులను రూపొందించి వాటి ద్వారా కార్పొరేటు విద్యాసంస్థలకు దీటుగా పేద విద్యార్థులకు ఉచిత విద్యాసౌకర్యాలు చేస్తే సమాజం మెచ్చుకుంటుంది.

ఎస్‌.ఆర్‌. మైనేని

Updated Date - 2020-09-22T06:35:42+05:30 IST