బడి బస్సు భద్రమేనా?

ABN , First Publish Date - 2022-06-08T05:23:25+05:30 IST

జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు కొంత కాలంగా ఉన్నచోట నుంచి కదలకుండా ఉండడంతో మూలనపడ్డాయి. గత విద్యా సంవత్సరంలో సెప్టెంబరులో బడులు ప్రారంభం అయినప్పటికీ పెద్ద స్కూల్‌లకు సంబంధించిన బడి బస్సులు రోడ్డెక్కాయి.

బడి బస్సు భద్రమేనా?
ఆయా పాఠశాలలకు చెందిన బస్సులు

- వారం రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు

- కరోనా కారణంగా స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టని ఆర్‌టీఏ

- రెండేళ్లుగా మూలనపడ్డ స్కూల్‌ బస్సులు

- గడువు ముగుస్తున్నా ముందుకు రాని యాజమాన్యాలు

- జిల్లాలో 270కి పైగా స్కూల్‌ బస్సులు

- ఇందులో ఇప్పటి వరకు 30 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ పరీక్షలు

- ఈనెల 13 లోపు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలంటున్న ఆర్‌టీఏ


కామారెడ్డి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు కొంత కాలంగా ఉన్నచోట నుంచి కదలకుండా ఉండడంతో మూలనపడ్డాయి. గత విద్యా సంవత్సరంలో సెప్టెంబరులో బడులు ప్రారంభం అయినప్పటికీ పెద్ద స్కూల్‌లకు సంబంధించిన బడి బస్సులు రోడ్డెక్కాయి. మిగతా పాఠశాలల బస్సులు ఇంకా కదలకుండానే ఉన్నాయి. ఈనెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న చాలా మంది విద్యార్థులు స్కూల్‌ బస్సుల్లోని పాఠశాలకు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బడిబస్సు భద్రమేంతా అనే అనుమానం తల్లిదండ్రులలో వ్యక్తం అవుతోంది. ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ గడువు ముగిసింది. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణా శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో 270 వరకు స్కూల్‌ బస్సులు

జిల్లాలోని కామారెడ్డి,ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో మొత్తం 270 వరకు స్కూల్‌ బస్సులు ఉన్నట్లు ఆర్‌టీఏ రికార్డులు చెబుతున్నాయి. గత మే 15 నుంచే స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని సంబంధితశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులో 30 వరకు స్కూల్‌ బస్సులు మాత్రమే ఆర్‌టీఏ కార్యాలయానికి వచ్చి ఫిట్‌నెస్‌ సామర్థ్య టెస్టులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా స్కూల్‌ బస్సుల యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై ఆర్‌టీఏ అధికారులు దృష్టి పెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఫిట్‌నెస్‌లేని స్కూల్‌ బస్సులు రోడ్డుపైకి వస్తే సీజ్‌ చేస్తామని ఆర్‌టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో చాలా స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ లేకుండానే తిప్పుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి ఉండడం, స్కూల్‌ బస్సులు సైతం రోడ్లపైకి రాలేదు. దీంతో అధికారులు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టలేదు. కరోనా ఉధృతి తగ్గినందున పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేఫథ్యంలో స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై ఆర్‌టీఏ అధికారులుఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

-రోజుకు రూ.50 జరిమానా

స్కూల్‌బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించనున్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు జరిమానాల పేరిట ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. అయితే కేంద్రప్రభుత్వం కరోనా సమయంలో ఫిట్‌నెస్‌ సామర్థ్యం పరీక్షలకు ఏడాదిన్నర పాటు వెసులుబాటు కల్పించింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి వాహనాల సామర్థ్య పరీక్షలు చేయించుకోని వాటికి రోజుకు 50 చొప్పున జరిమానా కట్టాలని నిబంధన విధించింది.

బస్సు భద్రమెంత

కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఆర్థికంగా చతికలపడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు కొనసాగాయి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో నేరుగా విద్యాబోధన జరుగుతుంది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కూడా చెల్లించలేని పరిస్తితుల్లో ఉన్నారు. ఈనెల 13 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో తప్పనిసరి బస్సు భద్రత అవసరమేనని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు తదితర బస్సు సామగ్రి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్‌ బస్సులకు సంబంధించి 32 అంశాలతో ఉన్న నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్‌ వయస్సు 60 సంవత్సరాలకు మించొద్దు. ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ తప్పనిసరి, గతంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుల యాజమాన్యాలపై ఉంది.


ఫిట్‌నెస్‌ టెస్టు చేయించుకోవాలి

- వాణి, ఆర్‌టీవో, కామారెడ్డి

స్కూల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలను చేయించుకోవాలి. ఇప్పటికే కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆర్‌టీఏ కార్యాలయానికి వచ్చి స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయిస్తున్నారు. ఈనెల 13లోపు అన్ని స్కూల్‌ బస్సులు సామర్థ్య పరీక్షలు చేయించుకునేలా యాజమాన్యాలు సహకరించాలి. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా రోడ్డుపైకి స్కూల్‌ బస్సులు వస్తే సీజ్‌ చేస్తాం. స్కూల్‌లు ప్రారంభమైన తర్వాత స్కూల్‌ బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతాం. జిల్లాలో మొత్తం 270 స్కూల్‌ బస్సులు ఉన్నాయి.

Updated Date - 2022-06-08T05:23:25+05:30 IST