Abn logo
Nov 18 2020 @ 00:12AM

కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉందా?

ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోందని చెప్పడానికి కొలమానాలు లేవు. ఒకవేళ దళితులు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోందని అనుకున్నా, ప్రత్యామ్నాయం లేకపోతే ఆ మార్పు ఆచరణ రూపం దాల్చదు. మరి ప్రజలు తమవైపే మొగ్గు చూపుతున్నారని దేశ పాలక పక్షం చెప్పుకుంటే ఎవరు కాదనగలరు? 


భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఏ మాత్రం వ్యతిరేకత లేదని, ఎన్ని సంవత్సరాలు పాలించినా, ప్రజలు తమను ఆదరిస్తూనే ఉంటారని ప్రధానమంత్రి తో సహా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాక,  వివిధ  రాష్ట్రాల  ఉప ఎన్నికల్లో బిజెపి  మెజారిటీ సీట్లలో విజయం సాధించింది. దీంతో  ఇక  ఏ ఎన్నికలు జరిగినా  బిజెపికి తిరుగుండదనే అభిప్రాయానికి ఆస్కారం ఏర్పడింది. ఎన్నికల్లో గెలిచే కళలో బిజెపి ఆరితేరిందని, మిగతా పార్టీలకు ఆ విద్య ఇంకా పట్టుబడలేదన్న విషయం కూడా  స్పష్టం అవుతోంది.  మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దినదిన ప్రవర్ధమానం అవుతూ దేశం సుభిక్షంగా ఉన్నదని, ప్రజలకు అభివృద్ధి  ఫలాలు అందుతున్నాయని, నిరుద్యోగం అనేది క్రమక్రమంగా మటుమాయమవుతోందని, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన సాగుతోందని,  ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ  అలారారుతున్నాయని అందుకే ప్రజలు బిజెపికి శాశ్వతంగా అధికారాన్ని అప్పగించే అవకాశాలున్నాయని ఎన్నికల ఫలితాలను బట్టి ఎవరైనా అర్థం చేసుకుంటే కాదనలేం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఫలితాలను బట్టే పనితీరు నిర్ణయమవుతుంది.  ఆక్స్ ఫర్డ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన   విద్యాధికుడు,  దేశంలో కీలకమైన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ స్థానంలో ఈ దేశ  ప్రజలు ఒక  సాధువులా కనిపించే నరేంద్రమోదీ చేతికి పగ్గాలు అప్పగించిన  నాటి  నుంచీ   ఆర్థిక, రాజకీయ సామాజిక పరిణామాలు వినూత్న దశలో సాగిపోతున్నాయి. ప్రజల విచక్షణను కాదనగల శక్తి ఎవరికీ లేదు.


ప్రజాస్వామ్యంలో అధికార పక్షం బలపడుతున్న కొద్దీ సహజంగానే ప్రతిపక్షం బలహీనపడుతుంది. మరో రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం బలోపేతం కాలేకపోతే అధికార పక్షానికి తిరుగుండదు. ఈ రెండింటిలో ఏది కరెక్టు అనేది తార్కికంగా అంచనా వేయాలంటే గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను నిదర్శనంగా  తీసుకోవాలి. మన్మోహన్ సింగ్ కూడా పదేళ్లు అధికారంలో ఉన్నారు. పైగా ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించారు. కాని మన్మోహన్ సింగ్ 2009లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా కాంగ్రెస్ బలహీన పడుతూ భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతూ వచ్చింది. 2010లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 91 సీట్లు రాగా, కాంగ్రెస్ కు 4 సీట్లు మాత్రమే వచ్చాయి. 2012లో గోవా, పంజాబ్ ఎన్డీఏ చేతికి వచ్చాయి. 2013లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ బిజెపి కైవసం కాగా, ఢిల్లీలో బిజెపి అత్యధిక సీట్లు సాధించింది. ఇక 2014లో సార్వత్రక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే కాక, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ- కశ్మీర్ లో కూడా ఎన్డీఏ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు 2019లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో రెండవ సారి బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?  గతంలో తన హయాంలో  బలోపేతమయ్యేందుకు  బిజెపి   ప్రయత్నించినట్లే, బిజెపి హయాంలో తాము  బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నదా?   అలాంటి  ప్రయత్నాలు చేయడం లేదనే ఇటీవలి  ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.


బిహార్ ఎన్నికల్లో 70 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. సోనియా తనయ ప్రియాంకా వాధ్రా ఇన్ ఛార్జిగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లో 6 సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే అన్నిటిలో ఓడిపోవడమే కాక నాలుగు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్ కూడా కోల్పోయారు.  కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న  గుజరాత్ లో 8 సీట్లకు  ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లలోనూ ఆ పార్టీ  పరాజయం పాలైంది.  మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు తిలోదకాలిచ్చి బిజెపితో చేతులు కలిపిన 25 మందిలో 15 మంది మళ్లీ బిజెపి టికెట్ పై పోటీ చేసి గెలిచారు. ఈ రాష్ట్రంలో   ఎన్నడూ విజయం సాధించని ప్రాంతాల్లో కూడా  బాజెపి  ఈ సారి జయపతాక ఎగురవేసింది.  కర్ణాటకలో కూడా బిజెపి ఏనాడూ గెలవని సీరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ విజయం సాధించింది. తెలంగాణలో ని దుబ్బాకలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.


ఈ పరిస్థితి చూస్తుంటే భవిష్యత్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం కావడంలో ఆశ్చర్యం లేదు. బిహార్  ఫలితాల తర్వాత కాంగ్రెస్ తో  మరే పార్టీ అయినా చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉంటుందా అన్న విషయం కూడా అనుమానాస్పదమే. బిహార్ లో కాంగ్రెస్ కు అన్ని సీట్లు ఇచ్చి ఉండాల్సింది కాదని, ఆ పార్టీ వల్లే అధికారంలోకి రాలేకపోయామని రాష్ట్రీయ జనతాదళ్ నేతలే కాదు తారిఖ్ అన్వర్ వంటి కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. విచిత్రమేమంటే  కాంగ్రెస్ 70 సీట్లు తీసుకున్నప్పటికీ ఆ సీట్లను గెలిచేందుకు అవసరమైన వ్యూహరచన  చేయలేకపోయింది. ఉధృతమైన ప్రచారాన్ని నిర్వహించలేకపోయింది.  ఆ రాష్ట్రంలో  రాహుల్ గాంధీ పర్యటిస్తే ఏ మాత్రం హడావిడి కనిపించ లేదు. కొన్ని సభల్లో తేజస్వి యాదవ్ వచ్చి ప్రసంగించి వెళుతుంటే రాహుల్ గాంధీ అనామకుడుగా కూర్చుని గమనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోరాడే స్ఫూర్తి లేనప్పుడు అన్ని సీట్లు ఎందుకు తీసుకోవాలి? ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏమైనా సర్వేలు జరిపించిందా? సంస్థాగత యంత్రాంగాన్ని పటిష్ఠం చేసిందా? అన్న ప్రశ్నలకు జవాబిచ్చే నాథుడు కాంగ్రెస్ పార్టీలో లేడు. ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంటే రాహుల్ సిమ్లాకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారని ఆర్‌జెడి నేత ఒకరు వ్యాఖ్యానించారు.  బిహార్ కు వెళ్లకపోవడమే కాదు, తాను ఇన్ ఛార్జిగా ఉన్న  ఉత్తర ప్రదేశ్‌లో కూడా  ప్రియాంకా వాధ్రా పెద్దగా పట్టించుకున్న  సందర్భాలు కనపడ లేదు. గత ఫిబ్రవరి నుంచి ఆమె ‘వర్క్ ఫ్రమ్ హోమ్  చేస్తున్నారు..’ అని ఒక కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.


నిజానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేస్తున్నట్లు కనపడుతోంది. అధికారంలో ఉన్న లేకపోయినా ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి వివిధ అనధికార, అధికారిక కమిటీలను, సోషల్ మీడియా బృందాలను నియమిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ పదేళ్లు అధికారంలో ఉన్నా తమ వనరులను గ్రామాలనుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు  ఏ మాత్రం ఉపయోగించలేదు. నేతలు వృద్ధులు కావడం, అవినీతికి అలవాటు పడడం, స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం వల్ల బిజెపి నేతల మాదిరి ఒక నిర్మాణాత్మక శక్తిగా, పార్టీకోసం అంకిత భావంతో కృషి చేసే వారు కాంగ్రెస్ లో కొరవడంతో  రాహుల్ గాంధీ వంటి యువనేత చేతికి పగ్గాలు వచ్చినప్పటికీ ఏమీ లాభం లేకపోయింది.  వారసత్వంతో నిమిత్తం లేని నాయకులను ప్రోత్సహించగలిగిన లక్షణం బిజెపిలో ఉండగా, కాంగ్రెస్ లో వారసత్వమే నాయకత్వం కావడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు.


ఏ వారసత్వమూ లేని పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు  కొందరు పార్టీ నేతలే  పక్కలో బల్లెంలా వ్యవహరించేవారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో తీవ్ర విమర్శలకు గురిచేసేవారు. బహిరంగ వ్యాఖ్యానాలు చేస్తూ నాయకత్వాన్ని బలహీనపరిచేవారు. మాటిమాటికీ లేఖాస్త్రాలు సంధించేవారు. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇక వారికి పట్టపగ్గాలు ఉండేవి కావు. బిజెపికి అధికారం ధారపోస్తున్నారు.. అని విమర్శించేవారు.  కానీ పీవీ ఏదో రకంగా వ్యూహ ప్రతివ్యూహాల ద్వారా వారిని అడ్డుకుని అయిదేళ్లు సంకీర్ణ  ప్రభుత్వాన్ని విజయవంతంగా కొనసాగించారు.  పీవీ అధికారం కోల్పోగానే  వారు ఆయనను పక్కకు తప్పించేందుకు ఉక్కుమ్మడిగా కదిలారు. వారసత్వానికి నాయకత్వం అప్పగించేంతవరకూ వారు నిద్రపోలేదు.  కానీ ఇప్పుడు రాష్ట్రం తర్వాత రాష్ట్రం కోల్పోతుంటే చిన్న చిన్న రణగొణధ్వనులను కూడా సహించలేకపోవడం కనిపిస్తోంది. పీవీ సాధించిన దాని కంటే  పార్టీ రెండు సార్లు  మూడో వంతు సీట్లు కూడా సాధించ లేకపోయినప్పటికీ నాయకత్వాన్ని పెద్దగా ప్రశ్నించేవారు కనపడడంలేదు. ఇవాళ పీవీ శతజయంతి సందర్భంగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీలో   సహజ లక్షణంగా ఉన్న స్వయం విధ్వంసక  స్వభావమే దాన్ని  రోజురోజుకూ హరింపజేస్తున్నదని అర్థమవుతోంది. కొద్ది రోజుల క్రితం గులాంనబీ ఆజాద్ తో పాటు 23 మంది నేతలు లేఖ రాసినా, ఇవాళ కపిల్ సిబాల్, చిదంబరం వంటి వారు వ్యాఖ్యానాలు చేసినా కాంగ్రెస్‌లో ఏదో ఒక మార్పు జరుగుతుందని భావించడానికి వీలు లేదు.  కాని అసలు కాంగ్రెస్‌ను ప్రజలు ఒక సమర్థమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా అని కపిల్ సిబల్ వేసిన ప్రశ్నకు చాలా ప్రాధాన్యత ఉన్నది .


దేశంలో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపికి తిరుగులేకుండా పోతున్నదని, ప్రతిపక్ష పార్టీగా బలోపేతం కావాలన్న బలీయమైన ఆకాంక్ష కాంగ్రెస్‌లో కనపడడం లేదని  దేశ సామాజిక, రాజకీయ పరిణామాలపై అధ్యయనం చేసే సిఎస్ డిఎస్–లోక్ నీతికి చెందిన ఒక పరిశోధకుడు తెలిపారు.  కాంగ్రెస్ లో ఆత్మ పరిశీలన, సమీక్ష ఉంటే  ఈ పరిస్థితి తలెత్తేదికాదని, లోపలి నుంచి కుళ్లిపోయిన ఒక వ్యవస్థగా పార్టీ మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక బలమైన నాయకత్వాన్ని జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల్లోనూ ఏర్పర్చగలిగిన శక్తి కాంగ్రెస్ కోల్పోయినట్లు కనపడుతోందని ఆయన అన్నారు. మరో వైపు ప్రాంతీయ పార్టీలు కూడా విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. వీటన్నిటికి తోడు బిజెపి ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకుని అన్ని శక్తులూ ఒడ్డి పోరాడేందుకు, ముఖ్యంగా కార్యకర్తలతో పనిచేయించేందుకు సిద్ధపడుతోందని ఆయన అన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు ఏర్పడుతుందని చెప్పడానికి కొలమానాలు లేవు. ఒక వేళ  దళితులు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల  ప్రజల ఆలోచనల్లో మార్పు ఏర్పడుతోందని అనుకున్నా, ప్రత్యామ్నాయం లేకపోతే ఆ మార్పు ఆచరణ రూపం దాల్చదు. కనుక ప్రజలు తమ వైపే  మొగ్గు చూపుతున్నారని ఎవరైనా చెప్పుకుంటే దాన్ని కాదనడానికి వీలు లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)