రాచకొండంత సమస్యకు పరిష్కారమెన్నడో?

ABN , First Publish Date - 2022-01-24T05:52:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన రాచకొండ రైతుల పాలిట శాపంగా మారింది. అందరి లాగే కొత్త పాస్‌పుస్తకాలు వస్తాయని ఆశించిన ఇక్కడి రైతులకు నిరాశే మిగిలిం ది. అసైన్డ్‌ పట్టాదారులకు సైతం రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు అమలవుతుండగా, వీరికి మాత్రం అందడంలేదు.

రాచకొండంత సమస్యకు పరిష్కారమెన్నడో?

ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై హక్కు కోల్పోయిన రైతులు

భూరికార్డుల ప్రక్షాళనతో ప్రారంభమైన సమస్య

భూములు సాగుచేయకుండా అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు

రుణాలు చెల్లించాలని బ్యాంకర్ల ఒత్తిడి


 చౌటుప్పల్‌: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన రాచకొండ రైతుల పాలిట శాపంగా మారింది. అందరి లాగే కొత్త పాస్‌పుస్తకాలు వస్తాయని ఆశించిన ఇక్కడి రైతులకు నిరాశే మిగిలిం ది. అసైన్డ్‌ పట్టాదారులకు సైతం రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు అమలవుతుండగా, వీరికి మాత్రం అందడంలేదు. ఫారెస్ట్‌ అధికారుల అభ్యంతరం పేరుతో రెవెన్యూ అధికారులు రాచకొండ ప్రాంతంలోని సుమారు 1,000మం ది రైతులకు నూతన పాస్‌పుస్తకాల జారీని నిలిపివేశారు.దీంతో ఇక్కడి రైతులు భూములపై హక్కు కోల్పోయి ఆందోళన చెందుతున్నారు.


సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రాచకొండగుట్టలు 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి రాచకొండ పంచాయతీ పరిధిలో రాచకొండ, కడీలబాయితండా, తుంబాయితండా, ఐదుదోనలతండాలు ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం సీపీఐ నేత, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం రాచకొండలో భూపోరాటం నిర్వహించి ఈ పంచాయతీ పరిధిలోని భూమిలేని పేదలకు పంపిణీ చేశారు. నాటి నుంచి గిరిజనులు వారసత్వంగా వీటిని సాగుచేస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు భూములను నిరుపేదలకు పంపిణీచేశాయి. దీంతో వారు లక్షలాది రూపాయలు ఖర్చుచేసి కొండ లు,గుట్టలుగా ఉన్న ఈభూమిని వినియోగంలోకి తెచ్చి సాగుచేస్తున్నారు.


మూడు సర్వే నంబర్లలో అధిక భూమి

రాచకొండగుట్టలు సంస్థాన్‌నారాయణపురం మండలంతోపాటు చౌటుప్పల్‌, రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల మండలాల్లో విస్తరించి ఉన్నా యి. సంస్థాన్‌ మండలంలోని ఉమ్మడి రాచకొండ పరిధిలో పలు సర్వే నంబర్లలో వేలాది ఎకరాల భూమి ఉంది. అయితే మూడు సర్వే నెంబర్లలో మాత్రమే అత్యధిక శాతం భూమి ఉంది. రెవె న్యూ రికార్డుల ప్రకారం రాచకొండగుట్టల్లో మొత్తం 9,418.19 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. 2,217.20 ఎకరాల పట్టా భూములున్నా యి. 2,063 ఎకరాల లావుడ్యా పట్టా భూములు ఉన్నాయి. అందులో 626 ఎకరాల్లో సీలింగ్‌ భూములు ఉన్నాయి. సర్వే నంబర్‌ 273లో 7,351 ఎకరాలు, సర్వే నంబర్‌ 106లో 559 ఎకరాలు, సర్వే నంబర్‌ 192లో 3,159 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూముల్లో 90శాతం ఈ సర్వే నంబర్ల నుంచే ఉంది.


రికార్డుల్లో రైతుల వివరాలు లేక

రాచకొండ రెవెన్యూ పరిధిలో 504మంది రైతులకు లావుడ్యా పట్టాలు, 165మందికి సీలింగ్‌ పట్టాలు, 185మందికి ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాలు, మరికొంతమందికి ఇతర పట్టాలు ఉన్నాయి. తాతలు, తండ్రులకాలం నుంచి వీరు ఈ భూములను సాగుచేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డు ఆధారంగా పాస్‌బుక్‌లు, పహణీలు రావడంతో రైతులు బ్యాంకుల్లో రుణాలు సైతం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సైతం వర్తించాయి. కాగా, ఐదేళ్ల క్రితం ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది. ఈ భూములపై ఫారెస్ట్‌ అధికారులు అభ్యంతరాలు తెలపడంతో రైతులకు ఆన్‌లైన్‌ పహాణీలు రావడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం జారీచేసిన కొత్త పాస్‌పుస్తకాలు సైతం వీరికి అందలేదు. ఆన్‌లైన్‌ రికార్డుల్లో ఈ భూములకు సంబంధించిన రైతుల పేర్లు, వివరాలు లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వర్తించడంలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయాలని ఇప్పటికే పలుమార్లు ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించారు. సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ సమస్యకు నేటికీ పరిష్కారం లభించలేదు.


 రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి

రాచకొండ ప్రాంతానికి చెందిన రైతులు పట్టాదారు పాస్‌పుస్తకాలను బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల ను చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ఉమ్మ డి రాచకొండ పరిధిలోని రాచకొండ, కడిలబాయితండా, తుంబాయితం డా, ఐదుదొనలతండాతోపాటు పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన సుమా రు 1,000మంది రైతులు, గిరిజనులు పట్టాదారు పాస్‌పుస్తకాలను బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకొని చెల్లిస్తున్నారు. కాగా, ఐదారేళ్లుగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో తీసుకున్న వాటిని చెల్లించేందుకు రైతులు మొండికేస్తున్నారు. ఆన్‌లైన్‌ పహాణీలు రాకపోవడం వల్లే కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు. దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో తమ పేరు ఉండగా, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎందుకు పొందుపరచడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు రుణాలు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేస్తే బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను వడ్డీ సహా చెల్లిస్తామని రైతులు పేర్కొంటున్నారు.


రెవెన్యూ, ఫారెస్ట్‌ మధ్య వివాదం

రాచకొండలో గత ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన భూమిలో కొన్ని భూములు ఫారె్‌స్టశాఖకు చెందినవిగా ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ భూముల్లో రైతులు వ్యవసాయం చేయకుండా ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, వాటినే దున్ని సాగు చేస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం పట్టాలిచ్చిన భూము లు వేరే ప్రాంతంలో ఉన్నాయని, అక్కడికి వెళ్లి సాగు చేసుకోవాలని ఫారెస్ట్‌ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఫారెస్ట్‌, రెవె న్యూ అధికారుల మధ్య వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకుంటున్నా కొంతమంది రైతులు భూములను సాగుచేస్తుండటంతో వారిపై అధికారులు కేసులు నమోదు చేశా రు. భూములు దున్నిన ట్రాక్టర్లను సైతం సీజ్‌ చేశారు. భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే ప్రారంభించగానే ఫారెస్ట్‌ అధికారులు ఆటంకం సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.



మమ్మల్ని బలిచేయడం తగదు : కాట్రోతు సాగర్‌, కడీలబాయితండా మాజీ సర్పంచ్‌

రాచకొండగుట్టల్లో ఏళ్ల క్రితం ప్రభుత్వం మాకు భూములు, పట్టాలు ఇచ్చింది. వాటిని తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకొని బతుకుతున్నాం. గతంలోని రెవెన్యూ, ఆన్‌లైన్‌ రికార్డుల్లో సైతం మా వివరాలు ఉన్నాయి. వాటి ఆధారంగా బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల తర్వాత భూములను దున్నుకోనివ్వకుండా ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకొని, కేసులు పెడుతున్నారు. ఇదేంటని అడిగితే ఈ భూములు ఫారె్‌స్టవని చెబుతున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారుల మధ్య సమస్యతో మమ్ముల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి.



జాయింట్‌ సర్వే నిర్వహిస్తున్నాం : బ్రహ్మయ్య, సంస్థాన్‌నారాయణపురం తహసీల్దార్‌

రాచకొండ భూముల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, ఫారెస్ట్‌ శాఖలు కలిసి జాయింట్‌ సర్వే నిర్వహిస్తున్నాం. రెవెన్యూ భూములు, ఫారెస్ట్‌ భూములు ఎన్ని ఉన్నాయో, వాటి సరిహద్దులు ఎక్కడున్నాయో, గతంలో రైతులు, గిరిజనులకు ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూమిని పంపిణీ చేసింది, అందులో ఎంతమందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయో సర్వే చేస్తాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో భూములను ఎంతమంది సాగుచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నాం. సర్వే పూర్తయ్యాక వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాచకొండ భూసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2022-01-24T05:52:11+05:30 IST