ధాన్యం డబ్బులేవి?

ABN , First Publish Date - 2022-06-09T06:39:44+05:30 IST

ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. కొందరు రైతులు వ్యయ ప్రయాసాలకు ఓర్చి కాపాడుకున్న ధాన్యాన్ని అమ్ముకుంటే సరైన సమయానికి డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం డబ్బులేవి?
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం సంచులు

- జిల్లాలో నిలిచిపోతున్న ధాన్యం డబ్బులు

- ప్రభుత్వం నుంచి సకాలంలో విడుదల కాని పరిస్థితి

- 20 రోజులుగా ధాన్యం డబ్బుల కోసం తప్పని నిరీక్షణ

- రైతులకు ఇంకా అందని రూ.200 కోట్లు

- 52వేల మంది రైతులకు గాను 29వేల మందికి చెల్లింపులు

- జిల్లాలో 3లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్ల లక్ష్యం

- ఇప్పటి వరకు 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు


కామారెడ్డి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. కొందరు రైతులు వ్యయ ప్రయాసాలకు ఓర్చి కాపాడుకున్న ధాన్యాన్ని అమ్ముకుంటే సరైన సమయానికి డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ప్రభుత్వం నుంచి ధాన్యం డబ్బులు విడుదల కావడం లేదు. జిల్లాలో ధాన్యం అమ్మి రెండు నెలలు అవుతున్నా డబ్బులు రైతు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇప్పటికే 95 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయినప్పటికీ పూర్తి సగం మంది రైతులకు కూడా డబ్బులు అందలేదు. జిల్లాలో రూ.510 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు రూ.315 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారంటే రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం జరుగుతుందో తెలుస్తోంది.

2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

యాసంగి సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, ఐకేపీల ఆధ్వర్యంలో మొత్తం 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ యాసంగిలో మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత రెండు నెలల  నుంచి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 2,60,547 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోల్లు దాదాపు పూర్తయినట్లే, కొనుగోలు కేంద్రాలను సైతం మూసి వేశారు. కేవలం బీబీపేట, లింగంపేట మండలాల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తున్నారు.

రూ.510 కోట్లకు గాను రూ.315 కోట్లు మాత్రమే చెల్లింపు

జిల్లాలో యాసంగి సీజన్‌లో ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత రెండు నెలల నుంచి ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ద్వారా ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ, సహకార సంఘాలు, గ్రామీణ అభివృద్ధి శాఖ తరఫున కొనుగోళ్లు  చేపడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 52,205 మంది రైతుల నుంచి రూ.510 కోట్ల విలువ చేసే 2,60,547 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కానీ ఇందులో ఇప్పటి వరకు 29,476 మంది రైతులకు మాత్రమే రూ.315 కోట్ల ధాన్యం డబ్బులను చెల్లించారు. ఇంకా రూ.200 కోట్ల ధాన్యం డబ్బులు 22,729 మంది రైతులకు చెల్లించాల్సి ఉంది. రూ.400 కోట్లకు సంబంధించి డాటా ఎంట్రీ పూర్తి అయింది. 8వేల మంది రైతులకు రూ. 87కోట్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆగిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిగి 20రోజులు అవుతున్నా సగానికి కూడా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం డబ్బులు ఖాతాలో జమ కాగా డబ్బుల కోసం నిరక్షించాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతుంది.

ప్రభుత్వం నుంచి సకాలంలో విడుదల కాని ధాన్యం డబ్బులు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులకు డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా అది ఉత్తమాటగానే ఉండిపోతోంది. జిల్లాకు ప్రభుత్వం నుంచి ధాన్యం డబ్బుల చెల్లింపు కోసం ప్రతిరోజూ రూ.20కోట్లు రావాల్సి ఉండగా గత 10రోజుల నుంచి పూర్తిస్థాయి నిధులు రాకపోవడంతో ధాన్యం డబ్బుల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. గత 10 రోజులుగా ప్రభుత్వం ఒక రూపాయిల కూడా ధాన్యం డబ్బులు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం నిధులను విడుదల చేయకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. మద్దతు ధర లభిస్తుందని ఆశతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకున్న రైతులు సకాలంలో డబ్బులు అందక ఆందోళన చెందుతున్నారు. 10 నుంచి 20 రోజులు గడిచినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ధాన్యం డబ్బుల చెల్లింపులో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతూ వచ్చింది. కానా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా వద్ద, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ వద్ద నిధులు లేకపోవడంతో ఈ సీజన్‌కు సంబంధించిన చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ధాన్యం డబ్బులు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వానాకాలం పంటల సాగుకు జిల్లా రైతులు సిద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు, దుక్కులు దున్నేందుకు రైతుల వద్ద నయాపైసా లేకపోవడంతో ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటు ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడం, అటు రైతుబంధు పెట్టుబడి సాయం అందించకపోవడం సకాలంలో పంట రుణాలు దొరకకపోవడంతో వానాకాలం పంటల సాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ధాన్యం డబ్బులనైన సకాలంలో ఖాతాలో జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు రావడం లేదు

- జితేంద్రప్రసాద్‌, సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌, కామారెడ్డి

జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుంచి రైతుల ద్వారా ఽధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. జిల్లాలో రూ.510 కోట్లు విలువ చేసే 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా ఇందులో ఇప్పటి వరకు రూ.400కోట్ల డాటా ఎంట్రీ పూర్తయింది. ఇందులోంచి రూ.315 కోట్లు 29,476 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశాం. ఇప్పటికీ 87 కోట్ల ధాన్యం డబ్బులకు సంబంధించి పూర్తి చేశాం. కానీ ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు రాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సకాలంలో ధాన్యం డబ్బులు రైతులకు అందేలా చూస్తాం.


ధాన్యం అమ్మి 20రోజులు అవుతున్నా డబ్బులు రాలేదు

- రాజయ్య, రైతు, అడ్లూర్‌, కామారెడ్డి మండలం

కామారెడ్డి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి 20 రోజులు అవుతున్నా డబ్బులు ఇప్పటి వరకు నా ఖాతాలో జమ చేయలేదు. నాకు ఉన్న రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాను. ఎండలు తీవ్రంగా ఉండటం నీరు అందక దిగుబడి చాలా తగ్గి ఇప్పటికే నష్టపోయాం. వచ్చిన దిగుబడితో మొత్తం 29 క్వింటాళ్ల వరి ధాన్యం విక్రయించాను. దీనికి సంబంధించిన రూ.52వేలు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు డబ్బులు రాలేవు. కొనుగోళు కేంద్రాల నిర్వాహకులను అడిగితే రేపో.. మాపో వస్తాయంటున్నారు కానీ ఇప్పటికీ జమ కాలేదు.

Updated Date - 2022-06-09T06:39:44+05:30 IST