వైద్యుల ప్రాణాలకు రక్షణేదీ?

ABN , First Publish Date - 2021-06-19T05:51:46+05:30 IST

‘రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులకు రక్షణ కరువైంది. వైద్యులపై, వైద్య వృత్తిపై జరుగుతున్న దాడులకు తక్షణమే చరమగీతం పలకాలి’ అని ఐఎంఏ రాష్ట్ర సమన్వయకర్త దగ్గుమాటి శ్రీహరిరావు డిమాండ్‌ చేశారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. శుక్రవారం తిరుపతి బ్రాంచ్‌ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

వైద్యుల ప్రాణాలకు రక్షణేదీ?
నిరసన తెలుపుతున్న వైద్యులు

తిరుపతి సిటీ, జూన్‌ 18: ‘రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులకు రక్షణ కరువైంది. వైద్యులపై, వైద్య వృత్తిపై జరుగుతున్న దాడులకు తక్షణమే చరమగీతం పలకాలి’ అని ఐఎంఏ రాష్ట్ర సమన్వయకర్త దగ్గుమాటి శ్రీహరిరావు డిమాండ్‌ చేశారు. వైద్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. శుక్రవారం తిరుపతి బ్రాంచ్‌ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ బాధితుల ప్రాణాలను రక్షించడానికి వైద్యులు తమ ప్రాణాలను, కుటుంబాలను లెక్కచేయకుండా శ్రమిస్తున్నారని చెప్పారు. అలాంటి వైద్యులను కించపరిచేలా వ్యవహరిస్తూ, వారిపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధపెట్టి వైద్యులకు రక్షణ కల్పించి, దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తేవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో నెంబరు 57ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సిపాయి సుబ్రహ్మణ్యం కోరారు. మహిళా వైద్యులపైనా దాడులకు తెగబడుతున్నారని ఏఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్‌ కృష్ణప్రశాంతి వాపోయారు. అప్నా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బలరాం, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పార్థసారథిరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అప్నా జిల్లా కార్యదర్శి డాక్టర్‌ వాసుదేవనాయుడు, ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:51:46+05:30 IST