గొర్రెల పంపిణీలో పారదర్శకత పాటించరా?

ABN , First Publish Date - 2022-01-21T05:03:38+05:30 IST

గొర్రెల పంపిణీ పథకంలో ఎందుకు పారదర్శకత పాటించలేదని మండల పశువైద్యాధికారి జీన్నాత్‌ భానుపై ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గొర్రెల పంపిణీలో పారదర్శకత పాటించరా?
మండల పశువైద్యాధికారినిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

మండల పశు వైద్యాధికారిపై ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆగ్రహం 

జహీరాబాద్‌, జనవరి 20 : గొర్రెల పంపిణీ పథకంలో ఎందుకు పారదర్శకత పాటించలేదని మండల పశువైద్యాధికారి జీన్నాత్‌ భానుపై ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోహీర్‌లోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షురాలు బి.మాధవి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజాప్రతినిధుల సమస్యలను తెలుసుకున్నారు. కోహీర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో రెండు విడతలుగా గొర్రెల పంపిణీలో చాలావరకు అవకతవకలు జరిగాయని సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే సంబంధిత అధికారి వివరణ కోరారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా విద్యుత్‌శాఖ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యుత్‌ సరఫరాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదని పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు మరమ్మతుల పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కోహీర్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని వైస్‌ ఎంపీపీ షాకిర్‌అలీ పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్టుషాపులను మూయించాలని కోరారు. సభ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మాణిక్‌రావు హామీఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జి.రాందాస్‌, ఎంపీడీవో సుజాతనాయక్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T05:03:38+05:30 IST