ఇదేం జాబ్‌ క్యాలెండర్‌?

ABN , First Publish Date - 2021-06-22T05:48:11+05:30 IST

జాబ్‌ క్యాలెండర్‌పై నిరసనలతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది. జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి.. కొత్తది విడుదల చేయాలని నిరుద్యోగ యువజన విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఇదేం జాబ్‌ క్యాలెండర్‌?
కర్నూలు కలెక్టరేట్‌లో ధర్నా

  1. సీఎం వైఎస్‌ జగన్‌ మోసం చేశారు
  2. నిరుద్యోగులు, వివిధ సంఘాల ఆగ్రహం
  3. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద భారీ ఆందోళన
  4. లోపలకు దూసుకెళ్లిన నిరసనకారులు
  5. కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు డిమాండ్‌


కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూన్‌ 21: జాబ్‌ క్యాలెండర్‌పై నిరసనలతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది. జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి.. కొత్తది విడుదల చేయాలని నిరుద్యోగ యువజన విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళనకారులు కలెక్టరేట్‌ మెయిన్‌ గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు కలెక్టరేట్‌ కార్యాలయం మెయిన్‌ గేటును ఎక్కి లోపలికి వెళ్లిపోయారు. అడ్డుకున్న పోలీసులు తోసుకుంటూ వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. నిరుద్యోగులకు టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి తదితరులు మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల ఐక్యవేదిక, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు తులసీరామ్‌, సరస్వతి, గోవిందు, అబ్దుల్లా, నగేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 10వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసి జాబ్‌ జాతర క్యాలెండర్‌ అని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌.. తాను అధికారంలోకి రాగానే అన్ని ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులను గాలికి వదిలేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నప్పటికీ ఈ జాబ్‌ క్యాలెండర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఊసెత్తకపోవడం అన్యాయమని అన్నారు. గౌరవ వేతనం కింద ఏర్పాటు చేసిన వలంటీర్లను కూడా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చి రెగ్యులర్‌ ఉద్యోగాల లెక్కల్లో చూపడం దుర్మార్గమైన చర్య అన్నారు. గతంలో ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలన్నింటినీ కార్పొరేషన్‌ కిందకు చేర్చి వాటిని తమ ప్రభుత్వమే ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పడం అక్రమం అన్నారు. ఈ జాబ్‌ క్యాలెండర్‌ను రద్దు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను జారీ చేసి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక నాయకులు, నిరుద్యోగులు, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు. 


నంద్యాలలో..


నంద్యాల (ఎడ్యుకేషన్‌), జూన్‌ 21: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో డీవైఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగులు మోకాళ్ళపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హుసేన్‌బాషా, పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ నిరుద్యోగులకు 10 వేల పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడం దారుణమని అన్నారు. లక్షల్లో ఖాళీలను పెట్టుకొని కంటి తుడుపు చర్యగా 10 వేల పోస్టులు విడుదల చేయడం అన్యాయమని విమర్శించారు. నూతన క్యాలెండర్‌లో డీఎస్సీ, పోలీస్‌ శాఖ, సచివాలయ ఉద్యోగాలు, గ్రూపు -1, 2, 3, 4 ఉద్యోగాలను పొందుపరుస్తూ నూతన జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌, షాకీర్‌, సద్దాం హుసేన్‌, ఫణింద్ర, రమేష్‌బాబు, సమీర్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


ఆదోనిలో..


ఆదోని(అగ్రికల్చర్‌), జూన్‌ 21: అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేశారని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాస్‌, డీవైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు వీరేష్‌ ధ్వజమెత్తారు. సోమవారం పట్టణంలోని కంట్రోల్‌ రూమ్‌ సర్కిల్‌లో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో ఉపాధ్యాయ ఖాళీలు, పోలీస్‌ కానిస్టేబుల్‌, లైబ్రరీ, సచివాలయంలోని ఖాళీలను చూపకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో శివ, గణేష్‌, నాగరాజు, చిన్నరాజు, మోహన్‌, సతీష్‌, తిప్పన్న, శ్రీకాంత్‌, నాగరాజు, వీరన్న, రామాంజి పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరులో..


ఎమ్మిగనూరు, జూన్‌ 21: కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను తక్షణమే ప్రకటించాలని కోరుతూ సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థి యువజన, నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున విద్యార్థులు, యువకులు ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని పెద్దపార్కు నుంచి సోమప్ప సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం, తక్షణమే కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, పోలీసు, టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాయకులు వీరేష్‌ యాదవ్‌, నరసన్న, ఖాజా, మహేంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేశారు తప్ప మరో నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగులను తీవ్రంగా నిరాశపరచిందన్నారు. గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సిద్ధపడుతున్న నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు సురేంద్ర, హుస్సేన్‌, కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:48:11+05:30 IST