దీన్ని కర్ఫ్యూ అంటారా?

ABN , First Publish Date - 2021-06-06T08:00:22+05:30 IST

నెపం ప్రజల నెత్తిన వేసేసి చేతులు దులుపుకుంటున్నారు. జాగ్రత్తలు చెప్పి తప్పుకుంటున్నారు. సమీక్షల పేరుతో ఉపన్యాసాలు దంచి చోద్యం చూస్తున్నారు. రోజూ వేలాది మంది కరోనా బారినపడుతూనే ఉన్నారు.

దీన్ని కర్ఫ్యూ అంటారా?
మధ్యాహ్నం 1.15: తిరుపతి మున్సిల్‌ ఆఫీసు కూడలి

తిరుపతి-ఆంధ్రజ్యోతి : నెపం ప్రజల నెత్తిన వేసేసి చేతులు దులుపుకుంటున్నారు. జాగ్రత్తలు చెప్పి తప్పుకుంటున్నారు. సమీక్షల పేరుతో ఉపన్యాసాలు దంచి చోద్యం చూస్తున్నారు. రోజూ వేలాది మంది కరోనా బారినపడుతూనే ఉన్నారు. పదుల సంఖ్యలో మరణిస్తూనే ఉన్నారు. అయినా కట్టడి చర్యలు కనీసమాత్రం కూడా లేవు. సరిగ్గా ఏడాది కిందట తొలి అల రోజుల్లో పాటించిన జాగ్రత్తలకూ, అమలు చేసిన ఆంక్షలకూ, ప్రస్తుతం రెండో అల విరుచుకుపడి మృత్యు బీభత్సం చేస్తున్న ఈ సమయంలో ఉన్న పరిస్థితులకూ పొంతనే కనిపించదు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించమని చెప్పకపోవడంతో అధికారులూ, పోలేసులూ కూడ చూసీ చూడనట్టే ఉన్నారు. ఆంక్షల అమలు కఠినంగా లేకపోవడంతో ప్రజలు కూడా లెక్కాజమా లేకుండా తిరిగేస్తున్నారు. చివరికిది వేలాది ప్రాణాలు బలిగొంటున్నది. పేరుకు కర్ఫ్యూ అనేగానీ ఆ వాతావరణం జిల్లాలో ఎక్కడా పెద్దగా కనిపించడమే లేదు. దుకాణాలు మూయడం అనే ఒకే ఒక్క చర్య వల్ల మాత్రమే ఈ మాత్రం అయినా జన సంచారం తగ్గింది. అయినా రకరకాల కారణాలతో నగరాల్లో, పట్టణాల్లో ప్రజలు రోడ్ల మీద యధేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఆపేవారు లేరు. అడిగేవారు లేరు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో కనిపిస్తున్న వాతావరణం చూస్తే చిత్తూరు జిల్లాకు కరోనా నుండి విముక్తి కలుగుతుందనే నమ్మకమే కలగడం లేదు. కర్ఫ్యూ ఆంక్షల సడలింపు సమయాల్లోనూ జనం పోటెత్తుతున్నారు. నియంత్రణ దాదాపుగా లేదు. ఇలాగే కొనసాగితే మూడో అలదాకా అవసరం లేదు, రెండో అలలోనే జిల్లా అతలాకుతలం అయిపోయే ప్రమాదం కనిపిస్తోంది. శనివారం ఉదయం కర్ఫ్యూ సడలించిన సమయంలోనూ, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆంక్షలు అమలులో ఉన్న సమయంలోనూ చిత్తూరు, తిరుపతి నగరాల్లో కనిపించిన ఈ దృశ్యాలు చూస్తే చాలు మనం ఎంత ప్రమాదం అంచున ఉన్నామో అర్ధం కావడానికి. నాయకుల నిర్లక్ష్యానికీ, అధికార యంత్రాంగం పట్టనితనానికీ సాక్ష్యంగా ఉన్న చిత్రాలు ఇవి...







Updated Date - 2021-06-06T08:00:22+05:30 IST