Abn logo
Aug 19 2020 @ 00:59AM

ఇది రాజ్యాంగ న్యాయమేనా?

ప్రశాంత్ భూషణ్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార చట్టాన్ని ప్రయోగించలేదు. ఆ చట్టం క్రింద శిక్షించాలంటే అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా రాజ్యాంగంలోని 129వ అధికరణ క్రింద తనకున్న ప్రత్యేక అధికారాలను సుప్రీం కోర్టు ప్రయోగించింది. ఇతరులు ఎవరైనా శిక్షిస్తే కోర్టు తలుపు తట్టేందుకు అవకాశం ఉన్నది. కోర్టులే తమ కేసును తామే విచారించి శిక్ష విధిస్తే ఎక్కడకు వెళ్లాలి? ఇది ఒకప్పుడు రాజాస్థానాల్లో లభించే న్యాయం లాగా కనపడుతోంది.


‘న్యాయస్థానం భుజాలు చాలా విశాలమైనవి. ఎలాంటి విమర్శలనైనా అది విస్మరించగలదు’ అని ఈ శతాబ్ది తొలి సంవత్సరాలలో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ శామ్ పిరోజ్ భరూచా అన్నారు. మేధాపాట్కర్, అరుంధతి రాయ్ తదితరులు సుప్రీంకోర్టుపై చేసిన విమర్శల విషయంలో కోర్టు ధిక్కార ఆరోపణలకు సంబంధించి జరిగిన విచారణలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలా అని, ఈ మేధావులు చేసిన వ్యాఖ్యలు సరైనవని ఆయన అంగీకరించలేదు. వారు బాధ్య తారహితంగా మాట్లాడారని ఆయన అన్నారు. జయలలితను తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఇదే జస్టిస్ భరూచా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల తీర్పు పెద్ద ఎత్తున వచ్చి నంత మాత్రాన నేతలు రాజ్యాంగాన్ని అతిక్రమించలేరని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలో ఉన్న అవినీతి ప్రజాస్వామ్య మూలాలనే హరిస్తుందని ఆయన హెచ్చరించారు.


పరిపాలనా వ్యవస్థకు ఆమడ దూరంలో ఉంటూ అనేక కీలకమైన తీర్పులు వెలువరించిన జస్టిస్ భరూచా కోర్టు ధిక్కారం గురించి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మదన్ వి లోకూర్, రుమాపాల్, జిఎస్ సింఘ్వీ, అఫ్తాబ్ ఆలమ్తోపాటు 12మంది మాజీ న్యాయ మూర్తులు, దేశవ్యాప్తంగా మూడువేలమంది ప్రముఖులు ప్రశాంత్ భూషణ్ కేసులో ప్రస్తుత సుప్రీంకోర్టు వైఖరిని గర్హించారు. ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుపై చేసిన వ్యాఖ్యలు తమను తాము ఆత్మ పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించాయని, సుప్రీం రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన పాత్రను గుర్తు చేశాయని అన్నారు. విమర్శను ఉక్కుహస్తంతో నులిమివేయాలని భావిస్తే అది సుప్రీం ప్రతిష్ఠనే దిగజారుస్తుందని వారు హెచ్చరించారు. ఒకటి రెండు ట్వీట్లతోనే తమ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని ఉన్నత న్యాయస్థానం భావిస్తే న్యాయవ్యవస్థకు తమపై తమకు ఎంత బలహీనమైన విశ్వాసమున్నదో అర్థమవుతుందని వారు వ్యాఖ్యానించారు. కోర్టు తమ తీర్పుల ద్వారా ప్రజల దృష్టిలో గౌరవం నిలుపుకోవాలి కాని భయపెట్టడం ద్వారా గౌరవం రాదని వారు అన్నారు. ఇదే అభిప్రాయాన్ని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా వ్యక్తం చేసింది. ట్వీట్లు చేసినంత మాత్రాన సుప్రీం పరువు ఏదీ పోదని స్పష్టం చేసింది.


భారత దేశంలో ఇప్పుడు రాజ్య యంత్రాంగం, సుప్రీంకోర్టు ఒకే వైఖరిని అవలంబిస్తున్నట్లు, ఒకే స్వభావంతో వ్వహరిస్తున్నట్లు తెలుస్తోంది. విమర్శను బలంగా తొక్కి పెడితే తర్వాతి కాలంలో పెదవి విప్పేందుకు ఇతరులు భయపడతారని, ఆ తర్వాత స్వేచ్ఛగా, ఇష్టారాజ్యంగా తాము ఎంత వ్యవహరించినా అడిగే వారుండరని అనుకుంటున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఇవాళ న్యాయమూర్తుల ప్రతి అడుగూ న్యాయవాదులకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు ఎప్పుడు ఏ తీర్పు ఎందుకు ఇచ్చారో, ఎవరు ఆ తీర్పులను తిరగరాశారో వారికి తెలిసిపోతుంది. అందువల్ల తొలుత న్యాయవాదులను టార్గెట్ చేస్తే వారు భయభ్రాంతులవుతారని భావిస్తున్నట్లు కనపడుతోంది. ప్రశాంత్ భూషణ్ విషయంలో సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార చట్టాన్ని కూడా విస్మరించి తనంతట తాను శిక్షించేందుకు సిద్ధపడిందని మాజీ న్యాయమూర్తులు సైతం విమర్శించారు.


 విచిత్రమేమంటే ప్రశాంత్ భూషణ్ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార చట్టాన్ని ప్రయోగించలేదు. కోర్టు ధిక్కార చట్టం క్రింద శిక్షించాలంటే అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక అలాంటి అవసరం లేకుండానే చర్య తీసుకోవడానికి వీలుగా రాజ్యాంగంలోని 129వ అధికరణ క్రింద తనకున్న ప్రత్యేక అధికారాలను సుప్రీం కోర్టు ప్రయోగించింది. ఈ అధికరణ ప్రకారం కోర్టు తనంతట తాను కోర్టు ధిక్కారం క్రింద శిక్షించగలదు. దీని వల్ల కనీసం అటార్నీ జనరల్ దశలోనైనా ప్రశాంత్ భూషణ్కు ఊరట లభించే అవకాశం లేకుండా పోయింది. ఇతరులు ఎవరైనా శిక్షిస్తే కోర్టు తలుపు తట్టేందుకు అవకాశం ఉన్నది. కాని కోర్టులే తమ కేసును తామే విచారించి శిక్ష విధిస్తే ఎక్కడకు వెళ్లాలి? ఇది ఒకప్పుడు రాజాస్థానాల్లో లభించే న్యాయం లాగా కనపడుతోంది.


 రాజ్యాంగంలోని ఆర్టికల్ 215 క్రింద హైకోర్టుకు కూడా కోర్టు ధిక్కారం క్రింద శిక్షించే సర్వాధికారాలు ఉంటాయి. ఇవాళ సుప్రీంకోర్టును ఉదాహరణగా తీసుకుని దేశంలోని ప్రతి హై కోర్టూ కోర్టు ధిక్కారం క్రింద శిక్షించడం మొదలు పెట్టే అవకాశాలున్నాయి. కనుక కోర్టు తీర్పులపై, న్యాయమూర్తులపై వ్యా  ఖ్యానాలు చేసే వారు నోరు విప్పేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవల్సి ఉంటుంది. ఒక సామాజిక ప్రయోజనం ఆశించి, సకాలంలో కోర్టులు ప్రజలకు మేలుచేసే తీర్పులు ఇవ్వడంలేదని వ్యాఖ్యలు చేసే ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ న్యాయవాదుల పరిస్థితే సంకటంగా మారితే, తమకు అనుకూలంగా తీర్పులు రాలేదన్న అక్కసుతో నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేసే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించనక్కర్లేదు. 


భారత దేశంలో కోర్టులు శక్తిమంతంగా మారుతూ తమను ప్రశ్నిస్తే సహించలేని విధంగా వ్యవహరిస్తున్నాయంటే అది యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏదో రకమైన తీవ్ర ఒత్తిళ్లకు గురైన వారే వాటిని ఎదుర్కోలేక ఆ అసహనాన్ని ఇతరుల పట్ల ప్రదర్శిస్తుంటారు. అది న్యాయస్థానాల విషయంలో కూడా జరిగితే ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ విపత్కర పరిస్థితిలో పడతాయని భావించాల్సి ఉంటుంది. ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లలో ఒకటి ప్రధాన న్యాయమూర్తిపై వ్యక్తిగతంగా చేసింది. ఆయన హేర్లీ డేవిడ్‌సన్ మోటార్ సైకిల్‌పై మాస్కు, హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది వ్యక్తిగత ఆరోపణ అని తీర్పులో పేర్కొన్నప్పటికీ దాన్ని కోర్టు ధిక్కారం క్రింద ఎందుకు పరిగణించారో అర్థం కావడం లేదు. ఇక మీదట న్యాయమూర్తులు సభ్య సమాజంలో ఎంత అసభ్యంగా వ్యవహరించినా దాని గురించి పట్టించుకోవడం నేరం అవుతుందా?


ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండడంలేదన్నదీ, ముఖ్య మైన కేసులను పట్టించుకోకుండా కొన్ని ఎంపిక చేసిన కేసులనే విచారిస్తున్నారన్నదీ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యల అసలు అంతరార్థం అని ఆయనను సమర్థించిన న్యాయరంగంలో ఉన్న పలువురు ప్రముఖులు విశ్లేషించారు. న్యాయమూర్తుల సమయం అత్యంత విలువైనది కనుక ఏ కేసుకు ఎంత సమయం కేటాయిస్తున్నారనేది న్యాయవ్యవస్థ నాణ్యతకు నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. ఒక పౌరుడిగా న్యాయవ్యవస్థ పనిచేసే తీరుపై వ్యాఖ్యానించే అధికారం ఎవరికైనా ఉన్నది. అది వ్యక్తిగతమైనది కాదు. పోనీ ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యల నిజానిజాలపై ఆధారపడి కోర్టు ఏమైనా విచారణ జరిపిందా, ఆయన న్యాయవాది దుష్యంత్ దవే చేసిన కీలక ఆరోపణలపై ఏమైనా స్పందించిందా అంటే అదీ లేదు. కరోనా రోజుల్లో తమ కీలకమైన సమయాన్ని ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారం కేసుకు ఉన్నత న్యాయస్థానం వెచ్చించడంలో ఆంతర్యమేమిటో శోధించవలిసి ఉన్నది.


న్యాయవ్యవస్థలో ఉన్న అవినీతి గురించి ప్రశాంత్ భూషణ్ ఒక్కరే మాట్లాడలేదు. జస్టిస్ భరూచా కూడా తాను ప్రధాన న్యాయమూర్తి అయిన వెంటనే న్యాయవ్యవస్థలో 20 శాతం అవినీతి ఉన్నదని వ్యాఖ్యానించారు. మాజీ న్యాయమంత్రి శాంతి భూషణ్ (ప్రశాంత్ భూషణ్ తండ్రి), మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ కూడా సగం మంది న్యాయమూర్తులు అవినీతిపరులే అని ప్రకటించారు. అవినీతిపరులైన న్యాయమూర్తులపై శాంతి భూషణ్ సుప్రీం కోర్టుకు సమర్పించిన సీల్డు కవర్లో ఏముందో ఎవరికీ ఇంతవరకు తెలియదు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ న్యాయవ్యవస్థ జవాబుదారీగా వ్యవహరించాలని వాదించారు. న్యాయమూర్తులు తమ ఆస్తులను ప్రకటించాలని, వారికి ప్రవర్తనా నియమావళి ఉండాలని చెప్పారు. న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఆయన ప్రధాన మంత్రికి రహస్య లేఖ కూడా రాశారు. జస్టిస్ భరూచా తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ పట్నాయక్ కూడా న్యాయవ్యవస్థలో అవినీతిపై గొంతెత్తి అంతర్గత విచారణ జరగాలని, ఆరోపణలు ఎదుర్కొన్న న్యాయమూర్తి సెలవులో వెళ్లాలని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులపై కూడా ఎవరైనా న్యాయనిర్ణేతలుగా ఉండాలని, న్యాయమూర్తులకు ప్రవర్తనా నియమావళి ఉండాలని, దాన్ని చట్టం చేయాలని మరో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విఎన్ ఖరే సూచించారు. న్యాయవ్యవస్థలో అవినీతి గురించి పార్లమెంట్లో కూడా చర్చలు జరిగిన సందర్భాలున్నాయి. న్యాయవ్యవస్థ గురించి మాట్లాడినందుకు వీరందరినీ కోర్టు ధిక్కారం క్రింద శిక్షించాలా? సుప్రీం వైఖరిని ఖండించిన 12మంది న్యాయమూర్తులను ఏమి చేయాలి? అన్నది ప్రస్తుత న్యాయస్థానం నిర్ణయించవలసి ఉన్నది.


ప్రశాంత్ భూషణ్ కేసులో సుప్రీంకోర్టు వైఖరి చర్చనీయాంశమవుతున్న తరుణంలో ఫేస్బుక్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అమెరికా పత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’లో వచ్చిన ఒక వ్యాసంపై కాంగ్రెస్ గగ్గోలు పెడుతున్నది. బిజెపికీ ఫేస్బుక్కూ ఉన్న సంబంధాల గురించి కొత్తగా తెలిసినట్లు కాంగ్రెస్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. గత ఏడాదే ‘ఫేస్బుక్ నిజ స్వరూపం’ అన్న శీర్షికతో సీనియర్ జర్నలిస్టు పరంజయ్ గుహా థాకుర్తా ఒక పుస్తకం రాశారు. ఫేస్బుక్ నిజమైన శక్తిని బిజెపి అన్ని పార్టీల కంటే ముందుగా ఊహించి ఉపయోగించుకోవడం మొదలుపెట్టిందని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఎలా ప్రచారం చేయాలో ఫేస్బుక్ బిజెపి కార్యకర్తలకు శిక్షణ నిచ్చింది. బిజెపి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అనుమతించింది. కాంగ్రెస్కు సహకరించేందుకు నిరాకరించింది. బిజెపి, ఫేస్బుక్ పరస్పర అనుబంధం వల్ల రెండూ లాభపడ్డాయి. ఒకప్పుడు నష్టాల బాటలో ఉన్న ఫేస్బుక్ బిజెపితో సంబంధాల తర్వాత లాభాల బాటలో ప్రవేశించింది. వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ తన లాభాలను ప్రధానంగా ఆశిస్తుంది కాని ఇతర సామాజిక సమస్యల గురించి ఎందుకు ఆలోచిస్తుంది? బిజెపిని ఈ విషయంలో కాంగ్రెస్ విమర్శించడమంటే ఫేస్బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో తన వైఫల్యాన్ని అంగీకరించడమే. ఇవాళ న్యాయ వ్యవస్థ ముఖచిత్రం, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ప్రభావం భారత దేశ పాలనా వ్యవస్థ తీరుతెన్నులకు అద్దం పడుతున్నాయనడంలో ఆశ్చర్యం లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)