ఐక్యత సాధ్యమేనా?

ABN , First Publish Date - 2021-08-05T08:04:04+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారపక్షాన్ని ఇరకాటంలోకి నెడుతున్న తీరును అటుంచితే, మంగళవారం వాటి మధ్య కనిపించిన ఐక్యత...

ఐక్యత సాధ్యమేనా?

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారపక్షాన్ని ఇరకాటంలోకి నెడుతున్న తీరును అటుంచితే, మంగళవారం వాటి మధ్య కనిపించిన ఐక్యత రాజకీయ విశ్లేషకులను ఎంతో ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ ఆల్పాహార విందుకు పదిహేను విపక్షపార్టీల నేతలు హాజరుకావడమన్నది ఇటీవలికాలంలో కనిపించని దృశ్యం. కాంగ్రెస్‌ పార్టీ దీనిని చరిత్రాత్మకంగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు ‘ట్రైలర్‌’గా అభివర్ణిస్తున్నది. ఈ భేటీ అనంతరం చమురు ధరలకు వ్యతిరేకంగా రాహుల్‌ విపక్షనాయకులతో కలసి పార్లమెంటు వరకూ సైకిల్‌ యాత్ర కూడా చేశారు. ఇదంతా చూడ్డానికి బాగుంటుంది కానీ, ఎన్నికలకు ముందు రాహుల్‌ నాయకత్వంలో కలసికట్టుగా సాగడానికి విపక్షపార్టీల్లో ఎన్ని కలిసొస్తాయన్నది ప్రశ్న.


పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడిని ఊపిరాడకుండా చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఆదాయాలు దెబ్బతిని మధ్యతరగతి మానవుడు మరింత ఉక్కిరిబిక్కిరవుతున్న కాలంలో కూడా, చమురు నుంచి ఆదాయాన్ని పిండుకొనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఏ మాత్రం ఊరటనందించడం లేదు. రాజకీయమే కావచ్చు కానీ, రాహుల్‌ సైకిల్‌ యాత్ర సగటు మనిషి ఆవేదననూ, ఆగ్రహాన్ని ప్రతిఫలింపచేసింది. వారం క్రితం ట్రాక్టరు తోలి ఆయన రైతు ఉద్యమానికి సంఘీభావాన్ని తెలియచేశారు. విపక్షాలు ఒక్కటైతేనే బీజేపీ ఆరెస్సెస్‌లను ఎదుర్కోవడం సాధ్యపడుతుందని రాహుల్‌ ఉద్బోధించారు. మొత్తం పదిహేడు ప్రతిపక్షపార్టీలను విందుకు పిలిస్తే, బీజేపీ కాంగ్రెస్‌లకు సమానదూరంలో ఉంటామని భీష్మప్రతిజ్ఞ చేసిన మాయావతి, కేజ్రీవాల్‌ పార్టీలు మాత్రం గైర్హాజరైనాయి.


పెగాసస్‌మీద సభ సుదీర్ఘకాలంగా రగులుతున్నా, ప్రభుత్వం ఇస్తున్న వివరణలు, చేస్తున్న వాదనలు విపక్షాలకే కాదు, సామాన్యులకు సైతం సంతృప్తికరంగా లేకపోయాయి. నిఘా జాబితా నిజం కాదని ప్రభుత్వం వాదిస్తూండవచ్చు కానీ, రాహుల్‌ సహా అందులోని ప్రముఖుల పేర్లు చూసినప్పుడు దేశంలోని ప్రతీ నాయకుడూ అనుమానాలు, భయాల మధ్యన రాజకీయం నెరపాల్సిందే. పెగాసస్‌ నిఘా ద్వారా ప్రభుత్వం హక్కుల విధ్వంసానికి పాల్పడుతున్నదని మాక్‌ పార్లమెంటు ద్వారా ప్రజలకు తెలియచెప్పాలన్న విపక్షనేతల ఆలోచన మంచిదే. పార్లమెంటులో ప్రతిపక్షాల తీరు ప్రజలను అవమానించేట్టుగా ఉన్నదనీ, అవి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు, పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రజలసొమ్ముతో కొన్నారా లేదా అన్న విపక్షాల ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా, ఎదురుదాడికి పాల్పడితే ప్రజలు సైతం మెచ్చరు. పార్లమెంటులో గందరగోళ పరిస్థితులను అలాగే కొనసాగనిస్తూ తనకు అవసరమైన కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదింపచేసుకుంటున్నది.


రాహుల్‌గాంధీ కాస్త ఆలస్యంగానైనా, తన ప్రవృత్తికి భిన్నంగా ఈ మారు వ్యవహరిస్తున్నట్టుంది. యూపీఏకు ఆవలిపక్షాలను కూడా కలుపుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌ నాయకత్వంపట్ల ఇప్పటికే సానుకూలంగా ఉన్న డీఎంకె, ఆర్జేడీ వంటి పార్టీలను అటుంచితే, మరిన్నింటిని తనవైపు తిప్పుకోవడానికి ఈ తరహా భేటీలు ఉపకరిస్తాయి. మంగళవారం అల్పాహార విందు ప్రత్యేకంగా ఆయనను నాయకత్వ స్థానంలో ప్రతిష్ఠించేందుకు ఉద్దేశించినదేననీ, ప్రసంగం కూడా అందుకు తగినట్టుగానే ఉందని రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం. తృణమూల్‌ సహా చాలాపార్టీలను ఈ భేటీకి రప్పించడంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మమతాబెనర్జీ తన ఢిల్లీ పర్యటనలో సోనియా, రాహుల్‌ను కలవడంతో ఈ రెండు పార్టీల మధ్య గతంలో కంటే సాన్నిహిత్యం హెచ్చినట్టు కనిపిస్తున్నది. మూడు రాష్ట్రాలకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకంలోనూ రాహుల్‌ ముద్ర ఇటీవల కనిపించింది. మీడియా కంట్లో పడే రాజకీయ విన్యాసాలను అటుంచితే, విపక్షాలను ఒక్కటి చేసే విషయంలో రాహుల్‌ పట్టుదలగానే కృషిచేస్తున్నారని అంటున్నారు. ఆ పైన, ప్రశాంత్‌కిశోర్‌ సలహాలు, పార్టీ అంతర్గత ప్రక్షాళన రాహుల్‌ భవిష్యత్తును నిర్ణయించవచ్చునేమో!

Updated Date - 2021-08-05T08:04:04+05:30 IST