Apr 20 2021 @ 08:29AM

మెగాస్టార్ కోసం లైన్‌లో ఉన్నాడా..?

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ప్రతీ దర్శకుడికి ఉండే పెద్ద కల. ఆ కల నెరవేరాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. అదృష్ఠం కూడా ఉండాలి. ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరసగా యంగ్ డైరెక్టర్స్‌కి అవకాశాలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివతో ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ త్వరలో మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త సినిమాతో సెట్స్ మీదకి రాబోతున్నాడు. ఇక బాబీ, మెహెర్ రమెష్ కూడా మెగాస్టార్‌తో సినిమాలు చేయబోతున్నారు. ఈక్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్ కోసం కథ రెడీ చేసుకున్నాడని తాజా సమాచారం. ఆ దర్శకుడే వంశీ పైడిపల్లి. 

వంశీ పైడిపల్లి ఏమాత్రం హడావుడి లేకుండా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే తన నుంచి మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలొచ్చాయి. 2007లో  మున్నా సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు చేసింది కేవలం 5 సినిమాలే. గత ఏడాది మహేష్ బాబు నటిచిన సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమా మహేష్ బాబుతోనే ఉండాలి. కానీ మహేష్ ఈ ప్రాజెక్ట్‌కి నో చెప్పాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో మెగస్టార్‌కి వంశీ పైడిపల్లి కథ చెప్పనున్నట్టు సమాచారం. ఇంతకముందు వంశీ పైడిపల్లి.. నాగార్జున - కార్తిలతో ఊపిరి సినిమా తీసి సూపర్ హిట్ ఇచ్చాడు. మరి మెగాస్టార్‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు..కథ ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.