ప్రపంచ శాంతి అసాధ్యమా?

ABN , First Publish Date - 2020-06-24T05:48:00+05:30 IST

మామూలుగా ఎవరైనా తమ పిల్లలు చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించి, స్థిరపడి జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఏ వ్యాపారమో చేస్తూ ఎదగాలని కోరుకుంటారు...

ప్రపంచ శాంతి అసాధ్యమా?

మామూలుగా ఎవరైనా తమ పిల్లలు చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించి, స్థిరపడి జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఏ వ్యాపారమో చేస్తూ ఎదగాలని కోరుకుంటారు. కాని మిలటరీలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోమని ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలా అరుదు. అలా ప్రోత్సహించిన కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులకు మనం ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేము. సైనికుడు తన కుటుంబాన్ని త్యాగం చేసి మనకు చేస్తున్న సేవల వల్ల మనం మన కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుతున్నాము.


దేశంలో ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు, దేశద్రోహులు చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని, రాజకీయ నాయకుల అండతో దర్జాగా తిరుగుతుంటే, ఏ నేరం చేయని సైనికులు మాత్రం ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సివస్తున్నది? బొబ్బిపులి సినిమాలో యన్ టి రామారావు చెప్పినట్లుగా మన దేశ సైనికులు మనకు ఎలా దేశభక్తులో ప్రక్క దేశ సైనికులు కూడా వాళ్ల దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి వచ్చిన దేశభక్తులే కదా. వారికి వీరికీ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వమూ లేదు. అయినా ఒకరిని ఒకరు చంపుకోవాల్సి వస్తుంది. దేశాధినేతలు తీసుకునే నిర్ణయాలకు సైనికులు బలి అవుతున్నారు. ఈ రోజున మనిషి ఇంటర్నెట్‌తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇతర గ్రహాలపై చోటు వెతుకుతున్నాడు. కొత్త కొత్త ఆయుధాలను తయారు చేసుకోగలుగుతున్నాడు. ఇన్ని చేయగలిగినవాడు యుద్ధమే రాకుండా చేయలేడా? సరిహద్దుల్లో సైనికుల మరణాలను నివారించలేడా? ప్రతి దేశం రక్షణ కొరకు ఏటా లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నది. నిజంగా యుద్ధమనేదే లేకుంటే, ఆ లక్షల కోట్లతో దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రపంచ మేధావులంతా లేచి యుద్ధం వద్దు, చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సలహాలు ఇస్తారు. చర్చలు జరుగుతాయి కాని సమస్యలు మాత్రం పరిష్కారం కావు. అసలు దేశాధినేతలకు సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉంటుందా? అనేది అర్థం కాని ప్రశ్న. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాల నివారణకు శాశ్వత పరిష్కారం దొరికితే, కల్నల్ సంతోష్ బాబు లాంటి వారు బలి కాకుండా రక్షించుకోవచ్చు. ఎంతో మంది వీర సైనికుల తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని నివారించవచ్చు.

డాక్టర్‌ రవిశంకర్‌ ప్రజాపతి

Updated Date - 2020-06-24T05:48:00+05:30 IST