Abn logo
Sep 27 2021 @ 00:16AM

జడ్పీ చైర్మన్‌ స్థానంలో నేరచరితుడా..?

మల్కిరెడ్డిపై పత్రికల్లో వచ్చిన కథనాలను చూపుతున్న టీడీపీ నాయకులు

  1. మల్కిరెడ్డిపై క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాట కేసులు 
  2. టీడీపీ జిల్లా నాయకుల తీవ్ర ఆరోపణలు


కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 26: జిల్లా ప్రథమ పౌరుడి హోదా కలిగిన జడ్పీ చైర్మన్‌ కుర్చీలో పేకాట, బెట్టింగ్‌ తదితర నేరాలతో సంబంధం ఉన్న మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని కూర్చోబెడుతూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయం జిల్లా ప్రజలకు తీవ్ర ఆవేదన కలిగించిందని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రి నేర చరితులకు పదవులు కట్టబెడుతున్నాడని ఆరోపించారు. కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు బీసీ జనార్దన్‌ రెడ్డి, గౌరు చరితమ్మ, కోట్ల సుజాతమ్మ, మహిళా విభాగం కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షురాలు ముంతాజ్‌ బేగం, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర కుమార్‌ పాల్గొని మాట్లాడారు. ప్రజలందరికీ విశ్వాసం కలిగిన నాయకుడిని జడ్పీ చైర్మన్‌ కుర్చీలో కూర్చోబెట్టాల్సింది పోయి పేకాటరాయుడిని కూర్చోబెట్టడం ముఖ్యమంత్రి జగన్‌కే చెల్లిందని అన్నారు. 52 మంది జడ్పీటీసీల్లో అర్హులు ఎవరూ లేరన్నట్లుగా జగన్‌ ఏరికోరి వెంకటసుబ్బారెడ్డిని నియమిం చడం దారుణమని విమర్శించారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటకముందే వెంకటసుబ్బారెడ్డిని ఆ పదవి నుంచి తొలగించాలని బీసీ జనార్దన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటసుబ్బారెడ్డిపై కర్నూలు 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు(క్రైం నెంబర్‌ 135/2016), ఓర్వకల్లు పోలీస్‌స్టేషన్‌లో  మద్యం అక్రమ రవాణా (క్రైం నెంబర్‌ 300/2020), సంజామల పోలీస్‌స్టేషన్‌లో (క్రైం నెంబర్‌ 241/2021) పేకాట అందర్‌ బాహర్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. అలాంటి వ్యక్తికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడం ప్రజల్ని అవమానించడమే అని, చేసిన పొరపాటును సీఎం సరిదిద్దుకోవాలని బీసీ సూచించారు. కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి, మద్దూరు సుబ్బారెడ్డి, కేఈ కృష్ణమూర్తి వంటి ఎంతో మంది పెద్దలు ఆ పదవిని చేపట్టి జిల్లాకు వన్నె తెచ్చారని, అలాంటి స్థానంలో కూర్చోబెట్టేందుకు మంచివారు ఏ ఒక్కరూ సీఎంకు దొరకలేదా అని ప్రశ్నించారు. వెంకట సుబ్బారెడ్డి కంటే సద్గుణవంతులు.. నీతిమంతులు జడ్పీటీసీల్లో ఎవరూ లేరని జగన్‌ అనుకున్నారేమో అని ఎద్దేవా చేశారు. పోలీసులు, ఇంటలిజెన్స్‌ వారి నుంచి వెంకట సుబ్బారెడ్డి గురించి సమాచారం దొరకలేదా అని సీఎంను ప్రశ్నించారు. ఎస్పీ, కలెక్టర్‌ పక్కన వెంకట సుబ్బారెడ్డి జడ్పీ చైర్మన్‌ హోదాలో కూర్చుంటే ప్రజలు సహిస్తారా అని బీసీ ప్రశ్నించారు. 


జగన్‌పై సోమిశెట్టి, గౌరు విమర్శలు


తన తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని జగన్‌ రూ.వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సోమిశెట్టి, గౌరు వెంకటరెడ్డి అన్నారు. అందుకే నేర చరితులకు పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ధనార్జనే ధ్యేయంగా పదవులను కేటాయిస్తున్నారని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి టీజీ నరసింహులు, షేక్‌ ముంతాజ్‌ తదితరులు మాట్లాడుతూ వెంకటసుబ్బారెడ్డి జడ్పీ చైర్మన్‌గా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని, వెంటనే ఆ పదవి నుంచి తొలగించి సమర్థులను నియమించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మల్కిరెడ్డిపై పత్రికల్లో వచ్చిన కథనాలను విలేకరులకు చూపించారు. సమావేశంలో తెలుగు యువత నాయకుడు అబ్బాస్‌, సాంస్కృతిక విభాగం హనుమంతరావు చౌదరి, జేమ్స్‌, కొరకంచి రవికుమార్‌, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.