అది బూటకం కాదు..సాక్ష్యాల్లేవ్‌

ABN , First Publish Date - 2021-04-01T07:08:16+05:30 IST

సంచలనం రేపిన ఇష్రత్‌ జెహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను నిర్దోషులుగా విడుదల చేస్తూ సీబీఐ

అది బూటకం కాదు..సాక్ష్యాల్లేవ్‌

  • విధుల్లో భాగంగానే ఎన్‌కౌంటర్‌
  • ఉగ్రవాదులు కారని చెప్పే ఆధారాలేవీ?
  • నిందితుల విడుదలకు ప్రత్యేక కోర్టు తీర్పు
  • ఇష్రత్‌జెహాన్‌ కేసులో పోలీసులకు ఊరట

అహ్మదాబాద్‌, మార్చి 31: సంచలనం రేపిన ఇష్రత్‌ జెహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను నిర్దోషులుగా విడుదల చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఇంతకుమునుపే ముగ్గురు అధికారులను విడుదల చేయాలని ఆదేశించిన కోర్టు- తాజాగా మిగిలిన ముగ్గురు నిందితులకూ ఊరటనిచ్చింది. దీంతో 17-ఏళ్ల కిందట జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ ఘటనపై విచారణకు కోర్టు తెరదించింది.


2004 జనవరి 15న అహ్మదాబాద్‌ శివార్లలో తెల్లారుఝామున ఓ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ముంబైకి చెందిన ఇష్రత్‌ జెహాన్‌ అనే 19- ఏళ్ల అమ్మాయితో పాటు జావేద్‌ షేక్‌, అమ్జాద్‌ అలీ అక్బరాలీ రాణా, జీషన్‌ జొహర్‌ అనే నలుగురిని గుజరాత్‌  పోలీసులు కాల్చిచంపారు. నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని కడతేర్చడానికి వచ్చిన ఈ ముఠాకు లష్కరే తయీబాతో సంబంధాలున్నాయని, ఇష్రన్‌ ఓ మానవబాంబు అనీ పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ పచ్చి బూటకమనీ, తన కూతుర్ని అన్యాయంగా చంపేశారనీ ఇష్రత్‌ తల్లి  షమీమా కౌసర్‌ ఓ రిట్‌ పిటిషన్‌ వేశారు. తదనంతరం కోర్టు పర్యవేక్షణలో ఈ ఘటనపై సిట్‌ దర్యాప్తు, మెజస్టీరియల్‌ విచారణ, సీబీఐ దర్యాప్తు... అన్నీ జరిగాయి. ఇష్రత్‌ జెహాన్‌ సహా మిగిలిన వారి ఎన్‌కౌంటర్‌ బూటకమని ఈ మూడూ విస్పష్టంగా తేల్చాయి. 


సిట్‌ నివేదిక ఆధారంగా సీబీఐ మొత్తం ఏడుగుర అధికారులు- డీపీ వంజారా, పీపీ పాండే, ఎన్‌కే ఆమిన్‌, జేజీ పార్మర్‌, జీఎల్‌ సింఘాల్‌, తరుణ్‌ బారోత్‌, అనాజు చౌదరిలపై హత్యకేసు నమోదు చేసి విచారణ జరిపింది. అయితే విచారణ సమయంలోనే పార్మర్‌ మరణించారు. తరువాత వంజారా, పాండే, ఆమిన్‌లపై సాక్ష్యాధారాల్లేవన్న నెపంతో కోర్టు వారిని వదిలేసింది. ఇపుడు ఆఖరు ముగ్గురూ- సింఘాల్‌, బారోత్‌, చౌదరిలను కూడా విడిచిపెట్టింది. 



కారణాలివీ...

ఈ ముగ్గురి ప్రాసిక్యూషన్‌కు గుజరాత్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దానిని కూడా సీబీఐ సవాల్‌ చేస్తూ...  ప్రాసిక్యూట్‌ చేసేందుకు నిరాకరించే ఉత్తర్వును మతిలేకుండా ఇచ్చారని వాదించింది. దీనితో న్యాయమూర్తి విపుల్‌ ఆర్‌ రావల్‌ ఏకీభవించలేదు. ‘‘ప్రభుత్వ ఉత్తర్వులో తప్పేమీ లేదు. అది బూటకపు ఎన్‌కౌంటర్‌ కానే కాదు. విధి నిర్వహణలో భాగంగా నిందితులు (పోలీసు అధికారులు) ఆ ఎన్‌కౌంటర్‌ చేశారు. వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లేవు.


అంతేకాక ఆనాడు చనిపోయిన నలుగురూ ఉగ్రవాదులు కారని చెప్పడానికి ఆధారాల్లేవు. వారు నలుగురిలో ఇద్దరు పాక్‌ జాతీయులని కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు తెలిపాయి. ఐబీ ఇచ్చిన నివేదిక చూస్తే వారంతా టెర్రర్‌ గ్రూపుకు చెందినవారని తెలుస్తోంది. ఇష్రత్‌ లష్కర్‌ ఉగ్రవాది అనీ, ఓ మానవబాంబు అన్న విషయం డేవిడ్‌ హెడ్లీ ఇంటరాగేషన్‌ సమయంలోనే బయటపడింది.  ఆనాడు ఉగ్రవాద ముఠాలు అన్ని రాష్ట్రాల్లో సంచరించాయి. అలాంటి సమయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత పోలీసు అధికారులది.


ఈ నలుగురూ ఇతర రాష్ట్రాల్లో హింసా విధ్వంసాలకు తెగబడకుండా నిలువరించాల్సిన బాధ్యత పోలీసులది. వారు అదే చేశారు’’ అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. సీబీఐ కూడా వీరి ప్రాసిక్యూషన్‌ విషయంలో నిర్దిష్టమైన అంశాలేవీ పేర్కొనలేదని అంటే ఈ ముగ్గురూ పెట్టుకున్న డిశ్చార్జి పిటిషన్‌కు గుజరాత్‌ సర్కార్‌ అడ్డుచెప్పనందున వారిని విడుదల చేస్తున్నట్లు తీర్పులో వివరించారు. 


Updated Date - 2021-04-01T07:08:16+05:30 IST