స్వదేశానికి తిరిగి వస్తానంటోన్న ‘ఐసిస్ పెళ్లికూతురు‘

ABN , First Publish Date - 2021-09-16T22:20:17+05:30 IST

షమీమా బేగం... 2015లో అంతర్జాతీయ వార్తల్లో నిలిచిన పేరు. పుట్టుకతో బ్రిటీషర్ అయిన ఈమె అప్పట్లో మరో ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్‌తో కలసి సిరియా పారిపోయింది. అప్పటికి టీనేజర్ అయిన షమీమా ఇప్పుడు 22 ఏళ్ల యువతి.

స్వదేశానికి తిరిగి వస్తానంటోన్న ‘ఐసిస్ పెళ్లికూతురు‘

షమీమా బేగం... 2015లో అంతర్జాతీయ వార్తల్లో నిలిచిన పేరు. పుట్టుకతో బ్రిటీషర్ అయిన ఈమె అప్పట్లో మరో ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్‌తో కలసి సిరియా పారిపోయింది. అప్పటికి టీనేజర్ అయిన షమీమా ఇప్పుడు 22 ఏళ్ల యువతి. అంతే కాదు, ముగ్గురు పిల్లలకు తల్లి కూడా. కానీ, దురదృష్టవశాత్తూ ఆమె ముగ్గురు పిల్లలు ఇప్పటికే మరణించారు.


ఇంకా సిరియాలోనే ఉంటోన్న షమీమా బేగం కొన్నేళ్ల క్రితం వందల మంది బ్రిటీషర్ల మాదిరిగానే ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితురాలై ఇంటి నుంచీ పారిపోయింది. సిరియాలో ఓ ఐసిస్ ఫైటర్‌ని పెళ్లాడి అక్కడే ఉండిపోయింది. ఈమె లాంటి వారు దాదాపు 900 మంది ఉండగా వారిలో 150 మంది వరకూ బ్రిటన్ పౌరసత్వం కోల్పోయారు. అయితే, మొదట్లో ఐసిస్‌లో చేరినందుకు తానేం బాధపడటం లేదని స్టేట్మెంట్స్ ఇచ్చిన షమీమా బేగం క్రమంగా స్వరం మార్చింది. గత కొన్నేళ్లుగా తిరిగి బ్రిటన్‌కు వస్తానని మొరపెట్టుకుంటోంది. తాను కేవలం ఐసిస్‌ జిహాదీ ఒకరికి భార్యగా, తమకు పుట్టిన పిల్లలకు తల్లిగా మాత్రమే మసలుకున్నానని బేగం అంటోంది. అంతకుమించి ఉగ్రవాద కుట్రల్లో ఎప్పుడూ భాగం కాలేదని వాదిస్తోంది. 


తన పౌరసత్వం పునరుద్ధరించాలని షమీమా లాయర్ల ద్వారా బ్రిటన్ కోర్టులో అభ్యర్థిస్తోంది. స్వదేశంలోకి రానిస్తే ఎలాంటి విచారణ ఎదుర్కోటానికైనా సిద్ధమేనంటోంది. మరోవైపు, పుట్టుకతో బంగ్లాదేశీయుడైన షమీమా తండ్రి బ్రిటన్ ప్రభుత్వం తమపై జాతి వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్నాడు. ఇంతకీ, షమీమా వ్యవహారంలో బ్రిటన్ కోర్టు, బ్రిటన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదుగానీ... బంగ్లాదేశ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ షమీమాను తాము అనుమతించబోమని తేల్చి చెప్పేసింది!          


Updated Date - 2021-09-16T22:20:17+05:30 IST