Abn logo
Jul 27 2020 @ 12:20PM

భర్త పుట్టినరోజున.. అదనపు కట్నం కోసం అత్త చేయిచేసుకోగా.. మనస్తాపానికి గురై..

నెల్లూరు(ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టే బాధలు భరించలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరులోని వెంకటేశ్వరపురం ఇస్లాంపేటలో నాయబ్ రసూల్, షబీనా కుటుంబం నివసిస్తోంది. వారి కుమార్తె షమ్రీన్(20)ను అదే ప్రాంతంలోని నేతాజీనగర్‌కు చెందిన గయాజ్‌కు ఇచ్చి ఈ ఏడాది మే నెలలో వివాహం జరిపించారు. లాక్‌డౌన్ కారణంగా ముందుగా మాట్లాడుకున్న ప్రకారం కట్న కానుకలు ఇవ్వలేకపోయారు. రూ.50వేలకు సామాన్లు తీసిచ్చి, బంగారు ఆభరణాలు త్వరలో పెడతామని హామీ ఇచ్చారు.


అయితే వివాహం జరిగినప్పటి నుంచి అత్త గుల్జార్, భర్త కలసి అదనపు కట్నం, బంగారం కోసం షమ్రీన్‌ను వేధించసాగారు. ఈ నెల 25న గయాజ్ పుట్టిన రోజు వేడుక సందర్భంగా అత్త గుల్జార్ కోడలితో గొడవ పడి చేయిచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన షమ్రీన్ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. షమ్రీన్ భర్త, అత్తపై ఎస్ఐ శివప్రకాశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement