భద్రకాళీ దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు

ABN , First Publish Date - 2020-09-21T06:51:40+05:30 IST

తెలంగాణలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయానికి అంతర్జాతీయ ప్రమాణ సంస్థ (ఐఎస్‌వో) గుర్తింపు లభించింది

భద్రకాళీ దేవస్థానానికి ఐఎస్‌వో గుర్తింపు

భక్తులకు ఉత్తమ సేవలకుగాను ప్రదానం


వరంగల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 20: తెలంగాణలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయానికి అంతర్జాతీయ ప్రమాణ సంస్థ (ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అందుతున్న సేవలకుగాను ఈ గుర్తింపు దక్కింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎం.డి శివయ్య ఆదివారం ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, ఈవో సునీతకు అందజేశారు. అనంతరం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా యాదాద్రి తర్వాత భద్రకాళి ఆలయానికి ఐఎస్‌వో సర్టిఫికెట్‌ దక్కడం గొప్ప విషయమన్నారు. ఆలయంలో అందుతున్న సేవలు, పనితీరు, స్వచ్ఛతా ప్రమాణాలకు ఐఎస్‌వో 9001 : 2015 గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈ గుర్తింపుతో తనకు, అధికారులకు బాధ్యతలు పెరిగాయన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురాతన, చారిత్రక కట్టడాల అభివృద్ధికి, పునరుద్ధరణకు సీఎం కేసీఆర్‌ ప్రాధ్యానం ఇస్తున్నారన్నారు.


అమ్మవారికి సీఎం కేసీఆర్‌ బంగారు కిరీటం, ఇతర అభరణాలు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐఎస్‌వో బృందం కోరిన విధంగా ఆలయ సమీపంలో ఫస్ట్‌ఎయిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో భద్రకాళి బండ్‌ నగరానికి మరో మణిహారంగా మారుతుందని అన్నారు. దేవాలయాన్ని అద్వితీయంగా నిర్వహించడంతో పాటు ఆలయంలో పర్యావరణ పరిరక్షణ, భధ్రత, విద్యుత్‌ సరఫరా విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ఐఎస్‌వో సర్టిఫికెట్‌ లభించిందని, ఇదంతా సమష్టి కృషితోనే సాధ్యమైందని పేర్కొన్నారు. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎం.డి శివయ్య మాట్లాడుతూ దేవాలయాల్లో వాతావరణ కాలుష్య సూచికను ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని క్యూలైన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ సంస్థ ప్రతినిధులు, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు, భద్రకాళి ఆలయ సిబ్బంది  పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T06:51:40+05:30 IST