ఇర్కోడ్‌..ఇక ఐఎస్‌వో విలేజ్‌

ABN , First Publish Date - 2021-04-17T05:37:46+05:30 IST

సిద్దిపేట జిల్లాలో మరో గ్రామానికి అత్యున్నత గుర్తింపు లభించింది. ఈ దఫా అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్‌ సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడ్‌ గ్రామాన్ని ఐఎస్‌వో సర్టిఫికేట్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు పత్రాన్ని కూడా పంపించింది. రాష్ట్రంలో ఐఎస్‌వో సర్టిఫికేట్‌కు ఎంపికైన మొట్టమొదటి గ్రామం ఇదే కావడం విశేషం.

ఇర్కోడ్‌..ఇక ఐఎస్‌వో విలేజ్‌
ఇర్కోడ్‌ గ్రామపంచాయతీకి ఇచ్చిన ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం

రాష్ట్రంలో గుర్తింపు పొందిన తొలి గ్రామపంచాయతీ


 సిద్దిపేట రూరల్‌, ఏప్రిల్‌ 16 : సిద్దిపేట జిల్లాలో మరో గ్రామానికి అత్యున్నత గుర్తింపు లభించింది. ఈ దఫా అంతర్జాతీయ ప్రమాణాల ఆర్గనైజేషన్‌ సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడ్‌ గ్రామాన్ని ఐఎస్‌వో సర్టిఫికేట్‌కు ఎంపిక చేసింది. ఈ మేరకు పత్రాన్ని కూడా పంపించింది. రాష్ట్రంలో ఐఎస్‌వో సర్టిఫికేట్‌కు ఎంపికైన మొట్టమొదటి గ్రామం ఇదే కావడం విశేషం. ప్రభుత్వ పథకాల అమలు, సామాజిక సమానత్వం, ప్రజలకు సేవలందించడం తదితర అంశాలలో ఉన్నత ప్రమాణాలు పాటించినందుకు గాను ఈ గౌరవం దక్కింది. ఇర్కోడ్‌లో గ్రామపంచాయతీ పౌరసేవలు, గృహ నిర్మాణ అనుమతులు, లేఅవుట్‌ అనుమతులు, ఆస్తుల పేరు మార్పు, సమర్ధవంతమైన నీటి నిర్వహణ, రోడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటా చెత్త సేకరణ, సేకరించిన తడి, పొడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. హరితహారం కింద రోడ్లకు ఇరువైపులా, పొలం గట్లపై, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, బీడు భూముల్లో మొక్కలను పెంచారు. ప్రతి ఇంటికి ఐదు మొక్కలను అందజేశారు. పాఠశాలల భవనాల నిర్వహణ, పన్నుల వసూలు, సక్రమంగా ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించడంలో ఇర్కోడ్‌ అగ్రశ్రేణిగా, ఆదర్శంగా నిలిచింది.


మంత్రి అభినందన

గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి, ప్రతి పనిలో భాగస్వాములైతే ఏదైనా సాధ్యమేనని ఇర్కోడ్‌ గ్రామస్తులు నిరూపించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తూ మంచి పనితీరు కనబరిచిన ఇర్కోడ్‌ గ్రామం అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గ్రామస్థులందరూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని, మిగతా గ్రామాలన్నీ ఇర్కోడ్‌ బాటలో పనిచేయాలని సూచించారు. ఈ గుర్తింపునకు బాధ్యులైన ప్రజలు, ప్రజాప్రతినిధులను, అధికారులను ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు అభినందించారు.

Updated Date - 2021-04-17T05:37:46+05:30 IST