ఆనాడే ‘ఐసొలేషన్‌’ ఇళ్లు!

ABN , First Publish Date - 2020-07-29T09:46:18+05:30 IST

కరోనా సోకితే ఎవరికీ ఆ వైరస్‌ అంటకుండా జాగ్రత్తపడేందుకు ఇప్పుడంటే ఐసొలేషన్‌ కేంద్రాలు

ఆనాడే ‘ఐసొలేషన్‌’ ఇళ్లు!

  • గుమ్మడివెల్లిలో సజీవ సాక్షాలుగా 80 ఏళ్లనాటి శిథిలాలు
  • 40 ఎకరాలమ్మి రూ.2వేలతో యజమాని ‘జీ ప్లస్‌ వన్‌‘  
  • ప్రస్తుతం ఎకరం రూ.75లక్షలు.. భూమి విలువ రూ. 30 కోట్లు 
  • నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఆయన కుమారుడు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/ యాచారం) : కరోనా సోకితే ఎవరికీ ఆ వైరస్‌ అంటకుండా జాగ్రత్తపడేందుకు ఇప్పుడంటే ఐసొలేషన్‌ కేంద్రాలు న్నాయి! అక్కడ ఓ 14 రోజుల పాటు ఒంటరిగా గడిపి  చాలామంది వైరస్‌ నుంచి కోలుకుంటున్నారు. మరి.. కొవిడ్‌ మహమ్మారి మాదిరే 80-90 ఏళ్ళ క్రితం గడగడలాడించిన ప్లేగు విషయంలో నాటి జనం ఏం చేసివుంటారు? వ్యాధి సోకినవారు కాదు కానీ.. సోక కుండా ఉండేందుకు కొందరు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు! ఉన్న ఇళ్లు విడిచిపెట్టి, ఊరికి కిలోమీటర్ల దూరంలో ఓ అడవిలాంటి ప్రదేశంలో ఇళ్లు కట్టుకొని బతికారు. నాటి జనం తీసుకున్న జాగ్రత్తలకు సజీవ సాక్షాలుగా కొన్ని ఇళ్లు రంగారెడ్డిజిల్లా కందు కూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామ పొలిమేరలో ఉన్నాయి. అప్పట్లో ‘జీ ప్లస్‌ వన్‌’ ఇంటిని నిర్మిం చేందుకు గ్రామానికి చెందిన బత్తుల కృష్ణారెడ్డికి రూ.2వేల ఖర్చయింది. ఇందుకోసం ఆయన తనకున్న భూమిలో 40 ఎకరాలను ఎకరాకు రూ.40 చొప్పున విక్రయించారు. భూమిని అమ్మగా వచ్చిన రూ. 1600 రూపాయలకు మరో రూ.400 కలిపి ఇల్లు కట్టు కున్నారు. తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో ఆయన ఆ ఇంట్లోనే కొన్నాళ్ల పాటు జీవించారు. కృష్ణారెడ్డి కుమారుడు 90 ఏళ్ల బత్తుల నరసింహారెడ్డి, ప్లేగు వ్యాధి ప్రబలిన నాటి పరిస్థితులను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. 


కృష్ణారెడ్డికి వందెకరాలకు పైగా భూమి ఉండేంది. నర్సింహారెడ్డి 10 ఏళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు ప్లేగుతో చాలామంది చనిపోయారు. 1940లో గుమ్మడివెళ్లిలోనూ కొందరు ఈ వ్యాధి బారినపడ్డారు. ఎలుకలు ఇంట్లోకి దూరితే ఆ ఇంట్లో వాళ్లు చనిపోయేవారు. దీంతో భయపడిన కృష్ణారెడ్డి కుటుంబం ఊరు విడిచి రెండు కిలోమీటర్ల దూరం లోని వీరన్నబావికు వెళ్లి అక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఇది చూసి ఓ నలుగురు వారుంటున్న ఇంటి సమీ పంలోనే ఇళ్లు కట్టుకున్నారు. కొలన్‌గూడలోని మరికొం దరు పేదలు సమీపంలో గుడిసెలు వేసు కున్నారు. ప్లేగు అదుపులోకి రావడంతో శివార్లలో ఉన్న వారంతా గ్రామానికి వెళ్లిపోయారు. కృష్ణారెడ్డి కట్టిన జీ ప్లస్‌ వన్‌ సహా మూడు ఇళ్లు ఇప్పుడు నేల మట్టమయ్యాయి. ఆయన బంధువు రామిరెడ్డి ఇల్లు శిథిలా వస్థకు చేరింది. దాన్ని ఇప్పుడు వారి వారసులు పశువుల దాణా నిల్వ కోసం వాడుకుంటున్నారు. 80ఏళ్ల క్రితం 40 ఎక రాలు అమ్మగా రూ.1600 వచ్చాయని.. ఇప్పుడు ఎకరా రూ.75లక్షలకు చేరిందని నరసింహారెడ్డి చెప్పారు. 

Updated Date - 2020-07-29T09:46:18+05:30 IST