ఐసొలేషన్‌ ఎన్ని రోజులు?

ABN , First Publish Date - 2022-01-29T07:18:38+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి

ఐసొలేషన్‌ ఎన్ని రోజులు?

  • లక్షణాలు కనిపించినప్పటి నుంచా?
  • పాజిటివ్‌ అని తేలిన రోజు నుంచా?
  • కార్యాలయాలకు ఎప్పటినుంచి వెళ్లాలి?
  • వెంటనే టెస్టు చేయించుకోని బాధితులు
  • దీంతో లెక్కపై రోగుల్లో గందరగోళం
  • అనారోగ్య సమస్యల్లేకుంటే వారం తర్వాత
  • రోజూవారీ కార్యకలాపాలు: నిపుణులు


హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి? లక్షణాలు కనిపించిన రోజు నుంచా? లేక టెస్టులో పాజిటివ్‌గా తేలిన రోజు నుంచా? ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసేవారు కొవిడ్‌ వచ్చిన తర్వాత ఎన్ని రోజు లకు కార్యాలయాలకు హాజరుకావొచ్చు? ఆర్టీపీసీఆర్‌ టెస్టులోని సైకిల్‌ థ్రెష్‌హోల్డ్‌ వ్యాల్యూ (సీటీ వ్యాల్యూ)ను బట్టి ఐసొలేషన్‌లో ఉండాలా? ప్రస్తుతం వైరస్‌ బాధితుల్లో వ్యక్తమవుతున్న సందేహాలివి. పాజిటివ్‌ వచ్చాక ఏడు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడు రోజుల లెక్క ఎప్పుడన్నదానిపై చాలామందిలో స్పష్టత లేదు. లక్షణాలు కనిపించిన రోజు నుంచి ఏడు రోజులా? టెస్టులో పాజిటివ్‌ వచ్చినప్పటి నుంచి ఏడు రోజులా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. దీంతో ఉద్యోగుల్లో చాలామంది కార్యాలయాలకు వెళ్లడం లేదు. ప్రైవేటు యాజమాన్యాలు వీరుఎప్పటినుంచి కార్యాలయాలకు రావాలో చెప్పలేకపోతున్నాయి. ఒమైక్రాన్‌ వేరియంట్‌లో లక్షణాలు ఒకటి, రెండు రోజుల్లోనే కనిపిస్తున్నాయి. కొందరిలో మాత్రం మూడు, నాలుగు రోజుల తర్వాత బయట పడుతున్నాయి. ప్రస్తుతం కొందరు జలుబు, జ్వరం, దగ్గు వచ్చిన మూడు నాలుగు రోజుల తర్వాత కానీ పరీక్షకు వెళ్లడం లేదు. అప్పుడు పాజిటివ్‌ అని తెలుస్తున్నది. కాగా, వైద్య నిపుణులు పాజిటివ్‌ వచ్చిన రోజు నుంచి ఏడు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.


దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే కొందరిలో లక్షణాలున్నా.. వెంటనే కొవిడ్‌గా గుర్తించలేకపోతున్నారని పేర్కొంటున్నారు.  మరికొందరిలో ఏ లక్షణాలు కనిపించడం లేదు. అందుకే.. పాజిటివ్‌ వచ్చినప్పటి నుంచి ఏడు రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరిలో లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. వీరు లక్షణాలు కనిపించిన రోజు నుంచి ఏడు రోజులు ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుందని కొంతమంది వైద్యులంటున్నారు. కాగా, మూడు రకాల (లక్షణాల్లేని, స్వల్ప, మధ్య స్థాయి) లక్షణాలున్నవారు.. మందులు వాడకుండా, ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు లేకుండా 3 రోజుల పాటు ఉంటే వారి ఐసొలేషన్‌ ముగిసినట్లేనని వైద్యులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే పాజిటివ్‌ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు దగ్గు, జ్వరం (100డిగ్రీల్లోపు) లేకుంటే (ఎటువంటి మందులు తీసుకోకుండా ఉంటే) వారి ఐసొలేషన్‌ ముగిసినట్లేనని అంటున్నారు. ప్రస్తుతం హోంఐసొలేషన్‌ ఏడు రోజులేనని కేంద్రం మార్గదర్శకాలు చెబుతున్నాయి. పాజిటివ్‌లు ఆ తర్వాత ఇతరులను ఇన్ఫెక్ట్‌ చేయలేరని నిపుణులు అంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో మాత్రం పాజిటివ్‌లలో 99 శాతం మంది 10 రోజుల తర్వాతే, మిగతావారికి వ్యాపింపజేయరని అంటోంది. ఈ నేపథ్యంలో లక్షణాల్లేనివారు, తేలికపాటి లక్షణాలున్నవారు వారం తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే రోజూవారీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కొందరు మాత్రం బాగా నీరసంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. వీరు ఆరోగ్య పరిస్థితి, శరీరం సహకరించే తీరును బట్టి పని ప్రదేశాలకు వెళ్లాలంటున్నారు.   


సీటీ వ్యాల్యూతో ఐసొలేషన్‌ను నిర్ణయించలేం..

ఒమైక్రాన్‌లో వైరల్‌ లోడ్‌ గొంతులోనే ఉంటోంది. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో సీటీ వ్యాల్యూ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతమాత్రాన తీవ్రత ఉన్నట్లు భావించనక్కర్లేదు. ఇన్ఫెక్షన్‌, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందనుకోవద్దు. ఈ వేరియంట్‌లో సీటీవ్యాల్యూకు, తీవ్రతకు సంబంధం లేదని చెప్పవచ్చు. సీటీవ్యాల్యూ ఆధారంగా హోం ఐసొలేషన్‌ను నిర్ణయించలేం.

-డాక్టర్‌ పరంజ్యోతి, హెచ్‌వోడీ, పల్మనరీ మెడిసిన్‌, నిమ్స్‌


వారం చాలు

లక్షణాలు కనిపించిన తర్వాత వారం పాటు హోం ఐసొలేషన్‌లో ఉంటే సరిపోతుంది. పాజిటివ్‌ వచ్చిన తర్వాత వరుసగా మూడు రోజులు  జ్వరం రాకుంటే ఎటువంటి టెస్టులు అవసరం లేకుండానే కార్యాలయాలకు వెళ్లవచ్చు. జ్వరం, కొద్దిపాటి లక్షణాలు కనిపిస్తే పదిరోజుల పాటు హోం ఐసొలేషన్‌లో ఉండాలి. కొవిడ్‌ సోకి, మందులు వాడకుండా.. మూడు రోజుల పాటు దగ్గు, జ్వరం లేకుంటే ఐసొలేషన్‌ ముగిసినట్లేనని చెప్పవచ్చు. మూడు రోజుల పాటు జ్వరం వంద డిగ్రీలపైగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

  • -డాక్టర్‌ శ్రీధర్‌, హెచ్‌వోడీ, కన్సల్టెంట్‌ క్రిటికల్‌ కేర్‌, అపోలో


పాజిటివ్‌ వచ్చిన వారం తర్వాత ఆఫీసుకు వెళ్తున్నా..

నాకు ఈ నెల 20న తలనొప్పి, గొంతునొప్పి, జలుబు వచ్చాయి. 21న జ్వరం బాగా వచ్చింది. నీరసంగా కూడా ఉంది. ఆ రోజు రాత్రి విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎదుర్కొన్నా. 22న పాజిటివ్‌గా తేలింది. వెంటనే మందులు వాడాను. 25వ తేదీ ఉదయం వరకు  అన్నీ తగ్గాయి. ప్రస్తుతం ఏ ఇబ్బంది లేదు. శనివారం నుంచి ఆఫీసుకు వెళ్లనున్నా.

-నల్లమడుగు జగదీష్‌, ఎల్బీనగర్‌, ప్రైవేటు ఉద్యోగి

Updated Date - 2022-01-29T07:18:38+05:30 IST