పాత సచివాలయంలో ఐసొలేషన్‌

ABN , First Publish Date - 2020-03-28T09:18:57+05:30 IST

కరోనాను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే 14 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 59కి చేరింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య

పాత సచివాలయంలో ఐసొలేషన్‌

డబుల్‌ ఇళ్లు, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కూడా..

బీబీనగర్‌ ఎయిమ్స్‌ వినియోగానికి కేంద్రం ఓకే

జిల్లాల్లో ఆస్పత్రుల వినియోగానికి కార్యాచరణ..

ఇతర ఆస్పత్రుల్లోనూ ప్రత్యేకంగా పడకలు

80 శాతం మంది బాధితులకు ఇంట్లోనే చికిత్స..

20% మందే ఆస్పత్రులకు తరలింపు

జైళ్లలో మాస్కులు, శానిటైజర్ల తయారీ..

కొవిడ్‌కట్టడికి పరికరం.. ఫలించిన డీ స్కలీన్‌  కృషి


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరోనాను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే 14 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 59కి చేరింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగితే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి వంద కరోనా కేసుల్లో 81 శాతం మైల్డ్‌ కేసులు నమోద వుతుండగా.. 14శాతం క్రిటికల్‌ కేర్‌, 5శాతం వెంటిలేటర్‌ కేర్‌ కేసులు నమోదైనట్లుగా లెక్కలున్నాయి. ఈ లెక్కల ఆధారంగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా బాధితుల్లో 80శాతం మందికి ఇళ్లలోనే చికిత్స అందించవచ్చని, మిగతా 20శాతం మందిని మాత్రమే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాల్సి ఉంటుందని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో కలిపి మొత్తం 12,400 పడకలను సిద్ధం చేసిన సర్కారు.. ఇంకా వినియోగించుకునేందుకు వీలున్న భవనాలపై ఆరా తీస్తోంది.


ఇప్పటికే ఖాళీ చేసిన సచివాలయంతోపాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇంజనీరింగ్‌ కాలేజీలను ఐసోలేషన్‌కు వినియోగించుకోవాలని యోచిస్తోంది. బీబీనగర్‌ ఎయిమ్స్‌లోనూ ఐసోలేషన్‌ పడకల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రి, చెస్ట్‌, సరోజిని, కింగ్‌కోఠి, ఈఎ్‌సఐ నాచారంతోపాటు వరంగల్‌ ఎంజీఎంను కరోనా ఆస్పత్రులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని క్రీడా కేంద్రాన్నీ పూర్తి స్థాయి ఆస్పత్రిగా మార్చుతున్నారు. వీటితోపాటు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కలిపి మొత్తం 12,400 పడకలను సిద్ధంగా పెట్టుకుంది. కార్పొరేట్‌ ఆస్పత్రులతోనూ చర్చలు జరిపింది.


1000 పడకల ఐసోలేషన్‌, 200 వెంటిలేటర్స్‌ను అందుబాటులో ఉంచేందుకు వారు అంగీకరించారు. దీంతో మొత్తం 15 వేల వరకు పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో 200, యునాని ఆస్పత్రిలో 50, రామాంతపూర్‌లోని హోమియో ఆస్పత్రిలో 120, బల్కంపేటలోని ప్రకృతి చికిత్సాలయంలో 250, నిమ్స్‌లోని ఓ భవనంలో 40  పడకలను సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే జిల్లా ఆస్పత్రులనూ వాడుకునేలా ప్రణాళిక రచిస్తున్నారు. అవి కూడా సరిపోని పరిస్థితి తలెత్తితే ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలనూ సిద్ధం చేసేందుకు, మొత్తంగా 60 వేల కేసులు వచ్చినా ఒకేసారి చికిత్స అందించేందుకు సన్నద్ధమవుతోంది. 


వైద్యులు, సిబ్బంది భర్తీకి చర్యలు

రాష్ట్రంలో ప్రస్తుతం 8వేల మంది ప్రభుత్వ వైద్యులు ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వారి సంఖ్య సరిపోదని సర్కారు భావిస్తోంది. అందుకే రిటైర్డ్‌ డాక్టర్లతో పాటు, ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారి సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది. 10-14 వేల మంది వైద్య సిబ్బందిని అదనంగా ఉంచుకోవాలని, వారిని పూల్‌లో పెట్టుకోవాలని భావిస్తోంది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసినట్లు తాజాగా సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-28T09:18:57+05:30 IST