షుగర్‌ స్లిప్పులు లేవు..!

ABN , First Publish Date - 2020-08-11T11:52:58+05:30 IST

స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ పాజిటివ్‌ షుగర్‌ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లాలో కొవిడ్‌తో జూలైలో 130 మంది, ఆగస్టులో

షుగర్‌ స్లిప్పులు లేవు..!


  • ఇండెంట్‌ పెట్టి నెల గడిచినా...
  • స్టేట్‌ కొవిడ్‌ సెంటర్‌లో దారుణం
  • కరోనా సోకినవారు విలవిల
  • పాజిటివ్‌ మృతుల్లో వీరే అధికం


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 10: స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ పాజిటివ్‌ షుగర్‌ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లాలో కొవిడ్‌తో జూలైలో 130 మంది, ఆగస్టులో ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారు. వీరిలో అత్యధికంగా షుగర్‌ బాధితులు ఉన్నారు. గ్లూకో మీటర్‌ స్లిప్‌ల కోసం నెల రోజుల క్రితం వైద్యులు ఇండెంట్‌ పెట్టారు. పది రోజుల క్రితం స్లిప్‌ల సరఫరా పూర్తిగా నిలిచి పోయినట్లు సమాచారం. దీంతో కొవిడ్‌ సోకిన షుగర్‌ బాధితులకు సరైన వైద్యం అందడం లేదు. ఏజెన్సీలు ఇచ్చే కమిషన్‌కు కక్కుర్తి పడి ఆసుపత్రికి చెందిన అధికారులు, కాంట్రాక్టు ఉద్యోగి బాధితులను గాలికి వదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. షుగర్‌ పరీక్షలు నిలిచిపోవడంతో కళ్లెదుటే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారని కొందరు వైద్యులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఇదీ పరిస్థితి.. 

స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌ బాధితులు 900 మందికి పైగా ఉన్నారు. వీరిలో 300 నుంచి 350 మంది కొవిడ్‌ షుగర్‌ బాధితులు ఉంటారు. ఆక్సిజన్‌ మీద, వెంటిలేటర్‌ మీద ఉన్న షుగర్‌ బాధితులకు వైద్యులు స్టెరాయిడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే గానీ వారు కోలుకునే అవకాశం ఉండదు. స్టెరాయిడ్స్‌ వాడటం వల్ల బాధితులకు షుగర్‌ లెవెల్స్‌ బాగా పెరుగుతాయి. దీన్ని గుర్తించేందుకు రోజూ మూడు పూటలా షుగర్‌ పరీక్షలు నిర్వహించి, తగిన విధంగా ఇన్సులిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జీజీహెచ్‌లో బాధితులకు రోజుకు ఒక్కసారి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాత్రి వేళల్లో పరీక్షలు నిర్వహించడం లేదు. దీంతో షుగర్‌ స్థాయి బాగా పెరిగి బాధితులు చనిపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 


నెల రోజులుగా.. 

షుగర్‌ స్లిప్‌లు సరఫరా కావడం లేదని, అంతకు మునుపు కూడా అరకొరగా ఇచ్చారని కొందరు వైద్యులు అంటున్నారు. దీనివల్ల సరైన చికిత్స అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండెంట్‌ పెట్టి నెల అయినా స్పందన లేదని అంటున్నారు. ఆరోగ్యశ్రీ నిధుల కింద షుగర్‌ సిప్ల్‌లను అత్యవసరంగా కొనే వీలుంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేద్దామని అనుకున్నా, బాధితులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వారి బంధువులకు లోపలికి వచ్చేందుకు అనుమతి లేదు. 


ఇంతకీ ఏం జరిగింది?

కొవిడ్‌ బాధితులకు అత్యవసర మందులు కావాలంటే ఆరోగ్యశ్రీ కింద కొనుగోలు చేయవచ్చు. ఇండెంట్‌ పెట్టినా కొనుగోలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండెంట్‌ పెట్టిన ఒక్కటి రెండు రోజుల్లో మందులు, ఇంజెక్షన్‌లు, కిట్లు అత్యవసరంగా కొనుగోలు చేయవచ్చు. అయితే ఏజెన్సీలు ఇచ్చే ప్యాకేజీ కోసం ఆసుపత్రి అధికారులు, ఆరోగ్యశ్రీలో కొందరు కావాలని ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీలతో ఒప్పందం తర్వాతనే మందులను, ఇతరాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయం ఆసుపత్రి అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్‌ బాధితులకు రక్తం గడ్డ కడితే ఇచ్చే మందులు కూడా ఆసుపత్రిలో లేనట్లు తెలుస్తోంది. నెల రోజులుగా ఈ మందుల సరఫరా ఆగిపోయింది. ఇంతవరకు ఆరోగ్యశ్రీ కింద కొనుగోలు చేయలేదు. 


కొరత లేదు..

కొవిడ్‌ బాధితులకు రెగ్యులర్‌గా షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. షుగర్‌ నిర్ధారణ సిప్ల్‌ల కొరత లేదు. ఒక్కొక్క వార్డుకు 50 కావాల్సి వస్తే 100 సిప్ల్‌లు ఇస్తున్నాం. ఏదైనా మందులు గానీ, కిట్లు గానీ అయిపోతే ఇండెంట్‌ పెట్టి తీసుకెళ్లాలి. వైరస్‌ తీవ్రత, ఆలస్యంగా ఆసుపత్రికి రావడం తదితర కారణాల వల్ల కొవిడ్‌ మరణాలు జరుగుతున్నాయి.

 డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌, కర్నూలు జీజీహెచ్‌

 


Updated Date - 2020-08-11T11:52:58+05:30 IST