హమాస్‌ దాడుల్లో కేరళ యువతి మృతిపట్ల ఇజ్రాయెల్‌ విచారం

ABN , First Publish Date - 2021-05-17T13:27:46+05:30 IST

ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ నిర్వహించిన రాకెట్‌ దాడుల్లో కేరళకు చెందిన 30 ఏళ్ల యువతి సౌమ్య సంతోష్‌ మృతిపట్ల ఈజ్రాయెల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె మృతి పట్ల దక్షిణ భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి జొనాథన్‌ జడ్కా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం కేరళ..

హమాస్‌ దాడుల్లో కేరళ యువతి మృతిపట్ల ఇజ్రాయెల్‌ విచారం

మృతురాలు సౌమ్య ఇంటికి దక్షిణ భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి

తమ దేశ ప్రజల తరఫున తీవ్ర సంతాపం, పరామర్శ

ఇడుక్కి, గజా సిటీ, మే 16: ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ నిర్వహించిన రాకెట్‌ దాడుల్లో కేరళకు చెందిన 30 ఏళ్ల యువతి సౌమ్య సంతోష్‌ మృతిపట్ల ఈజ్రాయెల్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆమె మృతి పట్ల దక్షిణ భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి జొనాథన్‌ జడ్కా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం కేరళ కీరిథోడ్‌లోని సౌమ్య ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. తాను సౌ మ్య కుటుంబసభ్యులను కలిసి సానుభూతి తెలియజేశానని, ఆమె మృతిపట్ల ఇజ్రాయెల్‌ ప్రజల తరఫున సంతాపం వ్యక్తం చేశానని జొనాథన్‌ జడ్కా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీన ఇజ్రాయెల్‌ ప్రజలు లక్ష్యంగా హమాస్‌ సంస్థ జరిపిన దాడుల్లో సౌమ్య మృతిచెందారు. ఆదివారం ఆమె అంత్యక్రియలను కుటుంబసభ్యులు కీరిథోడ్‌లోని ఓ చర్చిలో కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం నిర్వహించారు. అంతకుముందు ఆమె నివాసానికి ప్రజలు వెళ్లి నివాళులర్పించారు.


కాగా ఇజ్రాయెల్‌-పాలస్తీనియన్ల మధ్య నెలకొన్న తీవ్ర ఘర్షణ మరింత ఆందోళనకర పరిణామాలకు దారితీస్తోంది. పాలస్తీనియన్లపై దాడులను  ఇజ్రాయెల్‌ ఉధృతం చేసింది. ఆదివారం గాజా పట్టణంలోని మూడు భారీ భవంతులను లక్షంగా దాడులు నిర్వహించింది. ఆ భవంతులన్నీ నేలమట్టం కాగా 42 మంది మృతిచెందారు. మృతుల్లో 16 మంది మహిళలు, 10 మంది పిల్లలున్నారు. ఇజ్రాయెల్‌కు, హమా్‌సకు మధ్య వారం రోజుల క్రితం ఘర్షణలు మొదలైన తర్వాత ఒక దాడిలో ఇంత మంది మృతిచెందడం ఇదే తొలిసారి. కాగా పాలస్తీనాలోని ఖాన్‌యూనిస్‌ పట్టణంలో ప్రత్యేక దాడులు నిర్వహించి హమా్‌స అగ్రనేత యాహియేష్‌ సిన్వర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. హమాస్‌ నేతలే లక్ష్యంగా చేసుకొని గత రెండ్రోజుల్లో ఇది మూడో దాడి కావడం గమనార్హం.


Updated Date - 2021-05-17T13:27:46+05:30 IST