Omicronతో భయంలేదు.. అందాల పోటీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతి

ABN , First Publish Date - 2021-11-29T12:49:31+05:30 IST

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఓమిక్రాన్‌’తో ప్రపంచమంతా భయపడుతున్నా తాము మాత్రం ‘మిస్‌ యూనివర్స్‌-2021’ పోటీలు జరిపి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలో కరోనా కారణంగా ఆంక్షలు విధించామని, తగు జాగ్రత్తలతో ఈ అందాల పోటీలు నిర్వహిస్తామని ఇజ్రాయెల్‌...

Omicronతో భయంలేదు.. అందాల పోటీలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతి

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఓమిక్రాన్‌’తో ప్రపంచమంతా భయపడుతున్నా తాము మాత్రం ‘మిస్‌ యూనివర్స్‌-2021’ పోటీలు జరిపి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తెలిపింది. తమ దేశంలో కరోనా కారణంగా ఆంక్షలు విధించామని, తగు జాగ్రత్తలతో ఈ అందాల పోటీలు నిర్వహిస్తామని ఇజ్రాయెల్‌ పర్యాటక శాఖ చెప్పింది. ఈ అందాల పోటీలో పాల్గొనే అందరికీ ప్రతి 48 గంటలకు పీసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, అలాగే వైరస్‌కు సంబంధించి ఇతర భద్రతా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 


డిసెంబర్‌ 12న ఐలాట్‌లోని రెడ్ సీ రిసార్ట్‌లో నిర్వహించనున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి యోయెల్‌ రజ్వోజోవ్‌ ఆదివారం వెల్లడించారు. దాదాపుగా 174 దేశాల్లో ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ ప్రసారం అవుతుందని, అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయలేమని ఆయన పేర్కొన్నారు.


ఇజ్రాయెల్‌ దేశంలో ఆదివారం నుంచి మొత్తం 14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్- ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్‌లో ఉ‍న్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్‌ దేశస్తులు కూడా క్వారంటైన్‌లో ఉండాలని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్‌ తెలిపారు.


కాగా మలావి నుంచి వచ్చిన ఓ మహిళా టూరిస్ట్‌కు ఓమిక్రాన్ వైరస్‌ సోకిందని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో శనివారం నుంచే విదేశీయులను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. అర్ధరాత్రి కాబినెట్‌ సమావేశం ఏర్పాటుచేసి మరీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2021-11-29T12:49:31+05:30 IST