వైద్య సిబ్బందికి, 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా 4వ డోసు..!

ABN , First Publish Date - 2022-01-03T23:35:19+05:30 IST

ఒమైక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన వారికి, వైద్య సిబ్బందికి కరోనా టీకా నాలుగో టీకా ఇచ్చేందుకు నిర్ణయించింది.

వైద్య సిబ్బందికి, 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా 4వ డోసు..!

ఇంటర్నెట్ డెస్క్: ఒమైక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన వారికి, వైద్య సిబ్బందికి కరోనా టీకా నాలుగో టీకా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ ఆదివారం ముఖ్య ప్రకటన చేశారు. ఫైజర్, బయెఎన్‌టెక్ సంస్థలు రూపొందించిన టీకాను రెండో బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు గతవారమే అక్కడి ప్రభుత్వం అనుమతించింది. కరోనా నుంచి కాపాడే మరో రక్షణ వలయం మనకు అందింది అని ప్రధాని ఆదివారం వ్యాఖ్యానించారు. టీకాకరణ  ప్రయత్నాల్లో  ఇజ్రాయెల్ మరోసారి అగ్రగామిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 


కాగా.. పెరుగుతున్న కేసుల కారణంగా దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ అత్యున్నత అధికారి ఒకరు పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో లేదా దేశంలో మెజారిటీ ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే స్థాయిలో రోగ నిరోధకశక్తి పెరిగితే..దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారన్న విషయం తెలిసిందే. హెర్డ్ ఇమ్యూనిటీ కారణంగా అంటువ్యాధులు.. కరోనా లాంటి ఆరోగ్య సంక్షోభాలుగా మారే అవకాశాలు సమసిపోతాయి. అంటువ్యాధుల నుంచి కోలుకున్న వారు అధికంగా ఉన్నా లేదా..మెజారిటీ ప్రజలకు టీకాలు అందినా.. సమాజంలో హెర్డ్ ఇమ్యూనిటీ రూపుదిద్దుకుంటుంది.  

Updated Date - 2022-01-03T23:35:19+05:30 IST