Abn logo
May 14 2021 @ 00:56AM

ఇజ్రాయెల్‌ దాష్టీకం

ఇజ్రాయెల్‌–పాలస్తీనా మధ్య కొద్దిరోజులుగా కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకూ పిల్లలూ మహిళలూ సహా కనీసం డెబ్బయ్‌మంది పాలస్తీనియన్లు మరణించారు, ఐదారువందల మంది గాయపడ్డారు. నెత్తిమీద రాకెట్‌దాడులనుంచి రక్షించే అత్యాధునిక ఇనుపగొడుగు ఉన్న ఇజ్రాయెల్‌ వైపు ఈ చావుల సంఖ్య పదిలోపు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అనేక దశాబ్దాల తరువాత ఈ స్థాయి రాకెట్‌దాడులు సాగుతూండటంతో అంతర్జాతీయ నిపుణులు దీనిని యుద్ధమనో, అంతర్యుద్ధమనో అంటున్నారు. ఎన్నివేలమంది పోయినా సరే, హమాస్‌ని చావచితక్కొట్టేవరకూ దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూ అంటున్నారు. 


జెరూసలేమ్‌లోని అల్‌అక్సా మసీదు దగ్గర సోమవారం ఇజ్రాయెల్‌ సైనికులకు, పాలస్తీనియన్లకు మధ్య రేగిన వివాదం ఈ యుద్ధానికి కారణమని అంటున్నారు. అతి ప్రాచీన అల్‌అక్సా మసీదు క్రైస్తవులు, ముస్లింలు, యూదులకు అతి పవిత్రమైనది. ముప్పైఐదు ఎకరాల్లోని ఈ ప్రాంతాన్ని ముస్లింలు మహమ్మద్‌ ప్రవక్త మక్కానుంచి వచ్చి చివరి ప్రార్థన చేసిన పవిత్రప్రదేశంగా విశ్వసించి హరామ్‌ అల్‌ షరీఫ్‌ అని పిలుచుకుంటే, ఒకప్పుడు కొండగా ఉండే ఆ ప్రాంతాన్ని యూదులు టెంపుల్‌మౌంట్‌ అంటున్నారు. ఈ కొండపై వందల ఏళ్ళక్రితం ఉన్న రెండు పవిత్ర ఆలయాలు అనంతరం బాబిలోనియన్లు, రోమన్‌చక్రవర్తి ధ్వంసం చేసినప్పటికీ, దైవశక్తి అక్కడే ఉన్నదనీ, మెస్సయ్య తిరిగివచ్చి మళ్ళీ ఆలయం కడతారని యూదుల నమ్మకం. అరబ్‌ ఇజ్రాయెల్‌ యుద్ధంలో తూర్పు జెరూసలేమ్‌ను జోర్డన్‌నుంచి ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న తరువాత, ఆలయాల పునర్నిర్మాణం అంటూ యూదు అతివాదులు శంకుస్థాపన యత్నాలు చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1994లో జోర్డన్‌తో చేసుకున్న శాంతి ఒప్పందం ప్రకారం, మసీదు పర్యవేక్షణ జోర్డన్‌ వక్ఫ్‌బోర్డు చేతుల్లో ఉంటే, ఇజ్రాయెల్‌ భద్రతాబలగాలు రక్షణ బాధ్యత చూసుకుంటాయి. ముస్లింలు మాత్రమే లోపల ప్రార్థనలు చేసుకుంటే, యూదులు, క్రైస్తవులు స్థలాన్ని సందర్శించవచ్చు, పశ్చిమభాగంలోని గోడ వరకూ పరిమితమై యూదులు ప్రార్థనలనూ చేసుకోవచ్చు. 


ఈ నియమావళిని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఇటీవలికాలంలో ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం మొదలెట్టిందని జోర్డన్‌ ఆరోపణ. తమకూ ప్రార్థనల అనుమతి ఉండాలని ఎంతోకాలంగా యూదు అతివాదులు డిమాండ్‌ చేస్తున్న మేరకు నెతన్యాహూ ప్రభుత్వం సైనికుల అండతో యూదులను లోపలకు చొప్పిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ఇజ్రాయెల్‌ బలగాలతో ఇటీవల పాలస్తీనియన్లకు పెద్ద గొడవ అయింది. అక్కడనుంచి సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించాలని హమాస్‌ డిమాండ్‌ చేయడం ఆరంభించింది. మరోపక్క యూదులు అరబ్‌ల మధ్య ఇతరప్రాంతాల్లో గొడవలు రేగిన నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ పోలీసులు రంజాన్‌ ప్రార్థనలపై నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాలనుంచి ఇజ్రాయెల్‌ బలగాలు పాలస్తీనియన్లను ఖాళీచేయించడానికి ప్రయత్నించడం కూడా అగ్గిరాజేసింది. 


ఇజ్రాయెల్‌ ఇటీవల ‘జెరూసలేమ్‌ డే’ సంబరాలు ఘనంగా నిర్వహించి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి గొలుసుకట్టు చర్యలకు కారణమైందని నిపుణులు అంటున్నారు. ఒక అరబ్‌ కుటుంబంమీద జరిగిన రాకెట్‌దాడి, పన్నెండు అంతస్థుల వ్యాపార భవనం ఉన్న ప్రాంతం తనదేనని ఒక యూదువ్యాపారి ఇజ్రాయెల్‌ కోర్టు నుంచి తీర్పు సాధించి పాలస్తీనియన్లను ఖాళీచేయించడం వంటి పరిణామాలు కూడా ఉద్రిక్తతలకు తోడైనాయి. అనేక అసంతృప్తులు, ఆక్రమణలు అంతిమంగా యుద్ధానికి దారితీశాయి. గత రెండేళ్ళకాలంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగినా కనీస మెజారిటీ సాధించలేకపోయిన నెతన్యాహూకు ఇటువంటి వాతావరణమే కావాలి. మరిన్ని ప్రాంతాల ఆక్రమణనూ, స్థిరనివాసాల ఏర్పాటునూ సమర్థించే పార్టీలు ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించడంతో నెతన్యాహూకు వాటిమద్దతు ఎంతో అవసరం. మరోపక్క పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్‌ అబ్బాస్‌ నాయకత్వంలోని ఫతా ఇజ్రాయెల్‌ దాష్టీకాన్ని మౌనంగా భరిస్తున్నదనీ, తాను పోరాడుతున్నానని హమాస్‌ నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుత ఘర్షణల వెనుక మతం కాక రాజకీయకారణాలే అధికంగా పనిచేస్తున్నాయన్న వాదన కాదనలేనిది. మొన్నటివరకూ ట్రంప్‌ అనుసరించిన విధానాలు కూడా ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. మిగతా ప్రపంచం, భద్రతామండలి, మరీ ముఖ్యంగా జో బైడెన్‌ నాయకత్వంలోని అమెరికా ఒక పూర్తిస్థాయి యుద్ధాన్ని ఏమేరకు నివారించగలవో చూడాలి.

Advertisement