ఇసుక ఏదీ..?

ABN , First Publish Date - 2021-12-04T06:48:10+05:30 IST

ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది అంతా ఆర్భాటమేనని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఇసుక అంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ వట్టిమాటేనని తేలిపోయింది.

ఇసుక  ఏదీ..?

రీచలను ముంచెత్తిన వానలు

జిల్లా అంతటికీ ఒకే రీచ..ఒకే స్టాక్‌ పాయింట్‌

వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టని యంత్రాంగం

ప్రస్తుతం ఉన్నవాటినీ తెరిచే చొరవ శూన్యం

ఇసుకకు తీవ్ర ఇక్కట్లు

అధిక ధరలు చెల్లించినా.. దక్కని దుస్థితి

నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపేస్తున్న వైనం

అనంతపురం కార్పొరేషన, డిసెంబరు3: ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది అంతా ఆర్భాటమేనని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఇసుక అంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ వట్టిమాటేనని తేలిపోయింది. అందరికీ కాదు కదా.. అస్సలు ఎవ్వరికీ ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తుగా ఇసుకను నిల్వ ఉంచుకోవాలన్న చొరవ అధికార యంత్రాంగంలో కొరవడింది. ఇంతలోనే భారీ వర్షాలు రావడంతో నదులు పోటెత్తాయి. ఇసుక రీచలు మునిగిపోయి, ఇసుక ఇక్కట్లు ఏర్పడ్డాయి. అవకాశమున్న చోట ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు యంత్రాంగం చొరవ చూపట్లేదు. వెరసి.. ప్రస్తుతం జిల్లా అంతటికీ ఒకే ఒక రీచ నుంచి ఇసుక సరఫరా చేయాల్సి వస్తోంది. ఇసుక దొరకడమే గగనమైపోయింది. అధిక ధరలు వెచ్చిస్తామన్నా.. బ్లాక్‌లో కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. చేసేదిలేక ప్రజలు, కాంట్రాక్టర్లు నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

జిల్లా అంతటికీ ఒకే ఒక ఇసుక రీచ, ఒకే స్టాక్‌ పాయింట్‌ ఉందంటే ఇసుక ఇక్కట్లు ఎలా ఉంటాయో.. అర్థం చేసుకోవచ్చు. ఇసుక దొరక్క ప్రజలు అగచాట్లు పడుతుంటే... అందరికీ అందుబాటులో ఇసుక అంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఇసుక ఎక్కడ దొరుకుతోంది...? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం కరువైంది. అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీచలు, స్టాక్‌పాయింట్లను అందుబాటులో ఉంచి, ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడంలో ఘోరంగా విఫలమయ్యారు. వర్షాకాలంలో వంకలు, వరదలతో రీచలను ముంచెత్తుతాయని తెలుసు. ముందు జాగ్రత్తగా ఇసుకను నిల్వ ఉంచుకోలేకపోయారు. బాధ్యతలు దక్కించుకున్న తమిళనాడుకు చెందిన జేపీ వెంచర్స్‌ సంస్థ తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. తాజాగా ప్రభుత్వం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టన్ను ధరను చూపుతూ ప్రకటనలిచ్చింది. ఏ నియోజకవర్గంలోనూ స్పష్టంగా ఇసుక అందుబాటులో లేకపోవడం గమనార్హం. భవన నిర్మాణ రంగ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది.


జిల్లా అంతటికీ ఒకటే..

జిల్లాలో వరుసగా వర్షాలు రాకముందు కొంతవరకైనా ఇసుక లభ్యమయ్యేది. వారం రోజుల క్రితం కురిసిన వానలకు ఇసుక రీచలు మునిగిపోయాయి. జిల్లాలో 11 రీచలు, ఆరు డీసిల్టేషన రేవులున్నాయనీ, భవిష్యత్తులో మరిన్ని రీచలు పెంచుతామని అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు వాన దెబ్బకు ఏ రీచలేకుండా పోయింది. రొచ్చుమర్రి కూడా నీట మునిగింది. జిల్లా అంతటా ప్రస్తుతం ఒకే ఒక రీచ నుంచి మాత్రమే ఇసుక సరఫరా అవుతోందంటే నమ్మశక్యం కాదు. రాయదుర్గంలోని జుంజురాంపల్లి రీచ నుంచి మాత్రమే ఇసుకను తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. అంటే జిల్లా అంతటా ఆ రీచ నుంచే వెళ్లాలి.


అనంతకు ఆ స్టాక్‌పాయింటే దిక్కు..

అనంతపురం నగరంలో నిత్యం నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. జిల్లా కేంద్రానికి కూడా ఇసుక లభించడం లేదు. ప్లాస్టింగ్‌కు మాత్రమే పనికివచ్చే గాలి ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన బుక్కరాయసముద్రం స్టాక్‌పాయింట్‌లోని ఇసుక మాత్రమే దక్కుతుండటం గమనార్హం. ఈ ముసుగులో ఇసుక అవసరమైన వారికి వాహనదారులు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో వాహనంపై అదనంగా రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.


రీచలను ముంచేసిన వర్షం

గతంలో పట్టాభూముల్లోని ఇసుకను తరలించవద్దన్న ఆదేశాలతో నిలిపివేశారు. జిల్లాలో అతిపెద్ద రీచలైన పీసీ రేవు, సీసీ రేవు రేవుల్లో రెండేళ్లుగా వరదనీరు ఉండడంతో ఇసుకను తీయడం లేదు. కళ్యాణదుర్గం పరిధిలోని అజ్జయ్యదొడ్డి రీచలో ఇసుక పూర్తిగా అయిపోయింది. ముదిగుబ్బలోని కొడవండ్లపల్లి, ఉప్పలపాడు రీచలు నీట మునిగాయి. యల్లనూరు మండలంలోని లక్షుంపల్లి, శింగవరం రీచలతో వరద నీరు పారుతోంది. బ్రహ్మసముద్రం మండలంలోని గోవిందయ్యదొడ్డి రీచలో ఇసుక తవ్వకాలు ప్రారంభించలేదు. మరికొన్ని ఇసుక దొరికే ప్రాంతాల్లో...  స్థానిక వివాదాలతో ఇసుక సరఫరా చేసుకోలేని దుస్థితి. చిత్రావతి, మద్దిలేరు, పెన్నా, వేదావతి-హగరి తదితర నదుల పరీవాహక ప్రాంతాల్లో వరదలు పోటెత్తడంతో ఇసుక లభించక కష్టాలు రెట్టింపయ్యాయి.

జిల్లాలో ఇదివరకు కొన్ని స్టాక్‌ పాయుంట్లు ఉండేవి. ఆరు నెలలుగా ఎక్కడా స్టాక్‌పాయింట్‌ కనిపించడం లేదు. అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి, రాప్తాడు, ధర్మవరం, హిందూపురం, కదిరి, గుంతకల్లు ఇలా ప్రతి పట్టణ కేంద్రాల్లో స్టాక్‌పాయింట్లు ఉండేవి. ఇప్పుడు స్టాక్‌పాయింట్లు మచ్చుకైనా కనిపించడం లేదు. ముదిగుబ్బ పరిధిలోని కొడవండ్లపల్లి నుంచి సమీపంలోని నల్లబోయినపల్లిలో ఇసుక స్టాక్‌పాయింట్‌ ఉంచారు. కొన్నిరోజుల క్రితం వరకు అక్కడి నుంచి ఇసుకను సరఫరా చేస్తూ వచ్చారు. అక్కడ ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో ఇల్లు నిర్మించేందకు ఇసుక అవసరమనీ, ఇతరులకు సరఫరా చేయకూడదని రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి ఇసుక ఎప్పుడు సరఫరా అవుతుందనే విషయంలో స్పష్టత లేకుండాపోయింది. దీనికితోడు రోడ్డు దెబ్బతినడంతో అటు వైపుగా వాహనాలు సైతం వెళ్లడం లేదు. ప్రభుత్వం, అధికారులు స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. కొత్త రీచల విషయంలోనూ అధికారులు చేతులెత్తేశారనే వాదన వినిపిస్తోంది.


ఎద్దుల బండ్లే దిక్కు

నది పరీవాహక ప్రాంతాల్లో ఎద్దులబండ్లే దిక్కయ్యాయి. హిందూపురం, తాడిపత్రి, పామిడి, గుంతకల్లు, ధర్మవరం తదితర ప్రాంతాలకు ఎద్దులబండ్లలోని ఇసుకే దిక్కయింది. కొందరు ఎద్దులబండ్ల నుంచి తెచ్చిన ఇసుకనే కొనుగోలు చేసుకుంటున్నారు. ఎడ్లబండి ఇసుకను రూ.1200 నుంచి రూ.1500 వరకు వెచ్చించి కొంటున్నారు. అన్ని ప్రాంతాల్లో రీచలు నీట మునగడంతో ఎక్కడా ఇసుక లభ్యం కావడం లేదు. అనంతపురం నగరంతోపాటు చాలా ప్రాంతాలకు జుంజురాంపల్లి నుంచే ఇసుక రావాల్సి ఉంటుంది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేస్తున్న వారు కొంతకాలం వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ఇసుక కష్టాలు తీరాలంటే రీచలలో నీరు ఇంకిపోయే వరకు ఆగక తప్పదనడంలో సందేహం లేదు. ఇప్పట్లో ప్రభుత్వం ఇసుకను అందుబాటులో ఉంచుతుందనే పరిస్థితులైతే కనిపించడం లేదు.


ఇసుకకే రూ.లక్షపైగా:  వెంకటేష్‌, పరిగి

ఏడాది క్రితం ఇంటి కోసం పునాది వేసుకున్నాం. ఇసుకతో చా లాకాలంగా ఇబ్బంది పడుతున్నాం. ఎడ్ల బండి నుంచి రూ. 1500 వరకు ధర నిర్ణయించారు. ఇంటి నిర్మాణ పూర్తి కావాలంటే రూ.లక్షకుపైగా ఇసుకకు ఖర్చు చేయాల్సి వస్తోంది.


ఇసుక దొరకడమే గగనం: శేఖర్‌, అనంతపురం

రెండంతస్తుల ఇంటిని కట్టాలనే ఆలోచన ఉంది. ఇసుక విషయంలో భయమవుతోంది. దొరకడమే గగనంగా మా రింది. పెద్ద టిప్పర్‌ ఇసుకను రూ.25 వేలుపైమాటే చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడో రాయదుర్గం పరిధిలో నుంచి రావాలంటున్నారు. ఇసుకకే అంత డబ్బు పెడితే... మిగిలిన స్టీల్‌, ఇటుక, సిమెంట్‌ లాంటి వాటికి ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. ఇల్లు కట్టడం కష్టమవుతోంది.


Updated Date - 2021-12-04T06:48:10+05:30 IST