యాజలిలో గండ్ర ఇసుక దందా

ABN , First Publish Date - 2021-07-30T06:15:07+05:30 IST

మండలంలోని యాజలి గ్రామంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. బసుకపేరున అనుమతులు తీసుకొని గండ్ర ఇసుకను యథేచ్ఛగా తవ్వుతూ దందా కొనసాగిస్తున్నారు.

యాజలిలో గండ్ర ఇసుక దందా
యాజలిలో ట్రాక్టర్లు పట్టుకున్న అధికారులు

బుసుక అనుమతితో రెచ్చిపోతున్న వైనం  

మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు

కర్లపాలెం, జూలై 29: మండలంలోని యాజలి గ్రామంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. బసుకపేరున అనుమతులు తీసుకొని గండ్ర ఇసుకను యథేచ్ఛగా తవ్వుతూ దందా కొనసాగిస్తున్నారు.  పంట భూములకు బుసుక అనుమతులు తీసుకొని అసైన్డ్‌ భూముల్లోనూ తవ్వుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బసుక తరలింపునకు అనుమతిస్తే ఇసుకాసురులు రెయింభవళ్లు తవ్వకాలు జరుపుతూ కర్లపాలెం, బాపట్ల ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇసుకాసురులు నేరుగా నిర్మాణదారులను సంప్రదించి గండ్ర ఇసుక అందజేస్తాం ఎవరూ అడ్డుకోకుండా చూస్తామని భరోసా ఇస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అవకాశంగా ట్రక్కు ఇసుకను 4 నుంచి 5 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో మాములు ఇసుక 700 నుంచి 800, గండ్ర ఇసుక ధర 1700 నుంచి 1900లోపు ఉండేది. ఇప్పుడు మామూళ్ల కారణంగా మాములు ఇసుక 1400 నుంచి 1900,  గండ్ర ఇసుక 4000 నుంచి 5000 వరకు విక్రయిస్తున్నారు. ఇసుకదందాపై స్థానికులు జిల్లా అధికారులకు సమాచారం అందించటంతో పోలీసులు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బాపట్ల సీఐ శ్రీనివాస్‌కు అప్పజెప్పారు. ఈ విషయంపై తహసీల్దార్‌ మోహన్‌రావును వివరణ కోరగా యాజలిలో గండ్ర ఇసుక తీస్తే కఠినచర్యలు చేపడుతామన్నారు. 


Updated Date - 2021-07-30T06:15:07+05:30 IST