స్టాలిన్‌ కుమార్తె ఇంట్లో ఐటీ దాడులు

ABN , First Publish Date - 2021-04-03T07:13:31+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజులు ముందు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కుమార్తె, అల్లుడి నివాసంతో పాటు పార్టీ ప్రముఖుల

స్టాలిన్‌ కుమార్తె ఇంట్లో ఐటీ దాడులు

  • డీఎంకే నేతల నివాసాల్లోనూ తనిఖీలు 
  • ఐటీ దాడులపై డీఎంకే చీఫ్‌ ఫైర్‌  


చెన్నై, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజులు ముందు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కుమార్తె, అల్లుడి నివాసంతో పాటు పార్టీ ప్రముఖుల ఇళ్లల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీగా నగదును దాచి ఉంచారని ఫిర్యాదులు రావటంతో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయంలో చెన్నైలోని నీలాంగరైలో ఉంటున్న స్టాలిన్‌ కుమార్తె సెంతమరై, అల్లుడు శబరీశన్‌ నివాసానికి ఎనిమిదిమంది ఐటీ అధికారులు, ముగ్గురు సాయుధ పోలీసులు వెళ్లారు. ఇంట్లో అన్ని గదులలోనూ క్షుణ్నంగా తనిఖీలు చేశారు.


అదేవిధంగా శబరీశన్‌ కార్యాలయంలో, డీఎంకే ఎన్నికల సలహా సంస్థ ఐప్యాక్‌ కార్యాలయంలో  కూడా తనిఖీలు జరిపారు. శబరీశన్‌ ఇంతకుముందు ఉన్న ఆళ్వార్‌పేట నివాసం, చెన్నై ఎంఆర్‌సీ నగర్‌లోని ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సెంతమరై-శబరీశన్‌ నివాసంలో ఐటీ అధికారులు 1.36 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి ఖర్చుల కోసం దాచుకున్నామని వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందిన అధికారులు డబ్బును వెనక్కి ఇచ్చారు.


కాగా, ఈ దాడులు సాగుతుండగానే స్థానిక అన్నానగర్‌ డీఎంకే అభ్యర్థి మోహన్‌ సోదరుడు కార్తీక్‌ మోహన్‌ నివాసంలో  తొమ్మిదిమంది ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా డీఎంకే అభ్యర్థి మోహన్‌ ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్లేందుకు ఐటీ అధికారులు అనుమతించారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో మోహన్‌ సతీమణి గుడికి వెళ్లి తిరిగొచ్చారు. అధికారులు ఆమెను లోపలకు వెళ్లేందుకు అనుమతించలేదు.


అలాగే శబరీశన్‌ స్నేహితుడు జీస్క్వయర్‌ సంస్థ నిర్వాహకుడు బాలా తదితరుల నివాసం, కార్యాలయాలు సహా 14 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే కరూరులో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ నివాసం, ఆయన సోదరుడు అశోక్‌ గృహంలో మదురై నుంచి వెళ్లిన ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. సెంథిల్‌ బాలాజీ స్నేహితులు శరవణన్‌, మణి నివాసాల్లోనూ దాడులు జరిగాయి. కాగా ఐటీ దాడులను ఖండిస్తూ నీ లాంగరై, అన్నానగర్‌ ప్రాంతాల్లో డీఎంకే నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. 



రాహుల్‌, ఉదయనిధి ఖండన 

డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమార్తె, అల్లుడి నివాసం సహా పార్టీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ దాడులు చేయడాన్ని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దాడులు జరిపిస్తోందని ట్విటర్‌ వేదికగా ఆయన ఆరోపించారు. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ మడత్తుకుళం ప్రచార సభలో మాట్లాడుతూ.. దమ్ముంటే తన నివాసంలో ఐటీ తనిఖీలు జరపాలంటూ సవాల్‌ విసిరారు. 


Updated Date - 2021-04-03T07:13:31+05:30 IST