నైపుణ్యాల కాలపరిమితి రెండు మూడేళ్లే

ABN , First Publish Date - 2020-08-10T05:54:16+05:30 IST

ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు చేసినంత కాలం కొత్త నైపుణ్యాలు నేర్చుకోక తప్పదని నాస్కామ్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ రావు స్పష్టం చేశారు. లేకపోతే వారు ఉద్యోగాలకు పనికి రాకుండా పోతారని హెచ్చరించారు...

నైపుణ్యాల కాలపరిమితి రెండు మూడేళ్లే

  • జాబ్‌లో ఉన్నన్నాళ్లూ నేర్చుకుంటూనే ఉండాలి
  • లేకపోతే ఉద్యోగాలకు పనికిరారు
  • నాస్కామ్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ రావు 

బెంగళూరు: ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు చేసినంత కాలం కొత్త నైపుణ్యాలు నేర్చుకోక తప్పదని నాస్కామ్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ రావు స్పష్టం చేశారు. లేకపోతే వారు ఉద్యోగాలకు పనికి రాకుండా పోతారని హెచ్చరించారు. ఐటీ రంగానికి సంబంధించి ఏ కొత్త నైపుణ్యం నేర్చుకున్నా అది రెండు మూడేళ్లకే పనికి రాకుండా పోతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవాలన్నారు. అప్‌గ్రాడ్‌ అనే ఆన్‌లైన్‌ విద్యాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రవీణ్‌ రావు ఈ విషయం స్పష్టం చేశారు. 


నైపుణ్యాలే అసలు సమస్య : ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీలను  నైపుణ్యాల సమస్య వేధిస్తోంది. ఈ కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న పరిశోధకులు, అనుభవజ్ఞులైన ఉద్యోగులు దొరకడం పెద్ద సమస్యగా మారింది. ‘భారత ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావం’ పేరుతో నాస్కామ్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. విస్తృత స్థాయిలో సమాచారం (డేటా) అందుబాటులో లేకపోవడం ఈ సంస్థల అభివృద్ఙికి పెద్ద అడ్డంకిగా మారింది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుతో సహా వివిధ నగరాల్లోని 13 ఏఐ కంపెనీలను పరిశీలించి నాస్కామ్‌ ఈ అధ్యయనం నిర్వహించింది. కాలేజీల్లో డిగ్రీ స్థాయిలో అప్లయిడ్‌ ఏఐ కోర్పులు ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమస్యను కొంత వరకు అధిగమించవచ్చని పేర్కొంది.


డేటా కూడా సమస్యే : ఏఐ కంపెనీల విశ్లేషణకు పెద్ద మొత్తంలో డేటా అవసరమవుతుంది. అయితే యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లోని దేశాల్లో ‘సమాచార గోప్యత’ చట్టాల కారణంగా చట్టపరంగా డేటా సేకరణ పెద్ద సమస్యగా మారింది. ఆ చట్టాలకు అనుగుణంగా డేటా సేకరించడం పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహరమని స్థానిక ఏఐ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


Updated Date - 2020-08-10T05:54:16+05:30 IST